Friday, December 17, 2021

PRC ప్రక్రియను వీలైనంత త్వరగా ముగిస్తాం: ఉద్యోగుల ఆందోళన వాయిదా 


➧ ఉద్యోగుల ఆందోళన వాయిదా

➧ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీతో ఉద్యోగ సంఘాల సానుకూల స్పందన

➧ తాత్కాలికంగా నిరసన విరమణకు ఓకే.. సమస్యల పరిష్కారం దిశగా అడుగులు

➧ దీర్ఘకాలంగా ఉన్న సమస్యలివి.. ఒక్క రోజులో తేలేవి కాదు: ఆర్థిక మంత్రి బుగ్గన

➧ కోవిడ్‌తో కొంత ఆలస్యమైనా అన్నీ పరిష్కరిస్తాం

➧ పీఆర్సీ ప్రక్రియను వీలైనంత త్వరగా ముగిస్తాం: ప్రభుత్వ సలహాదారు సజ్జల 

➧ సీఎం జగన్‌ ఉద్యోగులకు మేలు చేయాలనే దృక్పథంతోనే ఉన్నారు

సాక్షి, అమరావతి: పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీపై ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి. ప్రభుత్వం హామీ ఇచ్చినందున తమ ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రకటించాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ ఉద్యోగ సంఘాలతో గురువారం చర్చలు జరిపారు. రెండు జేఏసీల ప్రతినిధి బృందం, సచివాలయ ఉద్యోగుల సంఘం, గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ప్రతినిధి బృందంతో వేర్వేరుగా చర్చించారు. పెండింగ్‌లో ఉన్న 71 డిమాండ్లను ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. వీటిలో చాలా డిమాండ్లు ఆర్థికేతర అంశాలే.

అన్ని సమస్యలు ఒక్క రోజులో పరిష్కారం అయ్యేవి కావని, చాలా సమస్యలు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని ఉద్యోగ సంఘాలకు ఆర్థిక మంత్రి బుగ్గన వివరించారు. ఉద్యోగ సంఘాలతో సమావేశాలు నిర్వహించి చర్చలు జరపడం నిరంతర ప్రక్రియ అని, దాన్ని కొనసాగిస్తూ పరిష్కారానికి చర్యలు చేపడతామని ఆర్థిక మంత్రి ఇచ్చిన హామీకి ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి. డిమాండ్ల సాధనకే ఆందోళన చేపట్టామని, అవన్నీ పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్పాక ఇంకా ఆందోళన చేయాల్సిన అవసరం లేదని, ఆందోళనను వాయిదా వేస్తామని, ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమిస్తామని భేటీలో ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఆర్థికేతర అంశాలపై వచ్చే బుధవారం మళ్లీ చర్చలకు పిలుస్తామని ప్రభుత్వం తెలియచేసింది.

అన్ని శాఖల కార్యదర్శులు, ఉద్యోగ సంఘాల నేతలతో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి అన్ని అంశాలపై చర్చిద్దామని, సమస్యలకు పరిష్కారం అన్వేషిద్దామని ఆర్థిక మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టమైన హామీ ఇచ్చారు. ప్రభుత్వ స్పందన పట్ల ఉద్యోగ సంఘాలు సంతృప్తి వ్యకం చేశాయి. పీఆర్సీపై  సోమవారానికి తేల్చాలని ఉద్యోగ సంఘాలు కోరగా తాము అదే పనిలో నిమగ్నమైనట్లు సీఎస్‌ తెలిపారు. సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన, ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు.

 ➧ సమస్యల పరిష్కారానికి చర్యలు: మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ 

ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తోంది. కోవిడ్‌ కారణంగా కొంత ఆలస్యమైంది. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు 71 అంశాలను దశల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తాం. ఆర్థికేతర అంశాల పరిష్కారానికి సీఎస్‌ అన్ని విభాగాల సెక్రటరీలతో బుధవారం సమావేశం ఏర్పాటు చేస్తారు. సుహృద్భావ వాతావరణంలో చర్చల ద్వారా సత్ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వం అనే కుటుంబంలో ఉద్యోగులు కూడా భాగమే. రెండు జేఏసీల్లోని 9 సంఘాలు చేస్తున్న ఉద్యమాన్ని విరమించాలని కోరాం. అందుకు వారు అంగీకరించారు. ప్రభుత్వం, ఉద్యోగులు బాగుంటేనే ప్రజా సేవలు సక్రమంగా అందుతాయి. 

➧ పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలని కోరాం: వెంకట్రామిరెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు  

పెండింగ్‌ సమస్యల పరిష్కారంపై ఆర్థిక మంత్రి, సీఎస్‌తో చర్చించాం. సచివాలయంలో పోస్టుల సంఖ్య పెంచాలని విజ్ఞప్తి చేశాం. ఏపీ సచివాలయ ఉద్యోగులకు సంబంధించి 11 అంశాలు, ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌కు సంబంధించి 85 అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఖాళీగా ఉండే ఏఎస్‌వోలు, స్టెనోగ్రాఫర్ల పోస్టుల భర్తీతో పాటు ఆర్థిక శాఖలో ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయడం, గ్రేడ్‌–5 సెక్రటరీలకు జాబ్‌ చార్ట్‌ అమలు, వీఆర్‌ఏ నుంచి వీఆర్వోలుగా ప్రమోషన్‌ పొందిన వారికి డైరెక్ట్‌గా గ్రేడ్‌–1 వీఆర్వో ఇవ్వాలని అడిగాం. సచివాలయ ఉద్యోగులకు ఇంటి స్థలాలు, రాష్ట్ర ఉద్యోగులకు జిల్లా హెడ్‌ క్వార్టర్‌లో 50 ఎకరాలు కేటాయించాలి. మోడల్‌ స్కూళ్లు, గ్రంథాలయాల ఉద్యోగులకు 010 పద్దు కింద జీతాలు, మ్యూచువల్‌ బదిలీలకే కాకుండా జనరల్‌ ట్రాన్స్‌ఫర్లకు అవకాశం కల్పించాలని కోరాం. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వ్యక్తమైంది. 

➧ తాత్కాలికంగా విరమిస్తున్నాం: బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ చైర్మన్‌  

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇచ్చినందున ఆందోళనను  తాత్కాలికంగా విరమిస్తున్నాం. ఉద్యోగుల ఆర్థికపరమైన సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆర్థికేతర డిమాండ్లను కార్యదర్శుల కమిటీ ద్వారా పరిష్కరిస్తామని రాతపూర్వక హామీ ఇచ్చారు. 

➧ సానుకూల స్పందన: బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌  

ప్రభుత్వం ఆదేశించినా ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దాదాపు రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న అంశాలతో పాటు 11వ పీఆర్సీ అమలుపై ప్రభుత్వంతో జరిగిన సుదీర్ఘ చర్చల్లో సానుకూలత వ్యక్తమైంది. ఇక పెండింగ్‌ సమస్యలు పరిష్కారమవుతాయని విశ్వసిస్తున్నాం. 

➧ ప్రధాన అంశాలపై చర్చించాం: సూర్యనారాయణ, గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు  

నిబంధనలకు సంబంధించిన అంశాలు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్నాయి. వాటికి పరిష్కారాన్ని చూపాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఈ విషయంలో చర్చించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పిలిచారు. మా సమస్యలను మూడు అంశాలుగా విభజించి సీఎస్‌కు వివరించాం. వాటిలో ప్రధాన అంశాలపై చర్చించారు. అన్ని డిపార్ట్‌మెంట్ల ప్రిన్సిపల్‌ సెక్రటరీలతో వచ్చే బుధవారం అత్యవసర సమావేశం నిర్వహించి దీనిపై చర్చిస్తామని సీఎస్‌ హామీ ఇచ్చారు.    


0 comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

SEARCH THIS SITE

RECENT NEWS

TRENDING POSTS

✺ TEACHERINFO వాట్సాప్ గ్రూప్ లింక్స్ ✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

CETS/NOTIFICATIONS/RESULTS

HEALTH

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top