Wednesday, May 26, 2021

CARONA: 4th Wave: వణుకుతోన్న జపాన్‌ నగరాలు!'


WHATSAPP GROUP TELEGRAM GROUP


కరోనా వైరస్‌ ఫోర్త్‌ వేవ్ (నాలుగో విజృంభణ) ధాటికి జపాన్‌ నగరం ఒసాక వణికిపోతోంది. 4th Wave: వణుకుతోన్న జపాన్‌ నగరాలు!'

టోక్యో: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వైరస్‌ అదుపులోకి వస్తుండగా మరికొన్ని దేశాల్లో మాత్రం కొత్తగా మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా జపాన్‌లోనూ వైరస్‌ తీవ్రత పెరుగుతోంది. ముఖ్యంగా నాలుగో వేవ్‌ భయంతో జపాన్‌ నగరం ఒసాకా వణికిపోతోంది. మరికొన్ని రోజుల్లోనే జరిగే ఒలింపిక్స్‌ వేడుకలకు సన్నద్ధం అవుతున్న వేళ.. వైరస్‌ భయం ఒసాకా నగరాన్ని వెంటాడుతోంది. వైరస్‌ ఉద్ధృతి పెరగడంతో జపాన్‌లో రెండో అతిపెద్ద నగరమైన ఒసాకాతో పాటు మరో ఎనిమిది నగరాల్లోనూ హెల్త్‌ ఎమర్జెన్సీ అమలు చేస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ విస్తృతంగా పంపిణీ కొనసాగడంతో కొన్ని దేశాలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నాయి. కానీ, ఇన్నిరోజులు వైరస్‌ వ్యాప్తిని నియంత్రించగలిగిన జపాన్‌లో మళ్లీ కరోనా విజృంభణ కలవరపెడుతోంది. ప్రస్తుతం కరోనా వైరస్‌ ఫోర్త్‌ వేవ్‌ ధాటికి ఒసాకా వణికిపోతోంది. ఇప్పటికే అక్కడ పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుపోతున్నాయి. ఈ వారంలో 3849 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా జపాన్‌లో సంభవిస్తోన్న కొవిడ్‌ మరణాలు దాదాపు 25శాతం ఆ ఒక్క నగరంలోనే ఉంటున్నాయి. మూడు నెలల క్రితంతో పోలిస్తే ఇవి ఐదు రెట్లు ఎక్కువ. ఇప్పటికే అక్కడి ఆసుపత్రుల్లో 96శాతం పడకలు కొవిడ్‌ బాధితులతో నిండిపోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. తాజాగా ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల్లో తీవ్ర లక్షణాలు కనిపిస్తుండడంతో కోలుకోవడం ఇబ్బందిగా మారినట్లు అక్కడి వైద్యులు పేర్కొంటున్నారు. ఇలా ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరగడంతో అక్కడి ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు

బ్రిటన్‌ రకమే కారణమా..?

దాదాపు 90 లక్షల జనాభా కలిగిన ఒసాకా నగరంలో ఈ నెలలో కరోనా తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ఇందుకు బ్రిటన్‌లో వెలుగు చూసిన కొత్తరకం కరోనా వైరస్‌ కారణం అయిఉండవచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. గతకొద్ది రోజులుగా పాజిటివ్‌ నిర్ధారణ అవుతున్న వారిలో 14శాతం ఆసుపత్రిలో చేరుతున్నట్లు గుర్తించారు. ఇక టోక్యోలోనూ కొవిడ్‌ బాధితుల్లో 37శాతం మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు. వీరిలో తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు కోలుకోవడం ఇబ్బందికరంగా మారిందని అక్కడి వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆసుపత్రుల్లో ఔషధాలు, వెంటిలేటర్ల కొరత ఎక్కువ కావడంతో పాటు రోగుల తాకిడిని తట్టుకునేందుకు ప్రస్తుతం ఉన్న వైద్యులు, నర్సులు సరిపోవడం లేదనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఒసాకాలో ఆరోగ్యవ్యవస్థ కుప్పకూలిపోయిందని అక్కడి కిండాయ్‌ యూనివర్సిటీ హాస్పిటర్‌ డైరెక్టర్‌ యుజి తొహ్‌డా పేర్కొన్నారు. జపాన్‌ కేవలం ఇప్పటివరకు వైద్య ఆరోగ్య సిబ్బందిలో సగం మందికి మాత్రమే వ్యాక్సిన్‌ అందించడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిందన్నారు.

కేవలం 2శాతం వ్యాక్సినేషన్

మరో తొమ్మిది వారాల్లో జపాన్‌లో ఒలింపిక్స్‌ నిర్వహించేందుకు అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ (IOC) సిద్ధమవుతోంది. అయితే, క్రీడలు ప్రారంభమయ్యే నాటికి ఒలింపిక్స్‌ క్రీడా గ్రామాల్లో దాదాపు 80శాతం మందికి వ్యాక్సిన్‌ వేస్తామని ఐఓసీ ప్రకటించింది. కానీ, 12.5కోట్ల జనాభా ఉన్న జపాన్‌లో ఇప్పటివరకు కేవలం 2 నుంచి 3శాతం మందికే వ్యాక్సిన్‌ అందించారు. క్రీడలకు సమయం దగ్గరపడుతుండడం, వైరస్‌ ఉద్ధృతి పెరుగుతుండడంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. వ్యాక్సినేషన్‌ను భారీ స్థాయిలో చేపట్టేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా టోక్యో, ఒసాక నగరాల్లో వ్యాక్సినేషన్ ముమ్మరంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం జపాన్‌లో ఫైజర్‌, మోడెర్నాతో పాటు ఆస్ట్రాజెనెకాను అనుమతించినప్పటికీ ఆస్ట్రాజెనెకా పంపిణీ ఇంకా ప్రారంభం కాలేదు.

జపాన్‌ వెళ్లొద్దన్న అమెరికా..

జపాన్‌లో వైరస్‌ తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడికి ప్రయాణాలను రద్దు చేసుకోవాలని అమెరికా అక్కడి పౌరులకు సూచించింది. కొత్తరకాల ప్రభావం కనిపిస్తున్న వేళ.. వ్యాక్సిన్‌ తీసుకున్న వారు కూడా జపాన్‌కు వెళ్లకపోవడమే మంచిదని హెచ్చరించింది. ఇదిలాఉంటే, జపాన్‌లో ఇప్పటివరకు 7లక్షల 28వేల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, 12వేల మరణాలు సంభవించాయి. వైరస్‌ వ్యాప్తిని సమర్థవంతంగా నియంత్రించినప్పటికీ తాజాగా వైరస్‌ ఉద్ధృతి పెరగడం జపాన్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.

WHATSAPP GROUP TELEGRAM GROUP

SEARCH THIS SITE

LATEST UPDATES

Varadhi worksheets class 1-10
Your Salary slip with One Click

TRENDING

SCERT TEXT BOOKS CLASS 1 TO 10

Mid Day Meal

NAADU NEDU

EDUCATIONAL APPS

JOBS/RESULTS/NOTIFICATIONS

ORDERS & PROCEEDINGS

TRANSFERS 2020

Top