Heavy Rains: అల్పపీడన నేపథ్యంలో ఏపీలోని ఆ జిల్లాలకు భారీవర్షాల హెచ్చరిక.. రేపు స్కూళ్లకు సెలవు
Heavy Rains-Schools holiday: అల్పపీడన నేపథ్యంలో ఏపీలోని పలు జిల్లాలో భారీవర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్తూరు, కడప జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. విద్యాశాఖ అధికారులు చిత్తూరు, కడప జిల్లాలోని స్కూళ్లకు రేపు (సోమవారం నవంబర్ 29వ తేదీ) సెలవు ప్రకటించారు. ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఇక రాబోయే రెండు రోజుల్లో ఈ వర్షాలు తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గత కొన్ని రోజులుగా ఏపీలోని పలు జిల్లాలో వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. రాయలసీమ జిల్లాతో పాటు నెల్లూరులో కూడా గత 24 గంటల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఇప్పటికే రేపు అండమాన్ తీరంలో అల్పపీడనం ఏర్పడనున్నదని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ ముందుగా హెచ్చరికలు జారీ చేసింది. ఈ అల్పపీడన ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు గుంటూరు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, డిసెంబర్ 1 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.
మరోవైపు ఈ అల్పపీడన ప్రభావంతో పుదుచ్చేరిలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ విద్యాశాఖ మంత్రి రెండో రోజులపాటు విద్యాసంస్థలకు సెలవులను ప్రకటించారు. పాండిలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు రెండు రోజులు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం నుంచి రెండు రోజుల పాటు సెలవు ప్రకటించామని విద్యాశాఖ మంత్రి ఎ నమశ్శివాయం తెలిపారు.
0 comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.