జగనన్న కోత: రివర్స్ పిఆర్సి పై భగ్గుమన్న ఉద్యోగ సంఘాలు..ఉద్యమానికి సై

 జగనన్న కోత: రివర్స్ పిఆర్సి పై భగ్గుమన్న ఉద్యోగ సంఘాలు

ఉద్యోగ సంఘాలు ఎప్పటినుండో పీఆర్సీ కోసం విజ్ఞప్తులు డిమాండ్లు చేస్తూ ఉండగా ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగ సంఘాలతో సమావేశమై, పిఆర్సి ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన జీవో లు అర్ధరాత్రి విడుదల అయ్యాయి. అయితే విడుదలైన ప్రభుత్వ ఉత్తర్వులు ఉద్యోగ సంఘాలకు పుండు మీద కారం చల్లినట్లు చేశాయి. ఇవాళ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం విడుదల చేసిన జిఓ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశాయి. అవసరమైతే సమ్మె చేయడానికి వెనుకాడమని హెచ్చరించాయి. వివరాల్లోకి వెళితే.. 

జగన్ ప్రభుత్వం ఉద్యోగులకు ఊరట ఇస్తూ 11వ పిఆర్సి ఇచ్చామని చెప్పుకున్నప్పటికీ చివరికి విడుదలైన జీవోల ప్రకారం చూస్తే ఈ పీఆర్సీ ఉద్యోగులకు లాభం కంటే నష్టం కలిగించేలా ఉండడంతో ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై భగ్గుమన్నాయి. రివర్స్ టెండరింగ్ తరహాలో ఇది రివర్స్ పిఆర్సి అని, దీనిని తాము ఒప్పుకోమని ఉద్యోగ సంఘాల నాయకులు విజయవాడ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వ్యాఖ్యానించారు. హెచ్ ఆర్ ఏ లో కోత విధించడమే కాకుండా, ఇవ్వాల్సిన డి ఏ లను కూడా ఐఆర్ లో అడ్జస్ట్ చేయడం ద్వారా ప్రభుత్వం అతి తెలివి తేటలు చూపించి ఉద్యోగులను దెబ్బ తీసిందని ఉద్యోగ సంఘాల నాయకులు వ్యాఖ్యానించారు. 

CCA ఎత్తివేయడం, రిటైర్డ్ ఉద్యోగుల అంత్యక్రియల పెన్షన్ లను తగ్గించడం, గత ప్రభుత్వాలు ఇచ్చిన రాయితీని రద్దు చేయడం, ఇప్పటికే ఉన్నటువంటి ఐఆర్ అంటే తక్కువ ఐఆర్ వచ్చేలా చేయడం, క్వాంటం పెన్షన్ స్లాబ్ లలో మార్పులు చేయడం ద్వారా ఉద్యోగులు నష్టపోయేలా చేయడం, 80 సంవత్సరాల వరకు వచ్చే అదనపు పెన్షన్ రద్దు చేయడం వంటి నిర్ణయాల కారణంగా జీవోలు ఇచ్చిన ఈ రోజుని చీకటి దినంగా తాము భావిస్తున్నామని, అశాస్త్రీయంగా ఇచ్చిన ఈ పీఆర్సి ను తిరస్కరిస్తున్నామని వ్యాఖ్యానించారు. మొత్తం మీద పేరుకు పదకొండవ పిఆర్సి ప్రకటించినట్లు ప్రభుత్వం చెప్పుకుంటూ, నిజానికి తమకు రావలసిన వేతనాల్లోనే 10 నుంచి 15 శాతం పైగా కోత విధించడం తో ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు – ప్రభుత్వ నిర్ణయంపై నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలుపుతామని, ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే ఉద్యమాన్ని చేపట్టడానికి కూడా తాము వెనుకాడమని హెచ్చరించారు. దీనిపై జగన్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

రివర్స్‌ టెండరింగ్‌ తరహాలో రివర్స్‌ ఫిట్‌మెంట్‌ ఇచ్చారు: ఉద్యోగ సంఘాలు


విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ జీవోలపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమను సంప్రదించకుండా పీఆర్సీపై విడుదల చేసిన జీవోలను వ్యతిరేకిస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. సంక్రాంతి తర్వాత సానుకూల నిర్ణయం వెలువడుతుందని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన పీఆర్‌సీ జీవోలపై ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ ఐక్యవేదిక నేతలు విజయవాడలో మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర చరిత్రలో ఇలా జరగలేదు: బండి శ్రీనివాసరావు

‘‘రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఐఆర్ కంటే తక్కువ ఫిట్‌మెంట్‌ ఇచ్చిన దాఖలాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చాలా నిర్ణయాలు ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఉద్యోగులకు ఇచ్చే ఇంటి అద్దె అలవెన్స్ తీసేసి కేంద్ర ప్రభుత్వ నిబంధనలు పెట్టారు. రాజధాని ప్రాంతంలో పని చేసే ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. మాకు కొత్త పీఆర్సీ అవసరం లేదు. ఈ జీవోలు మాకొద్దు. మేం వాటిని తిరస్కరిస్తున్నాం. ఈ పీఆర్సీని ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకొనేది లేదు. ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడే ఇవ్వండి. పదేళ్లకు ఒకసారి ఇచ్చే పీఆర్సీ మాకు అవసరం లేదు. పెన్షనర్ల హక్కులు కూడా ఈ ప్రభుత్వం పోగొట్టింది. ఈ విషయంలో సీఎం జగన్‌ జోక్యం చేసుకోవాలి. రేపు, ఎల్లుండి ఉద్యోగ కమిటీ సమావేశాలు నిర్వహిస్తాం. అన్ని జిల్లాల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతాం. అవసరమైతే సమ్మె కు కూడా సిద్ధంగా ఉన్నాం. పాత పద్ధతిలోనే పీఆర్సీ ఇచ్చే వరకు పోరాడుతాం’’ అని పేర్కొన్నారు.

డీఏలు అడ్డుపెట్టుకొని పీఆర్సీ ఇచ్చారు: బొప్పరాజు వెంకటేశ్వర్లు

‘‘ఉద్యోగ, ఉపాధ్యాయులపై ప్రభుత్వానికి ప్రేమ లేదు. డీఏలు అడ్డుపెట్టుకొని పీఆర్సీ ఇచ్చారు. మాకు ఈ పీఆర్సీ ఆమోదయోగ్యంగా లేదు. పీఆర్సీపై జారీ చేసిన జీవోలు మాకొద్దు. ఇప్పటివరకు ప్రభుత్వంతో అనేక రకాల చర్చలు జరిపాం. కానీ ప్రభుత్వం మాకు వ్యతిరేకంగా జీవోలు తీసుకొచ్చింది.ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఏకతాటిపైకి  వచ్చి ప్రకటించే కార్యాచరణ అమలు చేయాలి. సమ్మెకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం’’ అని తెలిపారు.

20 అంశాలను ప్రభుత్వం పక్కన పెట్టింది: జోసెఫ్‌ సుధీర్‌బాబు 

‘‘ఉద్యోగ, ఉపాధ్యాయ చరిత్రలో ఇదొక చీకటి రోజు. మేము ప్రతిపాదించిన 20 అంశాలను ప్రభుత్వం పక్కన పెట్టింది. రివర్స్‌ టెండరింగ్‌ తరహాలో రివర్స్‌ ఫిట్‌మెంట్‌ ఇచ్చారు. మాకు నష్టం కలిగే పీఆర్సీ వద్దు. కనీసం పాత మధ్యంతర భృతి కొనసాగించడండి. మేం నమ్మిన ప్రభుత్వమే మమ్మల్ని మోసం చేసింది. ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం. జీవోలు వెనక్కి తీసుకోకపోతే ఎంతవరకైనా వెళ్తాం’’ అని ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు జోసెఫ్‌ సుధీర్‌బాబు తెలిపారు.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad