Saturday, June 12, 2021

2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం


 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగింది,

2,193 మందికి ఎస్జీటీలుగా అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం

పాదయాత్ర హామీని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్‌ 

మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌తో నియామకం

దశాబ్దానికిపైగా నెలకొన్న సమస్య పరిష్కారం

2014 మేనిఫెస్టోలో మాట ఇచ్చి మోసగించిన చంద్రబాబు

విద్యాశాఖ మంత్రి సురేష్‌ సాక్షి, అమరావతి: ఎన్నికలకు ముందు తన సుదీర్ఘ పాదయాత్రలో డీఎస్సీ – 2008 అభ్యర్థులకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నెరవేర్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 2008 డీఎస్సీకి సంబంధించి కోర్టు కేసులను పరిష్కరించి 2,193 మంది అభ్యర్ధులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. శుక్రవారం విజయవాడలోని ఆర్‌అండ్‌ బీ భవనంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక పరిస్థితుల్లో మానవతా ధృక్పధంతో డీఎస్సీ 2008 అభ్యర్థులకు మినిమమ్‌ టైమ్‌ స్కేలుతో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ)గా అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. 2008 డీఎస్సీ నియామకాలలో క్రైటీరియా నిబంధనల మార్పు వల్ల అప్పట్లో సుమారు 4 వేలకు పైగా అభ్యర్థులు ఉద్యోగావకాశాలను కోల్పోయారని తెలిపారు. న్యాయపోరాటం చేస్తూ తీవ్ర నిరాశ నిస్పృహలకు గురయ్యారన్నారు.  న్యాయవివాదాల్లో చిక్కుకుని నాన్చివేతతో ఈ అంశం పరిష్కారంలో  తీవ్ర జాప్యం జరిగిందని చెప్పారు. 2014 ఎన్నికల సమయంలో 2008 డీఎస్సీ అభ్యర్థుల భవిత తేలుస్తామని, వారికి న్యాయం చేస్తామని టీడీపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చి కూడా చంద్రబాబు న్యాయం చేయలేదన్నారు. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నిరుద్యోగులను మోసగించారని పేర్కొన్నారు. 

మేనిఫెస్టోలో లేకున్నా...

ఎన్నికల మేనిఫెస్టోలో లేకపోయినా పాదయాత్ర హామీ మేరకు  అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి జగన్‌ డీఎస్సీ 2008 అభ్యర్ధుల సమస్యపై దృష్టి సారించారని మంత్రి సురేష్‌ తెలిపారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరించి నిరుద్యోగులకు న్యాయం చేశారన్నారు. ఆర్థికశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా 2008 డీఎస్సీ అభ్యర్థులకు మినిమమ్‌ టైమ్‌ స్కేలులో ఎస్జీటీలుగా ఉద్యోగావకాశాలు కల్పించాలని నిర్ణయించారన్నారు. దీనికి సంబంధించిన దస్త్రంపై ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన నుంచి రాగానే సంతకం చేయనున్నారని అనంతరం జీవో విడుదల ఆవుతుందని తెలిపారు. తదుపరి ఆన్‌లైన్‌ లేదా ఇతర మాధ్యమాల ద్వారా వారికి వృత్తిపరమైన శిక్షణ అందించి నియామక ప్రక్రియను చేపడతామని మంత్రి వివరించారు.  

2018 డీఎస్సీలోనూ..

2018 డీఎస్సీకి సంబంధించి కూడా 6,361 పైగా పోస్టులకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి భర్తీ చేశామని మంత్రి సురేష్‌ తెలిపారు. మరికొన్ని పోస్టులపై కోర్టు కేసులు ఉన్నాయని, వాటిని పరిష్కరించి మరో 486 పీఈటీ, స్కూల్‌ అసిస్టెంట్, తెలుగు పండిట్‌ పోస్టుల నియామకాలను చేపడతామన్నారు. మరో 374 లాంగ్వేజ్‌ పండిట్‌ పోస్టులపై రిట్‌ పిటీషన్లు పెండింగ్‌ లో ఉన్నాయని, త్వరలో అడ్వకేట్‌ జనరల్‌ ద్వారా వాటిని కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు.

అన్నీ అనుకూలించాక టెన్త్, ఇంటర్‌ పరీక్షలు

టెన్త్, ఇంటర్‌ పరీక్షలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు మంత్రి సురేష్‌ సమాధానం ఇస్తూ పలు రకాల ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని, స్పష్టత వచ్చాక షెడ్యూల్‌ ప్రకటిస్తామన్నారు. పరీక్షల ప్రక్రియకు సుమారు 40 రోజులు సమయం అవసరమని చెప్పారు. దీంతోపాటు విద్యార్థులు నీట్, జేఈఈ, ఎంసెట్‌ పరీక్షలకు హాజరయ్యేందుకు కూడా సమయం అవసరం అవుతుందన్నారు. కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని సంతృప్తి చెందిన తరువాత తల్లిదండ్రులకు ఎలాంటి ఆందోళన లేకుండా పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ను ప్రకటిస్తామని మంత్రి వివరించారు.

SEARCH THIS SITE

LATEST UPDATES

Varadhi worksheets class 1-10
Your Salary slip with One Click

TRENDING

SCERT TEXT BOOKS CLASS 1 TO 10

Mid Day Meal

NAADU NEDU

EDUCATIONAL APPS

JOBS/RESULTS/NOTIFICATIONS

ORDERS & PROCEEDINGS

TRANSFERS 2020

Top