Saturday, January 1, 2022

JEE: అడ్వాన్స్‌డ్‌కు మరోసారి చాన్స్‌ అడ్వాన్స్‌డ్‌కు మరోసారి చాన్స్‌

గతేడాది పరీక్ష రాయలేకపోయిన వారికి అవకాశం 

అడ్వాన్స్‌డ్‌కు వరుసగా 2 ఛాన్సులు మాత్రమే.. కరోనా కారణంగా ఈసారి మార్పు 

మెయిన్‌తో సంబంధం లేకుండా హాజరు కావచ్చు 

2020లో ఇంటర్‌ పాసై జేఈఈకి రిజిస్టర్‌ అయిన వారికి అవకాశం.. వారంలో షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం 

కొన్ని చోట్ల అక్రమాలతో 4 విడతల పరీక్షలపై సందిగ్ధత 

2022 జేఈఈకి సిలబస్‌ యథాతథం

సాక్షి, అమరావతి: కోవిడ్‌ కారణంగా గత రెండేళ్లలో (2020, 2021) ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)లలో ప్రవేశానికి జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాయలేకపోయిన వారికి మరోసారి అవకాశం కల్పించాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్ణయించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఈ రెండేళ్లలో దరఖాస్తు చేసి, కరోనా వల్ల పరీక్షలకు హాజరుకాలేకపోయిన వారికి ఈ అవకాశం వర్తిస్తుంది. గత రెండు సంవత్సరాల్లో అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించి ఉంటే వారు జేఈఈ మెయిన్‌–2022తో సంబంధం లేకుండా నేరుగా అడ్వాన్స్‌డ్‌పరీక్షకు హాజరవ్వొచ్చు.

వీరిని నేరుగా అనుమతించడంవల్ల జేఈఈ–2022 మెయిన్‌ అభ్యర్థులకు నష్టం కలగకుండా ఎన్టీఏ చర్యలు చేపడుతోంది. వీరిని జేఈఈ మెయిన్‌–22లో అర్హత సాధించే అభ్యర్థులకు అదనంగానే పరిగణించనుంది. ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు జేఈఈ మెయిన్‌ వరుసగా మూడేళ్లు, అడ్వాన్స్‌డ్‌ వరుసగా రెండేళ్లు రాసుకోవచ్చు. కోవిడ్‌ వల్ల పరీక్షలు రాయలేకపోయిన వారికి ఎన్టీఏ మరో అవకాశమిస్తోంది. ఈసారీ జేఈఈ షెడ్యూల్‌ విడుదల ఆలస్యమైంది. జనవరి మొదటి వారంలో షెడ్యూల్‌ వెలువడే అవకాశముంది.  

నాలుగు విడతల పరీక్షల్లో అక్రమాలు 

జేఈఈ మెయిన్‌ షెడ్యూల్‌ ఏటా ఆరు నెలల ముందు ప్రకటిస్తున్నారు. కరోనా వల్ల రెండేళ్లుగా షెడ్యూల్‌ ప్రకటన, పరీక్షల నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా మారింది. 2021 మెయిన్‌ పరీక్షల షెడ్యూల్‌ను 2020 డిసెంబర్లో ప్రకటించారు. పరీక్షలను ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నాలుగు విడతల్లో నిర్వహించేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. విద్యార్థులు నాలుగు విడతల్లో ఎన్ని సార్లయినా పరీక్ష రాసుకోవచ్చు. ఏ దశ పరీక్షలో మంచి మార్కులు వచ్చాయో వాటిని పరిగణనలోకి తీసుకొని ఎన్‌టీఏ ర్యాంకులు ప్రకటించింది. అయితే చివరి రెండు విడతల పరీక్షలు చాలా ఆలస్యమయ్యాయి.

జేఈఈ మెయిన్‌ 2021 సెప్టెంబర్‌ నాటికి కానీ పూర్తి కాలేదు. అయితే 2021 జేఈఈ మెయిన్‌ నాలుగు విడతల పరీక్షల నిర్వహణలో కొన్నిచోట్ల అక్రమాలు జరిగాయి. తొలి దఫా పరీక్షలో కనీస మార్కులు కూడా సాధించలేని కొందరు అభ్యర్థులు మలి విడతలో టాప్‌ ర్యాంకర్లుగా నిలిచారు. దీనిపై ఆరోపణలు వెల్లువెత్తగా చివరకు సీబీఐ విచారణ చేపట్టింది. హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల్లో కొన్ని కోచింగ్‌ సెంటర్ల యజమానులు అక్రమాలకు పాల్పడి పరీక్ష కేంద్రాల సిబ్బందితో కుమ్మక్కై కాపీయింగ్‌ చేయించినట్లు విచారణలో తేలింది. ఈ కేసులో కోచింగ్‌ సెంటర్ల యజమానులు, సిబ్బందిని సీబీఐ అరెస్టు కూడా చేసింది. అక్రమ పద్ధతుల్లో ర్యాంకులు పొందిన 20 మంది ఫలితాలను ఎన్‌టీఏ రద్దు చేసింది.షెడ్యూల్‌ ఆలస్యం, గత పరీక్షల్లో అక్రమాలతో ఈసారి నాలుగు విడతల పరీక్షల విధానాన్ని అమలు చేస్తారా?  మార్పులుంటాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

సిలబస్‌ యథాతథం 

కోవిడ్‌ కారణంగా వివిధ రాష్ట్రాల్లో హయ్యర్‌ సెకండరీ (ఇంటర్మీడియెట్‌) పరీక్షలు గందరగోళంగా మారాయి. విద్యా సంస్థలు నడవక విద్యార్ధులకు బోధన కరవైంది. ఆన్‌లైన్‌ తరగతుల ప్రభావమూ అంతంతమాత్రమే. పలు రాష్ట్రాలు ఇంటర్మీడియెట్‌ సిలబస్‌ను కుదించాయి. పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటనలోనూ సమస్యలు వచ్చాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని ఎన్టీఏ జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఇంటర్‌ పరీక్షలలో 75 శాతం మార్కులుండాలన్న నిబంధనను కూడా రద్దు చేసింది. ఈసారి జేఈఈకి ఇదివరకటి సిలబస్సే యథాతథంగా  కొనసాగనుంది. 2023 నుంచి కొత్త సిలబస్‌ను ఎన్‌టీఏ ప్రకటించింది.   


SEARCH THIS SITE

LATEST UPDATES

✺ SSC MODEL PAPERS 2022

TRENDING

✺ SSC MODEL PAPERS 2022✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

Mid Day Meal

NAADU NEDU

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top