Monday, December 27, 2021

GST కారణం గా జనవరి 1 నుంచి వీటి ధరలు పెరుగుతాయిGST కారణం గా జనవరి 1 నుంచి వీటి ధరలు పెరుగుతాయి 

జీఎస్టీలో వస్తోన్న మరిన్ని మార్పులివే.

దిల్లీ: వచ్చే ఏడాది వస్తు సేవల పన్నులో పలు మార్పులు రానున్నాయి. కొన్ని వస్తువులపై సవరించిన రేట్లు జనవరి 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. దీంతో ఆయా వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇక జీఎస్టీ రిటర్నుల దాఖలుకు సంబంధించిన ప్రక్రియలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. వీటన్నింటినీ కొత్త సంవత్సరం నుంచి అమలు చేయనున్నారు.  

చదవండి : మీ డబ్బులు 5 ఏళ్లలో డబుల్ కావాలంటే

పెరగనున్న దుస్తుల ధరలు..

జనవరి 1 నుంచి అన్ని రకాల వస్త్రాలు, రెడీమెడ్‌ దుస్తుల ధరలు పెరగనున్నాయి. ప్రస్తుతం వస్త్ర పరిశ్రమపై ఉన్న 5% జీఎస్టీకి అదనంగా మరో 7% శాతం జోడించి... 12 శాతానికి పెంచనుండటమే ఇందుకు కారణం. మరోవైపు ప్రస్తుతం రెడీమెడ్‌ గార్మెంట్స్‌లో ఒక పీస్‌ గరిష్ఠ చిల్లర ధర(ఎంఆర్‌పీ) రూ.1,000లోపు ఉంటే.. 5% జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ఎంఆర్‌పీ రూ.1,000 దాటిన వాటిపై 12% విధిస్తున్నారు. జనవరి 1 నుంచి ఎంఆర్‌పీతో నిమిత్తం లేకుండా అన్ని రకాల రెడీమేడ్‌ దుస్తులపై 12% జీఎస్టీ వసూలు చేయనున్నారు. ఒక్క కాటన్‌కు మాత్రం దీని నుంచి మినహాయింపు ఉంది.

చదవండి : LIC వారి పెన్షన్ పాలసీ (FROM 40 YEARS)

పాదరక్షలూ ప్రియం కానున్నాయి..

ఇకపై అన్ని రకాల పాదరక్షలపై 12 శాతం జీఎస్టీ విధించినున్నట్లు జీఎస్టీ మండలి ప్రకటించింది. ఇప్పటి వరకు రూ.1000కు పైన ఉండే ఫుట్‌వేర్‌కు 5 శాతం జీఎస్టీ వర్తించేంది. ఇకపై ధరతో సంబంధం లేకుండా అన్ని రకాల ఫుట్‌వేర్‌పై 12 శాతం జీఎస్టీ విధించనున్నారు.  దీంతో చెప్పులు, షూస్‌ ధరలు వచ్చే ఏడాది నుంచి పెరగనున్నాయి. 

చదవండి : ఈ స్కీమ్ లో చేరితే మీ అమ్మాయి పెళ్లి నాటికి రూ.65 లక్షలు..!

ఆటో బుకింగ్‌ మరింత భారం..

ఈ-కామర్స్‌ వేదికల ద్వారా బుక్‌ చేసుకొనే ఆటో ప్రయాణాలపై ప్రభుత్వం ఇకపై జీఎస్టీ విధించనుంది. 2022, జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఆఫ్‌లైన్‌ లేదా బయట ఉండే ఆటో సేవలను వాడుకుంటే మాత్రం ఎలాంటి పన్ను భారం ఉండదు. నేరుగా ఆటోలను పిలిచి ఉపయోగించుకుంటే జీఎస్‌టీ వర్తించదు.

స్విగ్గీ, జొమాటో ఆర్డర్లపై 5శాతం జీఎస్టీ..

స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ ఇకపై నేరుగా కస్టమర్‌ నుంచే 5 శాతం జీఎస్టీని వసూలు చేయనున్నాయి. గతంలో జీఎస్టీని రెస్టారెంట్ల నుంచి వసూలు చేసేవి. జనవరి 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి రానుంది. అయితే, వినియోగదారులపై ఎలాంటి భారం పడబోదు. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసేటప్పుడు ఆహారానికి గానూ గతంలో రెస్టారెంట్లు ఐదు శాతం చొప్పున జీఎస్టీని వసూలు చేసేవి. స్విగ్గీ, జొమాటో కేవలం తమ సేవలకు గానూ కొంతమొత్తం వినియోగదారుల నుంచి వసూలు చేసేవి. ఈ విధానం వల్ల కొన్ని గుర్తింపులేని రెస్టారెంట్ల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నట్లు కేంద్రం గుర్తించింది. దీంతో కొత్త నిబంధనను తీసుకొచ్చింది. దీనివల్ల ఇప్పటి వరకు పన్ను చెల్లించని రెస్టారెంట్లు కూడా పన్ను పరిధిలోకి రానున్నాయి. ఈ నిర్ణయం వల్ల వినియోగదారుడికి ఎలాంటి నష్టం వాటిల్లబోదు.

ఆధార్ అనుసంధానం తప్పనిసరి..

పన్ను చెల్లింపుదార్లు జీఎస్టీ రిఫండ్స్‌ను క్లెయిమ్ చేసుకోవడానికి కొత్త సంవత్సరం నుంచి ఆధార్ ధ్రువీకరణను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. జీఎస్టీ రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన పాన్ నెంబర్‌కు అనుసంధానమైన బ్యాంకు ఖాతాల్లోనే జీఎస్టీ రీఫండ్స్ వేసేలా చర్యలు చేపట్టింది. పన్ను ఎగవేతల నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకుంది. ఇందుకుగాను జీఎస్టీకి సంబంధించి వివిధ నిబంధనల్లో కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డ్ (CBIC) సవరణలు చేసింది. 

గడిచిన నెల జీఎస్‌టీ రిటర్నులు దాఖలు చేయకుంటే..

గడిచిన నెలకు సంబంధించిన జీఎస్‌టీఆర్‌-3బీ రిటర్నులను దాఖలు చేయని వ్యాపారులు జనవరి 1 నుంచి జీఎస్‌టీఆర్‌-1లో బయటకు పంపే సరఫరాలను నమోదు చేయడానికి వీలుండదని జీఎస్‌టీఎన్‌ స్పష్టం చేసింది. ఏదైనా నెలకు సంబంధించిన జీఎస్‌టీఆర్‌-1ను దాఖలు చేయడానికి తర్వాతి నెలలో 11వ రోజు వరకు గడువు ఉంటుంది. ఇక జీఎస్‌టీఆర్‌-3బీ(పన్ను చెల్లింపుల ఫారమ్‌) రిటర్నులను తర్వాతి నెలలో 20-24 రోజుల మధ్యలో చేస్తారన్న సంగతి తెలిసిందే. జీఎస్‌టీఆర్‌-1 రిటర్నులను దాఖలు చేయడంలో పరిమితిని విధించే సెంట్రల్‌ జీఎస్‌టీ నిబంధనల్లోని రూల్‌-59(6) జనవరి 1, 2021 నుంచి అమల్లోకి వస్తుందని జీఎస్‌టీకి సాంకేతికత సహకారం అందిస్తున్న జీఎస్‌టీఎన్‌ స్పష్టం చేసింది. ఈ నిబంధన ప్రకారం.. ఒక నమోదిత వ్యక్తి.. గడచిన నెలకు ఫారమ్‌ జీఎస్‌టీఆర్‌-3బీ రిటర్నులు దాఖలు చేయకపోతే.. ఫారమ్‌ జీఎస్‌టీఆర్‌-1లో వస్తువులు లేదా సేవలు లేదా రెండింటి సరఫరా (అవుట్‌వర్డ్‌)లను నమోదు చేయడానికి అనుమతి ఉండదు. అలాగే క్రితం నెల జీఎస్‌టీ చెల్లించడంలో విఫలమైనా.. జీఎస్‌టీఆర్‌-1ను దాఖలు చేయలేరు.

నోటీసులు లేకుండానే తనిఖీలు..

ఒకవేళ వ్యాపారాలు జిఎస్టీఆర్‌‌-1, జిఎస్టీఆర్‌‌-3 మధ్య సరిపోలకుండా రిటర్న్‌లు దాఖలు చేస్తే ఆ మేరకు జీఎస్టీని రికవరీ చేయడం కోసం పన్ను అధికారులను ఆ సంస్థలకు పంపే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కొత్త నియమం ప్రకారం.. రికవరీ కోసం ఎలాంటి నోటీస్ అందించాల్సిన అవసరం లేదు. జీఎస్‌టీ ఫారాలను స్వతహగా సంస్థలే నింపడంతో, అందులో ఏమైనా అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తిస్తే వెంటనే ఆ మొత్తాన్ని రికవరీ చేయడం కోసం అధికారులను నేరుగా నోటీసు లేకుండా పంపే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. ఈ కొత్త నిబంధన కూడా నూతన సంవత్సరం నుంచే అమల్లోకి రానుంది.


SEARCH THIS SITE

LATEST UPDATES

✺ SSC MODEL PAPERS 2022

TRENDING

✺ SSC MODEL PAPERS 2022✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

Mid Day Meal

NAADU NEDU

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top