Tuesday, December 28, 2021

PRC NEWS: నేడు 28.12.21 సీఎంతో అధికారుల సమావేశం 


నేడు సీఎంతో అధికారుల సమావేశం

చర్చలతోనే ప్రభుత్వం కాలయాపన 

నాడు 43శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చిన టీడీపీ 

తిరగేసి 34 శాతం అయినా ఇస్తారోలేదో!

ఆశగా ఉద్యోగుల ఎదురుచూపులు

(అమరావతి, ఆంధ్రజ్యోతి): పీఆర్సీపై ఇంకా అయోమయం కొనసాగుతోంది. మంగళవారం సీఎం జగన్‌తో ఇదే అంశంపై మరోసారి అధికారులు భేటీ కానున్నారు. ఇప్పటికే పలుమార్లు అధికారులు... సీఎంతో పీఆర్సీపై భేటీ అయ్యారు. 14.29శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తామని జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాల్లో ప్రభుత్వ చేసిన ప్రతిపాదనలను మూకుమ్మడిగా అన్ని ఉద్యోగ సంఘాలు తిరస్కరించాయి. అనేకసార్లు సీఎస్‌ నేతృత్వంలోని అధికారుల కమిటీ... జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాలు జరిపినా పీఆర్సీపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేకపోయింది. దీంతో చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. నేరుగా సీఎంతోనే తమకు సమావేశం ఏర్పాటు చేయాలని గత జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు తేల్చిచెప్పారు. వారంలో సీఎంతో సమావేశం  ఏర్పాటు చేయిస్తానని నాడు సీఎస్‌ హామీ ఇవ్వగా.. మంగళవారం పీఆర్సీపై అధికారులతో సీఎం చర్చించనున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో అయినా తేల్చేస్తారా..లేదా.. నాన్చుడు కొనసాగుతుందా.. ఎన్నాళ్లు ప్రభుత్వం పీఆర్సీ ఇవ్వకుండా నాన్చుతుంది.. ఇప్పటికే ఏళ్లు గడిచిపోయాయి అంటూ.. ఉద్యోగుల్లో ఇప్పుడిదే చర్చ జరుగుతోంది. 13 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల నుంచి, ఆయా సంఘాల నేతల నుంచి పెరుగుతున్న ఒత్తిడితో ప్రభుత్వం గత నెలరోజుల నుంచి పీఆర్సీపై మల్లగుల్లాలు పడుతోంది. 

ఫిట్‌మెంట్‌ ఎంత ఇవ్వాలి అనేదానిపై స్పష్టతకు రాలేకపోతోంది. ఎంత ఇస్తే ఎంత అవుతుందో... ఉద్యోగుల నుంచి తర్వాత వచ్చే రియాక్షన్‌ ఎలా ఉంటుందో.. ఉద్యోగ సంఘాల నేతలకు ఏదోలా సర్దిచెప్పినా..  అగ్గిమీద గుగ్గిలం అవుతున్న ఉద్యోగులకు  ఏం సమాధానం చెప్పాలని ప్రభుత్వం తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. గత రెండు నెలల నుంచి జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాలంటూ.. అధికారుల కమిటీ సమావేశాలు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద సమావేశాలు, సీఎం వద్ద సమావేశాలు అంటూ పీఆర్సీపై ప్రభుత్వం చేస్తున్న హడావుడీ, ఇస్తున్న లీకులతో ఉద్యోగుల్లో రోజు రోజుకు పీఆర్సీ ప్రకటనపై ఉత్కంఠ పెరుగుతోంది. పీఆర్సీ కమిషన్‌ వేసి సంవత్సరాలు గడిచినా.. కమిషన్‌ నివేదిక ఇచ్చి సంవత్సరం దాటిపోయినా, ఇంకా ప్రకటన రాకపోవడంపై ఉద్యోగుల్లో ఆందోళన, ఆవేదన పెరుగుతోంది. మరోవైపు పీఆర్సీ ప్రకటనతో పాటుగా మానిటరి బెనిఫిట్‌ ఎప్ప టి నుంచి ఇవ్వాలి అనే అంశాలపైనా ప్రభుత్వం తరచూ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధం గా 10వ పీఆర్సీలో 10 నెలల ఎరియర్స్‌ను ఉద్యోగులకు చెల్లించింది. ఈ ప్రభుత్వం ఏం చేయనుందో అనే అంశంపైనా ఉద్యోగుల్లో చర్చ జరుగుతుంది. ఎరియర్స్‌ ఇస్తారో... కరోనా, ఆర్థిక పరిస్థితులు సాకు గా చూపి ఎగ్గొడతారో అనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం జరగనున్న సమావేశంపై ఉద్యోగులు గంపెడు ఆశ లు పెంచుకున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి సీఎస్‌ సమీర్‌శర్మ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్‌ తదితరులు హాజరుకానున్నట్లు తెలిసింది. గత సమావేశంలో ఉద్యోగ సంఘాలు వెలిబుచ్చిన అభిప్రాయాలు సీఎంకి వారు వివరిస్తారు. 

ఫిట్‌మెంట్‌ ఎంత?

11వ పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై ఉద్యోగులు కోటి ఆశలుపెట్టుకున్నారు. కరోనా ఇబ్బందులు, పెరిగిన ధరలకు అనుగుణంగా ఫిట్‌మెంట్‌ ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. గత ప్రభుత్వం 10వ పీఆర్సీ ఫిట్‌మెంట్‌ 43 శాతం ఇచ్చిందని.. కనీసం ఈ ప్రభుత్వం సంఖ్యలను అటూ ఇటూ మార్చి అయినా 34 శాతం ఫిట్‌మెంట్‌ అయినా ఇస్తుందా?లేదా? అనే చర్చ ఉద్యోగుల్లో జరుగుతోంది. 


SEARCH THIS SITE

LATEST UPDATES

✺ SSC MODEL PAPERS 2022

TRENDING

✺ SSC MODEL PAPERS 2022✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

Mid Day Meal

NAADU NEDU

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top