PRC NEWS | ఏ ఉద్యోగి జీతం నుంచీ రికవరీ చేయొద్దు ....!

రికవరీ చేయొద్దు ఏ ఉద్యోగి జీతం నుంచీ

సాంకేతిక అంశాలున్నందున కౌంటర్‌ దాఖలు చేయండి 

నోటీసులు జారీచేసిన ధర్మాసనం 

సమ్మె ఏ సమస్యకూ పరిష్కారం కాదు 

విచారణ పెండింగ్‌లో ఉండగా మర్యాద పాటించాలి: న్యాయస్థానం

అమరావతి, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): 

పీఆర్‌సీ ఉత్తర్వుల ఆధారంగా ఏ ప్రభుత్వ ఉద్యోగి జీతం నుంచీ ఎలాంటి రికవరీలూ చేపట్టవద్దని హైకోర్టు రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యవహారంపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక, రెవెన్యూ, హోం శాఖల ముఖ్య కార్యదర్శులకు, పే రివిజన్‌ కమిషన్‌ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలిచ్చింది. పీఆర్‌సీ విషయంలో ప్రభుత్వం గత నెల 17న జారీ చేసిన జీవో నంబర్‌ 1ని సవాల్‌ చేస్తూ ఏపీ గెజిటెడ్‌ అధికారుల జేఏసీ చైర్మన్‌ కేవీ కృష్ణయ్య వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం మంగళవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. 

బెంచ్‌ హంటింగ్‌ను ప్రోత్సహించం: 

సీజేవిచారణ ప్రారంభమైన వెంటనే.. ఈ వ్యాజ్యం బెంచ్‌లు మారిన తీరును సీజే ప్రస్తావించారు. రిట్‌ నిబంధనల ప్రకారం వ్యాజ్యం ధర్మాసనం ముందు విచారణకు రావాలని సింగిల్‌ జడ్జి వద్ద అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరాం చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. అదే విషయాన్ని వేరే ధర్మాసనం ముందు ఎందుకు ప్రస్తావించలేదని ఆయ న్ను ప్రశ్నించారు. బెంచ్‌ హంటింగ్‌ను ప్రోత్సహించేది లేదని తేల్చిచెప్పారు. జరుగుతున్న పరిణామాలపై సంతోషంగా లేమని వ్యాఖ్యానించారు. ఏజీ స్పందిస్తూ.. విభజన చట్టం నుంచి సమస్య ఉత్పన్నం కాలేదనే కారణంతో జస్టిస్‌ అహసనుద్దీన్‌ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం రోస్టర్‌కు అనుగుణంగా వ్యాజ్యాన్ని వేరే బెంచ్‌ ముందు ఉంచాలని ఆదేశించిందన్నారు.

వేతనాల్లో పెరుగుదల ఉంది: 

ఏజీప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపిస్తూ.. కొత్త పీఆర్‌సీ అమల్లోకి వచ్చాక ఉద్యోగుల జీతా ల్లో పెరుగుదల ఉందన్నారు. డిసెంబరు జీతంతో పోల్చి తే జనవరి  జీతంలో నెట్‌/గ్రాస్‌ పెరిగిందని తెలిపారు.

డీఏ, హెచ్‌ఆర్‌ఏ తగ్గినట్లు ఉన్నాయే!

ప్రభుత్వం అందజేసిన వివరాలు పరిశీలిస్తే డీఏ, హెచ్‌ఆర్‌ఏ తగ్గినట్లు కనపడుతోంది కదా అని ధర్మాసనం ఏజీని ప్రశ్నించింది. రికవరీ చేస్తారని పిటిషనర్‌ ఆందోళనలో ఉన్నారని వ్యాఖ్యానించింది. పే రివిజన్‌ పూర్తిగా సాంకేతిక అంశాలతో ఇమిడి ఉన్న నేపఽథ్యంలో దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.

సమ్మె పరిష్కారం కాదు

ఏజీ వాదనలు వినిపిస్తూ.. గత డివిజన్‌ బెంచ్‌ వద్ద విచారణ సందర్భంగా అప్పటి పరిస్థితులను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చానన్నారు. వ్యాజ్యం విచారణలో ఉండగా సమాంతరంగా సమ్మె నోటీసు ఇచ్చారని మాత్రమే చెప్పానన్నారు. సమ్మెను నిలువరించాలని కోరలేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ... ఏ సమస్య కైనా సమ్మె పరిష్కారం కాదని వ్యాఖ్యానించింది. వ్యాజ్యం విచారణలో ఉన్నప్పుడు కొంత మర్యాద పాటించాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొంది. విచారణ పెండింగ్‌లో ఉండగా సమ్మె చేస్తే మంచి, చెడు ప్రభావాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఒకరకంగా ఇది న్యాయస్థానం పై ఒత్తిడి తీసుకురావడం లాంటిదేనని అభిప్రాయపడింది.

 ప్రభుత్వం అందజేసిన వివరాలు పరిశీలిస్తే ఉద్యోగుల డీఏ, హెచ్‌ఆర్‌ఏ తగ్గినట్లు కనపడుతోంది కదా! విచారణ పెండింగ్‌లో ఉండగా సమ్మె చేయడం.. ఒకరకంగా న్యాయస్థానంపై ఒత్తిడి తీసుకురావడం లాంటిదే.- హైకోర్టు ధర్మాసనం

జీతాలు తగ్గుతున్నాయ్‌.. 

అనంతరం పిటిషనర్‌ తరఫు న్యాయవాది పి.రవితేజ వాదనలు వినిపించారు. పీఆర్‌సీ ఉత్తర్వులతో జీతాలు తగ్గుతున్నాయన్నారు. వేతన సవరణ జీవోతో వ్యక్తిగతంగా నష్టం జరగడంతో పిటిషనర్‌ వ్యాజ్యం వేశామని తెలిపారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి అశుతోష్‌ మిశ్రా నేతృత్వంలో 2018లో ప్రభుత్వం పే రివిజన్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు. కమిషన్‌ లేవనెత్తిన పలు అంశాలపై పిటిషనర్‌ సమగ్ర వివరాలు అందజేశారన్నారు. అయితే ఆ కమిషన్‌ నివేదికను గానీ, తదనంతరం  ఏర్పాటు చేసిన కార్యదర్శుల కమిటీ నివేదికను గానీ సర్కారు బయటపెట్టలేదని తెలిపారు. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌తో సమావేశాలు జరిపినప్పటికీ నివేదికను బహిర్గతం చేయలేదన్నారు. ప్రస్తుత పీఆర్‌సీ 2018 జూలైౖ1 నుంచి అమలవుతుదని పేర్కొనడం ద్వారా.. ఇప్పటివరకు ఉద్యోగులకు అదనంగా చెల్లించి ఉంటే ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా ఉద్యోగుల నుంచి రికవరీ చేసేందుకు ప్రభుత్వం అధికారం తీసుకుందని తెలిపారు. గతంలో విచారణ సందర్భంగా ఉద్యోగ సంఘాలు సమ్మెకు వెళ్లబోతున్నాయని.. నిలువరించాలని ఏజీ కోరారని గుర్తుచేశారు.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad