Tuesday, December 14, 2021

PRC : వచ్చే ఏడాది అక్టోబరు నుంచి నగదు రూపంలో



 PRC: 14.29 శాతం ఫిట్‌మెంట్‌!

⧬ వచ్చే ఏడాది అక్టోబరు నుంచి నగదు రూపంలో

⧬ ఇంటి అద్దె భత్యమూ తగ్గింపు

⧬ మొత్తం వేతనం తగ్గకుండా రక్షణ

⧬ సీసీఏ ఎత్తివేతకూ ప్రతిపాదన

⧬ అమరావతి ఉద్యోగులకు అదనపు అద్దెభత్యం ఇవ్వబోం

⧬ ఇకపై రాష్ట్ర వేతన సవరణ కమిషన్లు ఉండవు

⧬ హోంగార్డులకు అదనపు ప్రయోజనాలు అక్కర్లేదు

⧬ గ్రాట్యుటీ రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు

⧬ ముఖ్యమంత్రి చేతికి సీఎస్‌ కమిటీ సిఫార్సులు

⧬ పీఆర్సీపై 3 రోజుల్లో సీఎం నిర్ణయం. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ నగదు ప్రయోజనం 2022 అక్టోబరు నుంచి ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలోని కమిటీ సిఫార్సు చేసింది. ఫిట్‌మెంట్‌ 14.29% ఇస్తే సరిపోతుందని అభిప్రాయపడింది. ఇంటి అద్దె భత్యం విషయంలోనూ కేంద్ర వేతన సవరణ సంఘం సిఫార్సుల మేరకు నడుచుకోవాలని సూచించింది. హైదరాబాద్‌ నుంచి అమరావతి తరలివచ్చిన ఉద్యోగులకు 30% అద్దె భత్యం ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చింది. ఇంటి అద్దె భత్యం తగ్గింపుతో కొందరు ఉద్యోగులు ఇప్పుడు అందుకుంటున్న మొత్తం వేతనం కన్నా కొత్త వేతనం తగ్గే ప్రమాదం ఉందని భావించింది. అలా జరగకుండా వారి పాత వేతనానికి రక్షణ కల్పించాలని సిఫార్సు చేసింది. ఇందుకోసం కోతపడే మొత్తాన్ని పర్సనల్‌ పే రూపంలో ఇవ్వాలని సూచించింది. సిటీ కాంపెన్సేటరీ భత్యం ఇక చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చేసింది. పెన్షనర్లకు అదనపు మొత్తం భత్యం ఇప్పుడు 70 ఏళ్లకే ఇస్తున్నారు. ఇకపై 80 ఏళ్లు వచ్చిన తర్వాత ఆ అదనపు భత్యం ఇవ్వాలని సిఫార్సు చేసింది. ఇక ముందు రాష్ట్ర వేతన సవరణ కమిషన్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని- కేంద్ర వేతన సవరణ కమిషన్‌ సిఫార్సుల మేరకే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకూ వేతన సవరణ చేపట్టాలని సూచించింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఆ దోవలో వెళ్తున్నాయంది. ప్రజా రవాణా ఉద్యోగులకు, హోం గార్డులకు కూడా కమిటీ సిఫార్సులు చేసింది. కొత్తగా నియమితులైన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పే స్కేళ్లను నిర్ణయించింది.

ఫిట్‌మెంట్‌ ఇలా నిర్ణయించాం...

‘‘11 వేతన సవరణ సంఘం తాను లెక్కించిన గణాంకాల ప్రకారం 23% ఫిట్‌మెంట్‌ ఇస్తే సరిపోతుందని భావించింది. ఇప్పటికే మధ్యంతర భృతి రూపంలో 27% ఇస్తున్నందున ఆ మేరకు అదే మొత్తం ఫిట్‌మెంట్‌గా ఇవ్వాలని సిఫార్సు చేసింది. గత పదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగులు 82% ఫిట్‌మెంట్‌ పొందారు. అదే సమయంలో కేంద్ర ఉద్యోగులు 14.29% మాత్రమే అందుకున్నారు. తెలంగాణ వేతన సవరణ కమిషన్‌ కూడా అయిదేళ్ల కాలానికి 7.5% మాత్రమే సిఫార్సు చేసింది. అదే సమయంలో ఏపీ వేతన సవరణ కమిషన్‌ 27% ఫిట్‌మెంట్‌ సిఫార్సు చేసింది. వివిధ కమిషన్లు వివిధ రకాలుగా సిఫార్సు చేసిన ఫిట్‌మెంట్‌లను గమనిస్తే ఈ అంశంపై బహిరంగంగా సూత్రీకరణ చేసేందుకు ఆస్కారముంది. అందుకే కేంద్ర వేతన సవరణ కమిషన్‌ సూచించిన 14.29 ఫిట్‌మెంట్‌ను మాత్రమే మేం ఏపీ ఉద్యోగులకు అమలు చేయాలని సిఫార్సు చేస్తున్నాం’’ అని సీఎస్‌ కమిటీ స్పష్టం చేసింది.

 ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగులకు 11వ వేతన సవరణ సంఘాన్ని అశుతోష్‌ మిశ్రా నేతృత్వంలో అప్పటి ప్రభుత్వం 2018లో నియమించింది. కిందటి ఏడాది అక్టోబరులో ఈ సంఘం ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది. ఆ నివేదికను అధ్యయనం చేసి అమలు చేసేందుకు వీలుగా రాష్ట్ర మంత్రిమండలికి అవసరమైన సిఫార్సులు చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ సమావేశమై, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి అన్నీ సమీక్షించి ప్రభుత్వానికి తన సిఫార్సులను అందజేసింది. సోమవారం సాయంత్రం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లి తన నివేదికను ముఖ్యమంత్రి జగన్‌కు అందించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌భార్గవ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శులు ఎస్‌.ఎస్‌.రావత్‌, శశిభూషణ్‌ కుమార్‌, ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ తదితరులు సీఎంను కలిసి నివేదిక సమర్పించారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ విలేకరులతో మాట్లాడారు. మూడు రోజుల్లో ముఖ్యమంత్రి జగన్‌ పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.

సిఫార్సుల్లో  కొన్ని ముఖ్యాంశాలు...

⧬ మూలవేతనం 32 గ్రేడులు, 83 స్టేజిలు. కనీస వేతనం రూ.20,000, గరిష్ఠ వేతనం రూ.1,79,000.

⧬  11వ వేతన సవరణ కమిషన్‌ 23% ఫిట్‌మెంట్‌ లెక్కల ప్రకారం ఖరారు చేసింది. ఇప్పటికే 27% మధ్యంతర భృతి ఇస్తున్నందున అదే మొత్తానికి (27%) సిఫార్సు చేసింది. ప్రస్తుతం సీఎస్‌ కమిటీ ఏడో కేంద్ర వేతన సవరణ సిఫార్సుల ప్రకారం 14.29% ఫిట్‌మెంట్‌ ఇస్తే చాలని పేర్కొంది.

⧬  ఇంటి అద్దె భత్యాన్ని పీఆర్‌సీ కమిటీ 12% నుంచి 30% వరకు వివిధ కేటగిరీల్లో సిఫార్సు చేసే సీఎస్‌ కమిటీ అంత అవసరం లేదంది. 8% నుంచి 24% వరకు వివిధ నగరాలకు, పట్టణాల్లో ఉద్యోగులకు సిఫార్సు చేసింది.

⧬  అదనపు విద్యార్హతలకు అదనపు భత్యం ఇవ్వాల్సిన అవసరం లేదు.

⧬ బోధనేతర విద్యా సిబ్బందికి 5 రోజుల అదనపు సీఎల్‌కు సిఫార్సు.

⧬  పిల్లల సంరక్షణకు మూడు దశల్లో 180 రోజుల సెలవుకు అనుమతి. ఒంటరి పురుషులకు కూడా ఈ సెలవు వర్తింపజేయనున్నారు.

⧬  ప్రతి ఏటా ఆరోగ్య చికిత్సలు పెన్షనర్లకు వారి జీవిత భాగస్వాములకు వర్తింపు.

⧬  సర్వీసు పెన్షనర్లకు, కుటుంబ పెన్షనర్లకు నెలకు రూ.500 ఆరోగ్య భత్యం చెల్లింపు.

⧬  అంత్యక్రియలకు సాయం రూ.20 వేలకు పెంపు.

⧬  ట్యూషన్‌ ఫీజు నెలకు రూ.2,500 వరకు తిరిగి చెల్లింపు. గరిష్ఠంగా ఇద్దరు పిల్లల వరకు మాత్రమే ఇది వర్తింపు.

⧬  ఇంతకుముందు 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు అదనపు పెన్షన్‌ ఇచ్చే వారు. ఇప్పుడది 80 ఏళ్ల నుంచి వర్తింపజేయాలని సీఎస్‌ కమిటీ సిఫార్సు.

⧬ అదనపు పెన్షన్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వ శ్లాబులను పరిగణనలోకి తీసుకున్నందున 70 ఏళ్ల నుంచి 79 ఏళ్ల వయసు పెన్షనర్లకు మొత్తం పెన్షన్‌ (గ్రాస్‌ పెన్షన్‌) తగ్గే ప్రమాదం ఉండొచ్చు. అందువల్ల ఇప్పుడు పొందుతున్న మొత్తం పెన్షన్‌కు రక్షణ కల్పించాలి. ఆ తగ్గే మొత్తాన్ని పర్సనల్‌ పెన్షన్‌గా ఇవ్వాలని సీఎస్‌ కమిటీ సిఫార్సు చేసింది.

⧬  కాంట్రాక్టు ఉద్యోగులకు, ఎన్‌ఎంఆర్‌ ఉద్యోగులకు, కాంటింజెంట్‌ ఉద్యోగులకు కనీస వేతనం రూ.20,000తోపాటు కరవు భత్యం కలిపి చెల్లించాల్సి ఉంటుంది.

⧬ హోం గార్డుల కోసం 11వ వేతన సవరణ కమిటీ సిఫార్సులను సీఎస్‌ కమిటీ తిరస్కరించింది. హోంగార్డులకు వేతనం నిర్ధారించే అంశం వేతన సవరణ కమిటీ పరిధిలో లేదంది. ఇప్పటికే వారికి గత రెండు మూడేళ్లలో 77.5% రోజు వారీ విధి భత్యం పెంచినందున ఇక వారికి ఎలాంటి పెంపు అవసరం లేదని సీఎస్‌ కమిటీ పేర్కొంది.

⧬  ప్రభుత్వ ఉద్యోగుల గ్రాట్యుటీని రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచుతూ సిఫార్సు చేసింది.


0 comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

SEARCH THIS SITE

RECENT NEWS

TRENDING POSTS

✺ TEACHERINFO వాట్సాప్ గ్రూప్ లింక్స్ ✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

CETS/NOTIFICATIONS/RESULTS

HEALTH

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top