Sunday, May 16, 2021

CARONA TESTS: ఏ ఏ టెస్ట్ లు ఎందుకు .. ? కొవిడ్‌ నిర్ధారణ, చికిత్స సమయంలో పలు పరీక్షల నిర్వహణ

వైరస్‌ తీవ్రత, అవయవాల పనితీరు తెలుసుకునేందుకు అవకాశం

ఆయా ఫలితాలను బట్టి మందులు/స్టెరాయిడ్స్‌ మారుస్తున్న వైద్యులు.

విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి: కరోనా...ప్రజల జీవితాల్లో కల్లోలం సృష్టిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా భయాందోళనతో జీవించాల్సిన పరిస్థితిని తీసుకువచ్చింది. ఈ క్రమంలో ప్రజలు రకారకాల పరీక్షలు చేయించుకుంటున్నారు. అయితే, వైద్యుల సలహాతో అవసరమైన పరీక్షలు మాత్రమే చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.  కరోనా సమయంలో చేయించుకోవాల్సిన పరీక్షలను ఒకసారి పరిశీలిద్దాం. 

ర్యాపిడ్‌ యాంటీజెన్‌

కరోనా వైరస్‌ నిర్ధారణకు చేసే పరీక్షల్లో ఇదొకటి. దీని ద్వారా శరీరంలో వైరస్‌ ఉందో, లేదో అనే విషయాన్ని కొంత వరకు తెలుసుకోవచ్చు. ఇందులో పాజిటివ్‌ వస్తే..దాన్ని కన్ఫార్మ్‌ చేయొచ్చు. అదే నెగెటివ్‌ వస్తే మాత్రం ఆర్టీపీసీఆర్‌ పరీక్షకు వెళ్లడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే వైరస్‌ బారినపడినప్పటికీ.. ప్రతి ముగ్గురిలో ఒకరికి నెగెటివ్‌ వచ్చే అవకాశం ఉంది. ఈ పరీక్ష రక్త నమూనాలు సేకరించడం ద్వారా చేస్తారు. 

RTPCR పరీక్ష

కరోనా నిర్ధారణలో ఎక్కువగా చేసే పరీక్ష. ముక్కు, గొంతు నుంచి నమూనా సేకరించి పరీక్షిస్తారు. ఆయా అవయవాల నుంచి సేకరించిన నమూనాలను బట్టి 63 శాతం నుంచి 93 శాతం వరకు ఫలితం యాక్యురేట్‌గా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

హెచ్‌ఆర్‌సీటీ..

కరోనా వైరస్‌ వల్ల ఊపిరితిత్తుల్లో ఏమైనా ఇన్‌ఫెక్షన్‌ (మచ్చ) ఏర్పడినట్టయితే ఇందులో తెలుస్తుంది. వైరస్‌ వున్న వ్యక్తుల్లో న్యుమోనియా వల్ల ఏర్పడిన ప్యాచెస్‌ మాదిరిగా ఇందులో కనిపిస్తాయి. వైరస్‌ తీవ్రతను బట్టి రిపోర్టులో స్కోరు ఇస్తారు. స్కోరును బట్టి వైరస్‌ తీవ్రతను అంచనా వేస్తారు. 25 పాయింట్లకుగాను 8-9 ఉంటే మైల్డ్‌గా, 9-16 పాయింట్లు ఉంటే మోడరేట్‌గాను, 15-25 ఉంటే సివియర్‌గా వున్నట్టు వైద్యులు నిర్ధారించి అవసరమైన వైద్యాన్ని అందిస్తారు. 

ఈ మూడు కరోనా నిర్ధారణకు చేసే పరీక్షలైతే, నిర్ధారణ అయిన తరువాత చికిత్స పొందుతున్న సమయంలోనూ కొన్ని పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షల వల్ల శరీరంలో వైరస్‌ లోడ్‌, లోడ్‌ను బట్టి అందించాల్సిన మందులను వైద్యులు నిర్ధారిస్తారు. 

కంప్లీట్‌ బ్లడ్‌ పిక్చర్‌ (సీబీపీ): ఈ పరీక్ష వల్ల రక్తంలో ఇన్‌ఫెక్షన్‌ ఏ స్థాయిలో ఉందీ, తెల్ల రక్తకణాలు, ఎర్ర రక్తకణాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకునేందుకు అవకాశముంటుంది. 

సీ రియాక్టివ్‌ ప్రోటీన్‌ (సీఆర్‌పీ): పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిలో వైరస్‌ శరీరంలోకి ప్రవేశించగానే..దానితో పోరాడేందుకు వ్యాధి నిరోధక శక్తి సన్నద్ధమవుతుంది. అయితే, కొంతమందిలో వ్యాధి నిరోధకశక్తి హైపర్‌ రియాక్ట్‌ అవుతుంది. దీని ప్రభావం శరీరంలోని పలు అవయవాలపై పడే అవకాశముంది. ఈ పరీక్ష చేయడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి రియాక్షన్‌ స్థాయిని తెలుసుకోవచ్చు. దీనివల్ల వైరస్‌ బాఽధితుడికి ఎదురయ్యే సమస్యలు ముందుగానే తెలుసుకుని వైద్య సేవల్లో మార్పులను చేసుకునేందుకు అవకాశముంది. సాధారణంగా ఆరు మిల్లీ గ్రాములు కంటే తక్కువగా ఉండాలి. వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉండి, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వారిలో ఇది 20-30 మిల్లీ గ్రాములు వుంటున్నట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు. 

డి డైమర్‌: కరోనా వైరస్‌ బారినపడిన కొంతమందికి పలు అవయవాల్లో రక్తం గడ్డ కడుతోంది. ఈ పరీక్ష చేయడం ద్వారా రక్తం గడ్డ కట్టే తత్వాన్ని తెలుసుకునేందుకు అవకాశముంది. రోజు తప్పించి రోజు ఈ పరీక్ష చేస్తారు. దీనివల్ల రోగి ప్రమాదకర స్థాయికి వెళ్లకుండా నిరోధించేందుకు అవకాశముంది. 

ఐఎల్‌-6: పాజిటివ్‌ వచ్చిన వ్యక్తుల్లో వ్యాధి నిరోధక శక్తి హైపర్‌గా రియాక్ట్‌ కావడం వల్ల కొన్నిరకాల కెమికల్స్‌ అవసరానికి మించి విడుదలై శరీరాన్ని డ్యామేజీ చేస్తాయి. వీటిని సైటోకైన్స్‌ స్మార్ట్‌ అంటారు. ఐఎల్‌-6 పరీక్షలో దాని వాల్యూ పది లోపు ఉండాలి. కొంతమందిలో పది రెట్లు కంటే ఎక్కువగా ఉంటోంది. అటువంటివారికి ఖరీదైన టొసులిజోమాబ్‌ అనే మందు వినియోగించాల్సి వస్తోంది. 

వీటితోపాటు కిడ్నీ, లివర్‌, షుగర్‌ పరీక్ష చేస్తారు. ఫెరిటిన్‌, ఎల్‌డీహెచ్‌, ట్రాపై (గుండె) శరీరంలో జరుగుతున్న మారుతున్న మార్పులను తెలియజేస్తాయి. వెంటనే స్టెరాయిడ్‌ వాడాలన్న విషయం మార్పులను బట్టి తెలుస్తుంది. ఆ స్టేజ్‌కు వెళుతున్నామా? లేదా..? అన్నది తెలుస్తుంది. 

వందలో 20 మందికి మాత్రమే అవసరం: డాక్టర్‌ ఫణీంద్ర, పల్మనాలజిస్ట్‌, కిమ్స్‌ ఐకాన్‌ ఆస్పత్రి

పాజిటివ్‌ నిర్ధారణ అయిన తరువాత చేసే ఈ పరీక్షలన్నీ అందరికీ అవసరం లేదు. వైరస్‌ సోకిన వంద మందిలో 20 మందికి మాత్రమే అవసరం అవుతాయి. సాధారణంగా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 7-10 రోజుల తరువాత రెండో స్టేజీ కనిపిస్తుంది. ఈ దశలో రక్తంలో, ఊపిరితిత్తుల్లో మార్పులు కనిపిస్తాయి. వాటిని నిర్ధారించేందుకు ఈ పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు/స్టెరాయిడ్స్‌ను మార్చడం ద్వారా వారు ప్రాణాపాయ స్థితికి చేరుకోకుండా కాపాడుకోవచ్చు. కొంత మంది డబ్బుతో సంబంధం లేదు అన్న ఉద్దేశంతో వైరస్‌ సోకిన తరువాత, మధ్యలో, వైరస్‌ తగ్గిన తరువాత ఈ పరీక్షలు చేయించుకుంటున్నారు. దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. వైద్యుల సలహా మేరకు మాత్రమే ఆయా పరీక్షలు చేయించుకోవాలి. పాజిటివ్‌ వచ్చి ఆస్పత్రిలో చేరిన ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా డి డైమర్‌, సీబీపీ, సీఆర్‌పీ వంటి పరీక్షలు నిర్వహిస్తారు. 


SEARCH THIS SITE

EDUCATIONAL UPDATES

job news HEALTH TIPS

TRENDING

✺ TEACHERINFO వాట్సాప్ గ్రూప్ లింక్స్ ✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

Mid Day Meal

HEALTH

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top