Sunday, November 21, 2021

రైతు చట్టాలు : ఆ మూడు చట్టాల్లో ఏముంది? ఆ మూడు చట్టాల్లో ఏముంది?

సంవత్సర కాలంగా రైతులు సాగించిన చారిత్రాత్మక పోరాటం, కీలకమైన యుపితో సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాని మోడీ అకస్మాత్తుగా ఈ మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ చట్టాలు రైతులను ఉద్ధరించే మహదాశయంతోనే తెచ్చామని, రైతులే వీటిని సరిగా అర్థం చేసుకోలేదని అంటూ ఆయన ఎదుటివారిపై నిందలు వేశారు. ఇంతకీ ఆ మూడు చట్టాల్లో ఏముంది?

1.రైతు ఉత్పత్తుల వాణిజ్య ,వ్యాపార ,ప్రోత్సాహక సులభతర బిల్లు-2020

ఇది వ్యవసాయ ఉత్పత్తులు దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా అమ్ముకోవచ్చని చెబుతోంది. మార్కెట్‌ యార్డుల్లో కాకుండా రైతు తమ పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చు. మార్కెట్‌ యార్డులకు ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అలాగే కనీస మద్దతు ధర కోసం ప్రభుత్వంపై ఆధార పడాల్సిన పని ఉండదు. రైతులు-ప్రైవేట్‌ వ్యాపారులతో నేరుగా బేరసారాలు జరుపుకోవచ్చు. మధ్యలో ఎలాంటి దళారీ వ్యవస్థ ఉండదు. అంతర్‌ రాష్ట్ర వాణిజ్యం మరింత సులభతరం అవుతుంది అని బిల్లు పేర్కొంటున్నది. ఇందులోని నిబంధనలు తేనె పూసిన కత్తుల్లాంటివి. 

వ్యవసాయ రంగాన్ని మార్కెట్‌ శక్తులు దున్నేసుకుని, దండిగా లాభాలు పోగేసుకునేందుకు బాటలు వేయడమే ఈ బిల్లు అసలు ఉద్దేశం. రైతుల పంటలకు కనీస మద్దతు ధరకు ఎగనామం పెట్టడానికి, వరి, గోధుమలను సేకరించాల్సిన బాధ్యత నుంచి తప్పుకోవడానికి, మండీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం చాలా పకడ్బందీగా దీనిని రూపొందించింది. అనకాపల్లి రైతు తన పంటను అహ్మదాబాద్‌లో అమ్ముకోవడం కుదిరే పనేనా? పంట ధర నిర్ణయం విషయంలో కార్పొరేట్‌ కంపెనీలతో బేరసారాలాడే సామర్థ్యం రైతులకు ఉంటుందా? ఇటువంటి సమాధానం లేని ప్రశ్నలు అనేకం ఇందులో ఉన్నాయి. ఇప్పటికే అమలులో ఉన్న నయా ఉదారవాద విధానాల వల్ల చాలా మంది రైతులు కనీస మద్దతు ధరకంటె తక్కువకుఅమ్ముకునే దుస్థితి నెలకొంది.

2.నిత్యావసర సరుకుల(సవరణ) బిల్లు-2020

ఈ బిల్లు నూనె గింజలు, ఉల్లిగడ్డలు, బంగాళాదుంపలు వంటి వాటిని నిత్యావసర వస్తువుల జాబితా నుంచి తొలగిస్తున్నది. ఎంత సరుకు అయినా నిల్వ చేసుకునేందుకు వ్యాపారులకు ఇది పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నది. దీనివల్ల వ్యాపారులు పెద్ద మొత్తంలో పంటలను కొనుగోలు చేసి గోడౌన్లకు తరలిస్తారు. మార్కెట్‌లో కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్ముకుంటారు. రైతుల పరిస్థితి అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్న చందంగా తయారవుతుంది. అలాగే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఈ రంగంలో అనుమతించే మరో ప్రమాదకరమైన అంశం ఇందులో ఉన్నది. రైతులు దీనిని సరిగానే అర్థం చేసుకున్నారు కాబట్టే తుదకంటా వ్యతిరేకిస్తున్నారు.

3.రైతుల సాధికారత ,రక్షణ ఒప్పంద బిల్లు

ఈ బిల్లు కాంట్రాక్టు వ్యవసాయానికి అవసరమైన చట్రాన్ని రూపొందించింది. టోకు వ్యాపారులు, ప్రాసెసింగ్‌ సంస్థలు ఎగుమతి దారులు తమకు నచ్చిన పంటలను వేసుకునే స్థితి కల్పిస్తుంది. రైతుల నుంచి భూములను పెద్దమొత్తంలో కాంట్రాక్టుకు తీసుకుని ఎగమతికి అవసరమైన వాణిజ్య పంటలు పండించుకోడానికి ఇది బాటలు వేస్తుంది. దీనివల్ల బడ్డా పెట్టుబడిదారులు గ్రామీణ వ్యవసాయ రంగంలో ఉన్నత తరగతులు ఎక్కువగా లాభపడతాయి. కార్పొరేట్‌ వ్యవసాయం వస్తే యంత్రాలను ఉపయోగిస్తారు. దీని పర్యవసానంగా ఉపాధి దెబ్బతింటుంది. రైతులు కూలీలుగా మారతారు. వ్యవసాయ రంగంలో పనిదినాలు మరింతగా పడిపోతాయి. ఫౌండేషన్‌ ఫర్‌ అగ్రేరియన్‌ స్టడీస్ సర్వే ప్రకారం భూమి లేని దళితులు 40 శాతం దాకా మండీలలో హమాలీలుగా ఉన్నారు. ఈ కొత్త చట్టం వల్ల వీరంతా ఉపాధి కోల్పోయి వీధిన పడే పరిస్థితి వస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఈ మూడు చట్టాలు వ్యవసాయ రంగాన్ని పట్టి పీడిస్తున్న వైరుధ్యాలను ఏమాత్రం పరిష్కరించకపోగా, వాటిని మరింత తీవ్రతరం చేస్తాయి. ఫలితంగా సామాజిక, ప్రాంతీయ అసమానతలు మరింతగా పెరిగిపోతాయి. అందుకే ఈ మూడు నల్ల చట్టాల రద్దు కోసం రైతులు పెద్దయెత్తున ఉద్యమిస్తున్నారు

‘వన్ నేషన్ వన్ మార్కెట్ వినసొంపైన కుట్ర’

అయితే, ఈ 'వన్ నేషన్ వన్ మార్కెట్' అనేది వినడానికి బాగానే ఉన్నా ఆచరణలో వర్తకులు, కార్పొరేట్లకు తప్ప సాధారణ రైతులకు ఏమాత్రం ప్రయోజనం కలిగించదని చెప్పారు.

నిజంగా రైతులకు లాభం చేకూర్చాలనే ఉద్దేశమే కనుక ఉంటే మార్కెటింగ్ సదుపాయాలు పెంచి, ప్రభుత్వమే అన్ని పంటలను సరైన మద్దతు ధరకు కొనుగోలు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. కొన్ని రాష్ట్రాల్లో కనీస మద్దతు ధరలు లేవని.. కేంద్రం, కొన్ని రాష్ట్రాలు కనీస మద్దతు ధరలు ప్రకటించినా వాటికి చట్టబద్ధత లేదని.. అవి ప్రకటనలకే పరిమితమవుతున్నాయి తప్ప రైతులకు ఆ ధర దక్కడం లేదని చెప్పారు.

కనీస మద్దతు ధర అమలు కాకపోతే దానికి ఎవరు బాధ్యులు, కనీస మద్దతు ధర పొందడానికి రైతు కోర్టును ఆశ్రయించే అవకాశాలు లేవని.. కనీస మద్దతు ధర అనేది కేవలం సలహా ధరగా మాత్రమే ఉంటోందని చెప్పారు.

''కొత్త చట్టాలు అమలులోకి వస్తే వినియోగదారుల మార్కెట్ కంపెనీల నియంత్రణలోకి వెళ్తుంది. రైతులు సంఘటితంగా లేరు.. రైతు సహకార సంఘాలు కూడా బలహీనంగా ఉన్నాయి.. పెట్టుబడి, వసతుల కొరత వంటివి రైతులను, సంఘాలను వెంటాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చట్టాలు ఎన్ని అవకాశాలు కల్పించినా వాటిని రైతులు ఉపయోగించుకోలేరు సరికదా వారికి బదులు కంపెనీలు ఉపయోగించుకుంటాయి'' అన్నారు కన్నెగంటి రవి కుమార్.

ఉత్తరాది రాష్ట్రాల నుంచే నిరసనలు ఎందుకు?

దేశంలో ఆరు శాతం రైతులకు మాత్రమే ఎంఎస్‌పీ అందుతోందని, వీరిలో ఎక్కువ మంది పంజాబ్, హరియాణా రాష్ట్రాల వారేనని అంచనాలు ఉన్నాయి. అందుకే, కొత్త వ్యవసాయ చట్టాలపై ఈ రాష్ట్రాల నుంచే ఎక్కువగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఎంఎస్‌పీకి పంటలను కొనుగోలు చేస్తామని ఇప్పటివరకూ ప్రభుత్వం రాతపూర్వకంగా ఆదేశాలు ఇవ్వలేదని, మౌఖికంగానే చెబుతోందని కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి సిరాజ్ హుస్సేన్ అన్నారు. అందుకే కొత్త వ్యవసాయ చట్టాలు తెచ్చిన తర్వాత రైతుల్లో ఆందోళనలు పెరిగాయని చెప్పారు.

ఎంఎస్‌పీకి పంటల కొనుగోళ్లు కొనసాగిస్తామని కేంద్ర ఆహారశుద్ధి పరిశ్రమల శాఖ ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుంది.

‘‘నేను ఇదివరకే చెప్పాను. మళ్లీ చెబుతున్నాను. ఎంఎస్‌పీ వ్యవస్థ, ప్రభుత్వం పంటలు కొనుగోలు చేయడం కొనసాగుతుంది. మేం రైతులకు సేవ చేసేందుకే ఉన్నాం. అన్నదాతలను ఆదుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాం. వారి కుటుంబాల్లో భావి తరాల జీవితాలు కూడా మెరుగ్గా ఉండేందుకు కృషి చేస్తాం’’ అని సెప్టెంబర్ 20న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

కానీ, ఎంఎస్‌పీని, పంటల కొనుగోలును కొనసాగిస్తామని చట్టంలో పొందుపరిచేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇదివరకు కూడా చట్టాల్లో రాతపూర్వకంగా ఈ విషయం ఎక్కడా లేదని, అందుకే కొత్త చట్టాల్లోనూ పేర్కొనలేదని ప్రభుత్వం అంటోంది.

మరోవైపు గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధిని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వకపోవడం కూడా రైతులకు ఆందోళన కలిగిస్తోంది.

ఇదివరకు ఈ నిధి నుంచి ఏటా మూడు శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఇచ్చేది. కానీ, ఈ ఏడాది అందుకు నిరాకరించింది.


0 comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

SEARCH THIS SITE

RECENT NEWS

TRENDING POSTS

✺ TEACHERINFO వాట్సాప్ గ్రూప్ లింక్స్ ✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

CETS/NOTIFICATIONS/RESULTS

HEALTH

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top