Sunday, August 28, 2022

‘సెప్టెంబరు 1’పై సర్కారు నిర్బంధ కాండ!
‘సెప్టెంబరు 1’పై సర్కారు నిర్బంధ కాండ!

పెన్షన్‌ విద్రోహ దినంపై ఉక్కుపాదం

కనివినీ ఎరుగని రీతిలో అణచివేత

విజయవాడకు రాకుండా కట్టుదిట్టం

ఉద్యోగులపై బైండోవర్‌ కేసులు 

బలవంతంగా సంతకాల సేకరణ

సొంత వాహనాలూ స్వాధీనం

అమరావతి/విజయవాడ, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): సీపీఎస్‌ రద్దు ఉద్యమంపై రాష్ట్ర ప్రభుత్వం కనివినీ ఎరుగనిస్థాయిలో ఉక్కుపాదం మోపుతోంది. ‘సెప్టెంబరు 1’ని పెన్షన్‌ విద్రోహ దినంగా పాటిస్తూ... ఆ రోజున తలపెట్టిన సీఎం ఇంటి ముట్టడి, విజయవాడలో మిలియన్‌ మార్చ్‌ను విఫలం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా నిర్బంధకాండను అమలు చేస్తోంది. పీఆర్సీ ఉద్యమంలో భాగంగా వందలు, వేల మంది  ఉద్యోగ, ఉపాధ్యాయులు విజయవాడకు తరలి వచ్చి తమ సత్తా చాటిన సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో ‘సెప్టెంబరు 1’ ఉద్యమ అణచివేతే లక్ష్యంగా కదులుతోంది. మరీ ముఖ్యంగా... ఉపాధ్యాయ సంఘాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగసంఘాల నాయకులకు నిన్న మొన్నటి వరకు నోటీసులు ఇచ్చారు. తాజాగా అనేకమందిపై బైండోవర్‌ కేసులూ పెడుతున్నారు. వారిని తహసీల్దార్ల వద్ద హాజరు పరిచి ‘‘మేం ఎలాంటి ఉద్యమాల్లో పాల్గొనం.

 ఏడాదిపాటు ఎలాంటి ఆందోళనల్లో పాల్గొనం. దీనిని ఉల్లంఘిస్తే రూ.50వేలు జరిమానా చెల్లిస్తాం’’ అని బలవంతంగా రాయించుకుని, సంతకాలు చేయించుకుంటున్నారు. విజయనగరంలో యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావును బైండోవర్‌ చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. ‘చలో విజయవాడ’కు వాహనాలు ఇవ్వొద్దంటూ ప్రైవేటు ఆపరేటర్లను హెచ్చరించారు. ఉద్యోగుల సొంత వాహనాలను కూడా స్వాధీనం చేసుకుని.. స్టేషన్లకు తరలిస్తున్నారు. విజయవాడలో లాడ్జ్జీలు, హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 1న ఉద్యోగులు, ఉపాధ్యాయులు గదులు బుక్‌ చేసుకున్నారా... అని తనిఖీ చేశారు. కేవలం సీపీఎస్‌ ఉద్యమాన్ని దృష్టిలో  పెట్టుకుని శనివారం పోలీసులు విజయవాడలో కవాతు నిర్వహించారు. 350 మంది సివిల్‌, ఏఆర్‌, ఏపీఎస్పీ, క్యూఆర్టీ పోలీసులు తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి గాంధీనగర్‌లోని ధర్నాచౌక్‌ వరకు కవాతు చేశారు. తద్వారా... ‘చలో విజయవాడ అంటే ఊరుకోం’ అనే హెచ్చరికలు పంపించారు. 

నిర్బంధానికి భయపడం...

సర్కారు సాగిస్తున్న నిర్బంధ కాండ, అణచివేతపై సంఘాలకు అతీతంగా అందరూ ఏకతాటిపైకి వచ్చి ఎదుర్కోవాలని ఉద్యోగ నేతలు భావిస్తున్నారు. అదే సమయంలో న్యాయపోరాటానికి కూడా సిద్ధమవుతున్నారు. ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీలు సైతం ఈ ఉద్యమానికి కలిసిరావాలని కోరారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు, అధికారులు ఉపాధ్యాయుల పట్ల అప్రజాస్వామికంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నట్టు యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌.వెంకటేశ్వర్లు, కె.ఎ్‌స.ఎస్‌.ప్రసాద్‌ శనివారం తెలిపారు. సీపీఎస్‌ ఉద్యమ నేపథ్యంలో ముందస్తు నోటీసులు ఇస్తూ విజయవాడ వెళితే రూ.2లక్షల పూచీకత్తు చెల్లించాల్సి ఉంటుందని ఉపాధ్యాయులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, ఈ చర్యలతో తమను ఆపలేరని స్పష్టం చేశారు. సొంత మోటారు సైకిళ్లు, కార్లు పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్బంధకాండను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఆంక్షల్ని ఎత్తివేయకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాల్సిఉంటుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి హామీ మేరకు ఓపీఎస్‌ అమలు చేయాలన్నారు. సీపీఎస్‌ రద్దుపై పోరాడుతున్న అన్ని సంఘాలకు యూటీఎఫ్‌ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. 

ప్రభుత్వానిది బ్రిటిష్‌ విధానం

రాష్ట్రప్రభుత్వం ‘విభజించి పాలించు’ అనే బ్రిటిష్‌  విధానాన్ని అమలు చేస్తోందని ఏపీసీపీఎ్‌సఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంటా శ్రీనివాస్‌ ఆరోపించారు. సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకుని పలువురిపై కేసులు బనాయించడం దుర్మర్గమన్నారు. 

వాహనాలు స్వాధీనం చేసుకుంటే ఎలా?: STU 

సీపీఎస్‌ ఉద్యమంలో పాల్గొంటారనే నెపంతో ఉపాధ్యాయుల కార్లు, మోటారు సైకిళ్లను తీసుకువెళ్లి పోలీసుస్టేషన్లలో పెట్టడం సమంజసం కాదని రాష్ట్ర ఉపాఽధ్యాయ సంఘం(ఎస్టీయూ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సాయిశ్రీనివాస్‌, హెచ్‌. తిమ్మన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులను క్రిమినల్స్‌గా భావించి 149, 151 సెక్షన్ల కింద నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమని ధ్వజమెత్తారు. 

నిర్బంధం తగదు: APTF 

సీపీఎ్‌సను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సెప్టెంబరు 1న వివిధ రూపాల్లో తలపెట్టిన నిరసనలు, ర్యాలీలు, పోరాటాలపై ప్రభుత్వం నిర్భందం విధించడం తగదని ఏపీ టీచర్స్‌ ఫెడరేషన్‌(ఏపీటీఎఫ్‌) పేర్కొంది. ఉపాధ్యాయులు, ఉద్యోగులు సెలవులు పెట్టరాదంటూ ఆంక్షలు విధించడం సహజ న్యాయం, లీవ్‌రూల్స్‌ను కాలరాయడమేనని సంఘ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, ఎస్‌.చిరంజీవి దుయ్యబట్టారు. 

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎంఈవో పోస్టులన్నింటినీ ప్రభుత్వ యాజమాన్యంలోని గ్రేడ్‌-2 హెడ్మాస్టర్లతో భర్తీ చేయడం ఉమ్మడి సర్వీస్‌ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని తెలిపారు. 

అందరూ కలసిరండి: దాస్‌ సీపీఎస్‌ 

రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబరు 1న చేపట్టిన సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమానికి ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీలు, సంఘాలు కలిసిరావాలని ఏపీసీపీఎ్‌సయూఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం దాస్‌ పిలుపునిచ్చారు. మొండిగా వ్యవహరిస్తున్న ప్రభుత్వంపై ఉమ్మడి పోరాటం చేయకపోతే.. భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల మనుగడ ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు


0 comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

SEARCH THIS SITE

RECENT NEWS

TRANSFERS/PROMOTIONS 2022

✺ TEACHERINFO వాట్సాప్ గ్రూప్ లింక్స్ ✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

CETS/NOTIFICATIONS/RESULTS

HEALTH

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top