రష్యాలో కొవిడ్ కల్లోలం: డెల్టాను మించిన దాని ఉపరకం..!
మాస్కో: రష్యాలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ కేసులకు కారణమవుతోన్న ఉపరకం ay.4.2.. డెల్టా వేరియంట్ కంటే అధిక సంక్రమణ వేగం కలిగి ఉందని భావిస్తున్నారు. ఈ మేరకు అక్కడి మీడియాతో ఆ దేశ సీనియర్ పరిశోధకులు ఒకరు వెల్లడించారు.
ఈ డెల్టా ఉపరకం.. డెల్టా కంటే 10 శాతం ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆయన అన్నారు. అయితే అది నిదానంగా జరిగే ప్రక్రియని చెప్పారు. ‘టీకాలు ఈ ఉపరకంపై మెరుగ్గానే పనిచేస్తున్నాయి. ఉన్నట్టుండి యాంటీబాడీల సామర్థ్యాన్ని దెబ్బతీసేంత ఉత్పరివర్తనేమీ జరగలేదు’ అని అన్నారు. ఈ ఉపరకంతో ఇప్పటికే ఉన్న రికార్డు స్థాయి ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోపక్క బ్రిటన్లోనూ ay.4.2 ప్రభావం కనిస్తోంది. అక్కడ కూడా రోజుకు దాదాపు 50 వేల కేసులు వెలుగుచూస్తున్నాయి.
ఇదిలా ఉండగా.. రష్యాలో రోజుకు 30 వేలకు పైగా కేసులు, వెయ్యికి పైగా మరణాలు సంభవిస్తున్నాయి. ఆ దేశం ఇంతవరకు ఈ స్థాయి ఉద్ధృతిని చవిచూడలేదు. వరల్డో మీటర్ గణాంకాల ప్రకారం.. కరోనా ప్రారంభం నుంచి 81లక్షలకు పైగా కేసులు.. 2.28 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. ప్రపంచవ్యాప్తంగా మునుపటి ఉద్ధృతికి డెల్టా వేరియంట్ కారణం. భారత్లో రెండో దశలో ఆ వేరియంట్ మృత్యు ఘంటికలు మోగించిన సంగతి తెలిసిందే.
0 comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.