Thursday, May 27, 2021

Covid-19: కరోనా నుంచి కోలుకున్నారా? ఈ శారీరక వ్యాయామాలు ఖచ్చితంగా చేయండి 

పోస్ట్‌ కోవిడ్‌ కేర్‌ చాలా ముఖ్యం. కరోనా బారినపడి కోలుకున్న తర్వాత మూడు నెలల వరకు మరింత అప్రమత్తంగా ఉండాలి. బ్రీతింగ్, స్పెరో మెట్రీ ఎక్సర్‌సైజ్‌లతోపాటు శారీరక వ్యాయామం, వాకింగ్‌ వంటివి చేయాలి.

కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులగా కేసుల సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ అంతేస్థాయిలో కరోనా బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంటోంది. ఈ వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ దాని ప్రభావం మాత్రం మరికొంత కాలం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తులతోపాటు రక్తం గడ్డకట్టడం సహా పలు సమస్యలు ఏర్పడుతున్నాయి. దీనివల్ల గుండె, ఇతర అవయవాలకు రక్తం సరిగా సరఫరాగాక, వాటి పనితీరులో తేడా వస్తోంది. పక్షవాతం, గుండెపోటు వంటి ప్రమాదకర పరిణామాలకూ దారితీస్తోంది. ఇటువంటి సమయంలో ఫిజియోథెరపీతోపాటు వ్యాయామం చేయడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చెస్ట్‌ ఫిజియోథెరపీ, బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌లతో కరోనాకు ముందు, తర్వాత పేషెంట్ల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని స్పష్టం చేస్తున్నారు. ప్రోనింగ్‌ పొజిషన్, పర్స్‌డ్‌ లిప్, డయాఫర్మేటిక్, సెగ్మెంటల్‌ బ్రీతింగ్, స్పెరోమెట్రీ ఎక్సర్‌సైజ్‌లు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని సూచిస్తున్నారు. కోవిడ్ నుంచి కోలుకున్నవారు వ్యాయామాలు చేసే సమయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

3 నెలల పాటు అప్రమత్తంగా ఉండాలి

పోస్ట్‌ కోవిడ్‌ కేర్‌ చాలా ముఖ్యం. కరోనా బారినపడి కోలుకున్న తర్వాత మూడు నెలల వరకు మరింత అప్రమత్తంగా ఉండాలి. బ్రీతింగ్, స్పెరో మెట్రీ ఎక్సర్‌సైజ్‌లతోపాటు శారీరక వ్యాయామం, వాకింగ్‌ వంటివి చేయాలి. స్పెరోమీటర్‌ పరికరం అందుబాటు ధరలోనే దొరుకుతుంది. ఈ పరికరంలో మూడు రంగుల బాల్స్‌ ఉంటాయి. పైపు ద్వారా గాలి ఊదుతూ ఆ బాల్స్‌ను పైకి లేపాలి. ఇలా ప్రతి రెండు గంటలకు పదిసార్లు చేయాలి. యూరిక్‌ పంప్, యాక్టివ్‌ ఆర్‌ఓఎం ఎక్సర్‌సైజ్‌లు చేస్తే శరీరంలోని అన్నిభాగాలకు రక్త ప్రసరణ సక్రమంగా జరిగి రక్తం గడ్డలు కట్టే ప్రమాదం తగ్గుతుంది.

ఊపిరితిత్తుల సామర్థ్యం పెంచుకోవాలి

ఫిజియోథెరపీ టెక్నిక్స్‌తో కరోనా మహమ్మారిని నియంత్రించవచ్చు. కరోనా బారినపడి నెగెటివ్‌ వచ్చిన తర్వాత తప్పనిసరిగా బ్రీతింగ్, స్పెరోమెట్రీ ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. దీంతో ఊపిరితిత్తుల సామర్థ్యం పెరగడంతోపాటు ఇతర రుగ్మతలు తిరిగి దరిచేరవు. మానసిక ప్రశాంతత, బలవర్ధకమైన ఆహారం అవసరం.

ఆస్పత్రిలో చేరకున్నా ఫిజియోథెరపీ

కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నా, హోం ఐసోలేషన్‌లో ఉన్నా కూడా ఫిజియోథెరపీ తీసుకోవడం మంచిది. శరీరం పరిస్థితి యుద్ధంలో గెలిచినప్పటికీ అలసిపోయిన సైనికుడిలా అవుతుంది. ఊపిరితిత్తుల చుట్టూ ఉండే డయాఫ్రం, ఇతర కండరాలు బలహీనం అవుతాయి. వాటికి తిరిగి బలం చేకూర్చేందుకు ఫిజియోథెరపీ ఉపయోగపడుతుంది. ఆస్పత్రిలో ఆక్సిజన్, వెంటిలేటర్‌పై చికిత్స తీసుకున్నవారు మరింత బలహీనంగా అవుతారు. వారు మొదట కొద్దిరోజులు విశ్రాంతి, మంచి పోషకాహారం తీసుకోవాలి. తర్వాత ఫిజియోథెరపీ, వ్యాయామాలు మొదలుపెట్టాలి. వీటిని ఇంట్లోనే చేసుకోవచ్చు. రోజూ 10–15 నిమిషాలు చేస్తే సరిపోతుంది. రెండు, మూడు నెలలు కంటిన్యూ చేస్తే కండరాలు బలోపేతం అవుతాయి. అయితే ఏదైనా డాక్టర్లు, నిపుణుల సూచనల మేరకే చేయాలి. 


మరికొన్ని జాగ్రత్తలు:

* కోవిడ్ వైరస్ సోకిన నేపథ్యంలో చాలా రోజులు లేదా వారాల తరబడి శారీరక శ్రమ లేకుండా ఉంటారు. దీంతో మన కండరాలు, మన శరీరం కొన్ని భౌతికంగా కొన్ని కదలికలు, పనులు చేయడానికి అలవాటుపడవు.

* మీరు కోవిడ్ సమయంలో కోల్పోయిన శక్తిని తిరిగి తెచ్చుకునేందుకు కొన్ని వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. రోజుకు కనీసం 20 నుంచి 30 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల మీరు కోల్పోయిన బలాన్ని తిరిగి పొందవచ్చు. తద్వారా మీ శ్వాసప్రక్రియ కూడా మెరుగుపడుతుంది.

* ప్రస్తుతం మీరు కోవిడ్ నుంచి కోలుకునే దశలో ఉంటారు కాబట్టి వ్యాయామంలో ఏది సాధ్యమో అది చేయండి. ఉదాహరణకు నిలబడి అయినా లేదా కూర్చుని కూడా వ్యాయామాలు చేయవచ్చు.

* కవాతు చేయడం వంటి వ్యాయామాలు కూడా మీరు అక్కడికక్కడే చేసుకోవచ్చు. ఉదా: మీరు మీ ఇంటి మెట్ల మీద ఒక మెట్లపైకి ఎక్కడం, కిందకి దిగడం (అవసరమైతే హ్యాండ్ రోల్ ను పట్టుకోవచ్చు). లేదా అరుబయట నడవడం లాంటి వ్యాయాయాలు చేయవచ్చు.

* శక్తిని పెంచే వ్యాయామాలైన వాల్ పుషప్స్ చేయాలి. ( నేలకి బదులుగా గోడపై మీ చేతులను ఉంచడం ద్వారా స్టాండింగ్ పుషప్స్ చేయడం)

* గోడకు వీపును ఆనించి గుంజీలు తీసిన విధంగా కిందకూ పైకి లేవడం

* వారానికి మూడు సార్లు స్ట్రెచ్చింగ్ ఎక్సర్ సైజులు చేయడం అలవాటు చేసుకోండి. ఇందులో భాగంగా ముందుగా మీరు మూడు వ్యాయామాలను ఎంచుకుని ఒక్కొక్కదాన్ని 10సార్లు చేయండి. అలా క్రమక్రమంగా బరువుతోపాటు ఎక్కువసార్లు చేస్తూ వెళ్లండి

* ఎల్లప్పుడూ స్ట్రెచ్చింగ్ ఎక్సర్ పైజ్ లతో వ్యాయామం ముగించండి. ఉదాహరణకు, మీరు మీ చేతులను భుజాల వరకు ఇరువైపులా తిప్పండి. ఆ తర్వాత మీ అరచేతులను పైకి, కిందికి తిప్పండి

* ఇవి మీరు వ్యాయామాన్ని తిరిగి ప్రారంభించడానికి చేస్తున్న కొన్ని సూచనలు. మీరు ఇతర వ్యాయామాలు కూడా చేసుకోవచ్చు.

* మీరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు అలసిపోయినట్టు అనిపించకపోతే ఉదయం పూట కొన్ని నిమిషాలపాటు నడవడం మంచిది.

* చాలా రోజుల తర్వాత వ్యాయామం చేస్తున్నారు కాబట్టి ఈ సమయంలో కొంచెం ఆయాసంగా అనిపించడం సాధారణమే అని గుర్తించుకోండి.

-డాక్టర్ అర్జా శ్రీకాంత్

స్టేట్ నోడల్ ఆఫీసర్, కోవిడ్-19


0 comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

SEARCH THIS SITE

EDUCATIONAL UPDATES

TRENDING

AMMA VODI 2022  
✺ TEACHERINFO వాట్సాప్ గ్రూప్ లింక్స్ ✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

Mid Day Meal

HEALTH

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top