Saturday, January 29, 2022

PRC NEWS: కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు:తేల్చి చెప్పిన కమిటీ కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు:తేల్చి చెప్పిన కమిటీ 

స్ట్రైక్ చేస్తే ఎం జరగాలో అదే జరుగుద్ది . . బొత్స 

చర్చలకు వస్తే పాత జీతాలపై ఆలోచించేవాళ్లం: సజ్జల

అమరావతి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు జనవరి నెల వేతనాలు చెల్లిస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాలు చర్చలకు వచ్చి ఉంటే పాత జీతాలు వేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించేదన్నారు. శుక్రవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలకు...ఉద్యోగ సంఘాల నాయకులు పెట్టిన మూడు డిమాండ్లకు మధ్య సంబంధంలేదు. ముఖ్యమైన హెచ్‌ఆర్‌ఏ సవరణ అంశాన్ని ఉద్యోగ సంఘాలు ప్రస్తావించడం లేదు. హెచ్‌ఆర్‌ఏ శ్లాబుల వల్ల నష్టం జరుగుతుందని ఉద్యోగ సంఘాలు భావిస్తే దానిపై చర్చించడానికి మంత్రుల కమిటీ సిద్ధంగానే ఉంది. ఉద్యోగ సంఘాల కంటే ఎక్కువగా ఉద్యోగుల బాగోగుల గురించి ప్రభుత్వం ఆలోచించింది.

అందువల్లే ఉద్యోగ సంఘాలను పదేపదే పిలిపించి పీఆర్సీపై మాట్లాడాం. ఆర్థిక సమస్యల కారణంగా ఒకటీ రెండు అంశాలపైనే దృష్టి పెట్టాలని ఉద్యోగ సంఘాలకు చెప్పాం. ప్రాధాన్యత దృష్ట్యా ఫిట్మెంట్‌పై నిర్ణయమే కీలకమని ఉద్యోగ సంఘాలు అప్పట్లో చెప్పాయి. ఇప్పుడు మాటమార్చి మరోలా వ్యవహరించడం సరికాదు’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కొత్త పేస్కేళ్లతో వేతన బిల్లులను రూపొందిస్తున్న డీడీవోలను పని చేసుకోనివ్వకుండా ఉద్యోగ నేతలు అడ్డుకోవడం సబబు కాదని అన్నారు. మొండిగా ఉద్యోగ సంఘాలు: బొత్స‘‘ఉద్యోగ సంఘాలతో చర్చించడానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్నాం. పీఆర్సీ సాధన సమితిని చర్చలకు రావాలని పిలిచాం. గత ఐదు రోజులుగా చాలా ఎడిమెంట్‌గా (మొండిగా) వ్యవహరిస్తున్నారు. ఈ మాట అనడానికి కాస్త ఇబ్బంది అయినా తప్పడంలేదు’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. శుక్రవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగ సంఘాలు రాజకీయ ఆలోచనలతో ఉద్యమం చేస్తున్నాయా అని మంత్రి వ్యాఖ్యానించారు. ‘‘మేం ఒకటికి రెండు మెట్లు దిగి మాట్లాడతాం అంటే దాన్ని అలుసుగా తీసుకుంటున్నారు. అయితే, ప్రభుత్వం మాకు బాధ్యత అప్పగించింది కాబట్టి ఎన్ని మెట్లు అయినా దిగుతాం.  ఏదైనా అడిగేటప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, కొవిడ్‌ పరిస్థితులను ఉద్యోగులు దృష్టిలో పెట్టుకోవాలి. గతంలో కంటే ఎక్కువగా పీఆర్సీ ఇచ్చాం. ఉద్యోగుల జీతాలు పెరుగుతాయో తగ్గుతాయో ఒకటో తేదీన పే స్లిప్‌ చూసుకోవాలి. ఒక్కరికి కూడా రూపాయి కూడా తగ్గదు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారం చర్చల వల్లే దొరుకుతుంది. మేం ఎలాంటి బేషజాలు లేకుండా సోదరభావంతో ఉన్నాం.

ఉద్యోగులకు సమస్య అంటే ప్రభుత్వానికి సమస్య ఉన్నట్లే. ఎలాంటి ఘర్షణ వాతావరణానికి తావులేకుండా చర్చలకు ముందుకు రావాలని పీఆర్సీ సాధన సమితిని ఇప్పటివరకు కోరాం. ఇకపై ప్రతిరోజూ సమితి కోసం సచివాలయానికి వచ్చి ఎదురు చూడం. ఎప్పుడైతే ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు చర్చలకు వస్తాం అంటారో అప్పుడే మంత్రుల కమిటీ తిరిగి అందుబాటులోకి వస్తుంది’’ అని బొత్స తెలిపారు. కాగా, ఇవాళ కొన్ని సంఘాలు చర్చలకు వచ్చాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల తెలిపారు. పీఆర్సీ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు కాకుండా.. వేరే సంఘాల నాయకులు వచ్చి మాట్లాడారన్నారు. మంత్రుల కమిటీతో చర్చలకు వెళ్లినవారిలో పీఆర్టీయూ స్టేట్‌ ప్రెసిడెంట్‌ ఏఎం గిరిప్రసాద్‌, జాయింట్‌ సెక్రటరీ శ్రీధర్‌రెడ్డి, వైఎస్సార్‌ టీచర్స్‌ ట్రేడ్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ కే చిన్నారెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వినుకొండ రాజారావు, వైఎస్సార్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ స్టేట్‌ ప్రెసిడెంట్‌ జాలిరెడ్డి, గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్స్‌ ఫోరమ్‌ ప్రెసిడెంట్‌ ఏవీ పాటిల్‌ ఉన్నారు. పీఆర్సీ జీవోలు రద్దుచేయాలని, హెచ్‌ఆర్‌ఏ స్లాబులు సవరించాలని, పాత జీతాలు ఇవ్వాలని వారంతా కోరారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. ఏ సంఘాలైనా పీఆర్సీపై ప్రతిపాదనలు చెప్పాలన్న ప్రభుత్వ ఆహ్వానాన్ని అందుకుని చర్చలకు వెళ్లామని శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వంతో చర్చలు జరపకపోవడం వల్ల సమస్యపై ప్రతిష్ఠంభన నెలకుంటుందని అన్నారు.  అశుతోశ్‌ మిశ్రా నివేదిక చేతికి రాకుండానే చర్చలకు వెళ్లిన సంఘాలు ఇప్పుడు ఎందుకు ఆగుతున్నారో అర్థం కావడం లేదని వినుకొండ రాజారావు అన్నారు. ‘‘నాయకత్వాన్ని నిలబెట్టుకోవడానికి పీఆర్సీ సాధన సమితి నేతలు వేస్తున్న ఎత్తుగడలు ఇవి?. వారికి ఏమైనా రహస్య ఎజెండా ఉందా?’’ అని ప్రశ్నించారు. 0 comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

SEARCH THIS SITE

EDUCATIONAL UPDATES

TRENDING

AMMA VODI 2022  
✺ TEACHERINFO వాట్సాప్ గ్రూప్ లింక్స్ ✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

Mid Day Meal

HEALTH

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top