Saturday, June 12, 2021

Third Wave: మూడో వేవ్ పిల్లలకు నిజంగా ప్రమాదమా..? నిపుణులు ఏం చెబుతున్నారంటేతల్లిదండ్రుల్లో ‘మూడో వేవ్ టెన్షన్’.. పిల్లలకు నిజంగా ప్రమాదమా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే

దేశంలో కరోనా మహమ్మారి కొద్దిగా తగ్గుముఖం పట్టింది. అంతే కరోనా మూడో వేవ్ గురించి ఊహాగానాలు మొదలైపోయాయి. ఇది ముఖ్యంగా చిన్నపిల్లలను టార్గెట్ చేస్తుందంటూ వచ్చిన వదంతులు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తల్లిదండ్రుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సెకండ్ వేవ్ మిగిల్చిన పీడకలల నుంచి బయట పడటానికి కష్టపడుతున్న భారతదేశానికి మూడో వేవ్ అంతకుమించిన హృదయవిదారక దృశ్యాలను చూపుతుందని, ఈ రణరంగం మధ్యలో చిక్కుకునేది చిన్నారులే అని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. దీంతో చాలామంది భయభ్రాంతులకు గురవతున్నారు. వీటిపై నిపుణులు ఏమంటున్నారు? అసలు మూడో వేవ్ చిన్నారులని ఎందుకు టార్గెట్ చేస్తుంది?


Dr. వేణుగోపాల రెడ్డి Micro  biologist 

కరోనా తొలి వేవ్‌లో 60 ఏళ్లు పైబడిన వారిపై తీవ్రమైన ప్రభావం చూపింది. ప్రస్తుతం సెకండ్ వేవ్‌లో యువకులపై తీవ్రమైన ప్రభావం కనబడుతోంది. ఈ క్రమంలో మూడో వేవ్ గనుక వస్తే అది పిల్లలపైనే ప్రభావం చూపుతుందని కొందరు అంటున్నారు. అయితే అలాంటిదేమీ ఉండదని, మూడో వేవ్ వచ్చినా ప్రత్యేకంగా చిన్న పిల్లలపై ఎటువంటి ప్రభావమూ ఉండకపోవచ్చని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) ఢిల్లీ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా అంటున్నారు. ఇప్పటి వరకూ మూడో వేవ్ చిన్నారులను టార్గెట్ చేస్తుందనడానికి ఎటువంటి ఆధారాలూ లేవని, దీనికి సంబంధించిన ఎటువంటి డేటా లేదని ఆయన చెప్పారు. కరోనా సెకండ్ వేవ్‌లో కూడా చిన్నారుల్లో 60-70% మంది కరోనా బారిన పడ్డారని గులేరియా వివరించారు. వీరిలో అప్పటికే వేరే వ్యాధులు ఉన్నవారు, లేదంటే బాగా తక్కువగా ఇమ్యూనిటీ ఉన్న వారు మాత్రమే ఆస్పత్రి పాలయ్యారని చెప్పిన గులేరియా.. మిగతా పిల్లలు ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేకుండానే కోలుకున్నారని తెలిపారు. కాబట్టి కరోనా మూడో వేవ్ చిన్నారులను టార్గెట్ చేస్తుందనే భయం అక్కర్లేదని, అయితే జాగ్రత్తలు పాటించడం మంచిదని సూచించారు.

మూడో వేవ్ విషయంలో విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కరోనా చిన్నారులను టార్గెట్ చేయడం వదంతి మాత్రమే అని ఎయిమ్స్ చీఫ్ అంటుంటే.. నారాయణ హెల్త్ వ్యవస్థాపకులు డాక్టర్ దేవీ ప్రసాద్ శెట్టి మాత్రం ఈ అభిప్రాయంతో విభేదిస్తున్నారు. ఈయన్ను కర్ణాటక టాస్క్ ఫోర్స్ చైర్‌పర్సన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. కరోనా మూడో వేవ్ గురించి మాట్లాడిన ఆయన.. ఇది కచ్చితంగా చిన్నపిల్లలను టార్గెట్ చేస్తుందని అంటున్నారు. తొలి వేవ్‌లో 60 ఏళ్లు పైబడిన వారిపై, రెండో వేవ్ యువకులపై బాగా ప్రభావం చూపిందని చెప్పిన ప్రసాద్ శెట్టి.. మూడో వేవ్ నాటికి వీళ్లలో అధికశాతం ప్రజలకు ఆల్రెడీ కరోనా సోకి ఉంటుందని, లేదంటే వ్యాక్సిన్ తీసుకొని ఉంటారని చెప్పారు. అటువంటి సమయంలో వైరస్ తన టార్గెట్‌ను మార్చుకోవడానికి ప్రయత్నిస్తుందని వివరించారు. ఆ సమయంలో అత్యంత బలహీనంగా ఉండేది పిల్లలే కావడంతో వైరస్ వారిని టార్గెట్ చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. కాబట్టి మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలంటే పీడియాట్రిక్ కేర్ ఐసీయూల సంఖ్యను పెంచాలని సూచించారు.

ఏపీలో మూడో వేవ్ భయం?

కరోనా మూడో వేవ్ వస్తే చిన్నారులే టార్గెట్ అంటూ వినిపిస్తున్న వార్తలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం రాష్ట్రంలో ఇటీవలి కరోనా ట్రెండ్. అసలే ఇక్కడ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. వీటిలో కూడా తాజాగా 18 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వారిలో కరోనా కేసులు బాగా బయటపడ్డాయి. గడిచిన రెండు వారాల్లోనే రాష్ట్రంలో 24 వేలమందికిపైగా పిల్లలు కరోనా పాజిటివ్‌గా తేలారు. ముఖ్యంగా తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల్లో ఈ కేసులు వెలుగు చూశాయి. అయితే పెద్దలతో పోల్చుకుంటే పిల్లల్లో కరోనా అంతగా విజృంభించడం లేదని నిపుణులు అంటున్నారు. ఏదిఏమైనా ఇటువంటి వార్తలతో రాష్ట్ర ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

భారత్‌లో 15 కోట్ల నుంచి 16కోట్ల వరకూ చిన్నారులు ఉన్నారు. డాక్టర్ దేవీ ప్రసాద్ ఊహించినట్లే జరిగితే వీరిపై కరోనా దాడి చాలా ఘోరంగా జరుగుతుంది. దీనికితోడు కరోనా కొత్త వేరియంట్లు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. నేపాల్, వియత్నాం దేశాల్లో కనిపించిన వేరియంట్ల వంటివి మూడో వేవ్‌లో విజృంభించే అవకాశం ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. దీంతో ఇవన్నీ చిన్నారులను టార్గెట్ చేస్తాయేమో అని తల్లిదండ్రులు వణికిపోతున్నారు. అదే సమయంలో పెద్దవాళ్లలా ఒక నర్సులు, డాక్టర్లతో చిన్నారులను వదిలి వెళ్లడం కుదరదని కూడా దేవీ ప్రసాద్ చెప్పారు. పెద్దవాళ్లకు పరిస్థితులు తెలుసు కాబట్టి ఇబ్బందులు ఉండవు. కానీ చిన్నారులు అలా కాదు. కొంచెం ఇబ్బందిగా అనిపించినా ఆక్సిజన్ మాస్కులు తీసేసే అవకాశం ఉంది. వారిని నర్సులు డాక్టర్లు సముదాయించడం కూడా కష్టం. అది తల్లిదండ్రులకు మాత్రమే సాధ్యం. దీంతో వారు ముందుగా వ్యాక్సిన్లు తీసుకుంటే తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవచ్చని ఆయన తెలిపారు.

ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఏపీ) కూడా రాబోయే కరోనా వేవ్‌లు పిల్లలపై ప్రభావం చూపే అవకాశం తక్కువగా ఉందని పేర్కొంది. డిసెంబరు 2020-జనవరి 2021 మధ్య జరిగిన ఒక సర్వే ప్రకారం దేశంలో 10-17 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లల్లో 25శాతం మందికి ఇప్పటికే కరోనా సోకిందని తేలింది. ఈ వివరాలను పేర్కొన్న ఐఏపీ.. పిల్లలకు ఇప్పటికే కరోనా సోకుతోందని, కాకపోతే వారిలో పరిస్థితి విషమించడం లేదని తెలిపింది. కాబట్టి ఇప్పుడున్న సమాచారం వరకే పరిశీలిస్తే రాబోయే కరోనా వేవ్‌లు చిన్నారులను టార్గెట్ చేయడం కష్టమని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యాక్సిన్ తయారీ సంస్థలన్నీ కూడా పిల్లలపై తమ తమ వ్యాక్సిన్ ప్రభావాలను పరీక్షిస్తున్నాయి. అమెరికా, యూకే తదితర దేశాల్లో ఇప్పటికే 12 ఏళ్లు పైబడిన వారికి ఫైజర్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. మరి మన దేశం ఈ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.


0 comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

SEARCH THIS SITE

RECENT NEWS

TRANSFERS/PROMOTIONS 2022

✺ TEACHERINFO వాట్సాప్ గ్రూప్ లింక్స్ ✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

CETS/NOTIFICATIONS/RESULTS

HEALTH

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top