Wednesday, February 2, 2022

NEW PRC PAY: పే స్లిప్‌ చూసి మోసపోకుమా! జీతం పెరిగిందంటూ అంకెల గారడీ

డిసెంబరు నెల డీఏ దాచిన వైనం జనవరిలో కలిపి చూపించి మాయ


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

అనుకున్నదే అయ్యింది! ఉద్యోగులతో సర్కారు ‘అంకెలాట’ ఆడింది. ఎప్పటి నుంచో రావాల్సిన 5 డీఏలను ఇప్పుడు బేసిక్‌లో కలిపేసి.. ‘మీ జీతం పెరిగింది. తగ్గలేదు’ అంటూ కట్టుకథలు చెబుతోంది. పే స్లిప్‌ చూస్తే నిజంగానే జీతం పెరిగినట్లు కనిపిస్తుంది. కానీ... డీఏల విషయంలోనే ప్రభుత్వం అసలు కనికట్టు చేసింది. ఉద్యోగులకు ఈ లెక్క సులువుగానే అర్థమైపోతుంది. సామా న్య ప్రజలు మాత్రం ‘జీతం పెరిగినా ఏమిటీ గోల’ అని అనుకునేలా ప్రభుత్వం ఈ మాయలు చేసిందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఐఆర్‌ కంటే ఫిట్‌మెంట్‌ తగ్గించి, హెచ్‌ఆర్‌ఏ తగ్గించి, సిటీ కన్వేయన్స్‌ అలవెన్స్‌(సీసీఏ) తగ్గించినప్పటికీ... ‘జీతాలు తగ్గవు. పెరుగుతాయి’ అని ప్రభుత్వం మొదటి నుంచీ చెబుతున్న సంగతి తెలిసిందే. సోమవారం ‘శాంపిల్‌’కు కొన్ని ప్లే స్లిప్పులను సర్కారు విడుదల చేసింది. ‘ఇదిగోండి... డిసెంబరు నెలకంటే, జనవరి నెల జీతం ఇంత పెరిగింది’ అని లెక్కలు వేసి చూపించింది. అంతేకాదు... జీతం చాలా పెరిగిందని చెప్పేందుకు డిసెంబరు నెలలో ఇవ్వాల్సిన జీతాన్ని తక్కువ చేసి చూపించింది. ఎలాగంటే... రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడేళ్లుగా డీఏలు పెండింగ్‌ ఉన్నాయి. వాటన్నింటినీ క్లియర్‌ చేస్తూ జనవరిలో జీవోలు ఇచ్చారు. అంటే... డిసెంబరు నెల జీతంలోనే ఆ డీఏలు కలవాలి. కానీ... ప్రభుత్వం ఆ పని చేయలేదు. అలా డిసెంబరులో ఎగ్గొట్టిన డీఏను జనవరిలో కొత్త పీఆర్సీతో కలిపి చూపించారు. దీంతో... జీతం భారీగా పెరిగినట్లు కనిపిస్తోంది. సచివాలయంలో పని చేసే ఒక ఉద్యోగి పే స్లిప్‌ను చూసినప్పుడు ఈ విషయం అర్థమైంది. సదరు ఉద్యోగికి డిసెంబరులో పెండింగ్‌ డీఏల (21.736 శాతం) రూపం లో అందాల్సిన రూ.6898ను డిసెంబరు పే స్లిప్‌లో చూపించలేదు. 1.1.2014 నుంచి 1.1.2019 వరకు ఉన్న డీఏ మాత్రం చూపించారు. దీంతో... జనవరిలో జీతం భారీగా పెరిగినట్లు కనిపించింది. ఫిట్‌మెంట్‌లో 4 శాతం, హెచ్‌ఆర్‌ఏలో గరిష్ఠంగా 14 శాతం, సీసీఏ తొలగింపుతో జీతం 20 శాతం వరకు తగ్గిందని ఉద్యోగులు చెప్తున్నారు. ఈ నష్టాన్ని కనపడకుండా చేసేందుకే ప్రభుత్వం పేస్లిప్పుల్లో 2019 జనవరి 1 నుంచి 2021 డిసెంబరు 31 వరకు తమకు రావాల్సిన డీఏలు మొత్తం 20 శాతాన్ని ఈ పేస్లిప్పుల్లో కలిపి చూపించిందని వివరించారు. ఇత ర రాష్ట్రాలు, కేంద్రం తన ఉద్యోగులకు ప్రతి 6 నెలలకొకసారి డీఏ ఇస్తున్నాయి. జగన్‌ ప్రభు త్వం మాత్రం మూడేళ్లుగా పెండింగ్‌లో పెట్టి, ఇప్పుడు ఒకేసారిచ్చి.. దానినే పెంపుగా చూపించింది.  

’ఊ’ అనిపించునేందుకు తిప్పలు:

కొత్త పీఆర్సీపై ఉద్యోగులను ఒప్పించడానికి ప్రభుత్వం సైబర్‌ నేరగాళ్ల బాటపట్టింది. ముందు గా ఉద్యోగుల ఫోన్లకు జీతాల పేస్లిప్పులను వెబ్‌సైట్‌ లింక్‌తో పంపిస్తోంది. ఆ లింక్‌ క్లిక్‌ చేసి కొత్త పేస్లిప్పులు చూసుకోవాలని కోరుతోంది. దానిని ఓపెన్‌ చేస్తే ఉద్యోగులు కొత్త పీఆర్సీకి అంగీకరించారంటూ కోర్టుకు ఆధారాలుగా కింద సమర్పించే ప్రమాదం ఉండడంతో ఉద్యోగులు చాలా అప్రమత్తంగా ఉంటున్నారు. తమ ఎత్తు ఫలించలేదని గ్రహించిన ప్రభుత్వం.. అవే పే స్లిప్పుల లింకులను ఆ ఉద్యోగి కుటుంబ సభ్యులకు పంపిస్తోంది. దీనిపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ప్రభుత్వం సైబర్‌ నేరగాళ్ల తరహాలో తమపై, తమ కుటుంబాలపై వల విసురుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ పీఆర్సీని అమలుచేసే సమయంలో ప్రభుత్వం ప్రతి ఉద్యోగికి ఒక ఫారం ఇస్తుందని,  తమకేవైనా అభ్యంతరాలుంటే ఉద్యోగులు అందులో రాయొచ్చని అవి మాత్రమే చెల్లుతాయని ఉద్యోగులు చెప్తున్నారు.

మీ జనవరి నెల కొత్త పే స్లిప్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి 


0 comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

SEARCH THIS SITE

EDUCATIONAL UPDATES

TRENDING

AMMA VODI 2022  
✺ TEACHERINFO వాట్సాప్ గ్రూప్ లింక్స్ ✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

Mid Day Meal

HEALTH

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top