Sunday, May 2, 2021

పరీక్షలా.. ప్రాణాలా?!ఇంటర్‌ విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన 

కొంతకాలం పాటు వాయిదా వేస్తే నష్టమేంటి? 

సీబీఎస్‌ఈ, ఇతర రాష్ట్రాలను అనుసరించవచ్చు

పిల్లల భవిష్యత్తు కోసమేననడం సమర్థనీయమా? 

కరోనా సోకి ప్రాణం పోతే తిరిగి తీసుకురాగలరా? 

ప్రభుత్వంపై తల్లిదండ్రులు, విద్యావేత్తల ధ్వజం

అమరాతి-ఆంధ్రజ్యోతి) 

కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణతో జనం వణికిపోతున్నా 5నుంచి ఇంటర్మీడియెట్‌ పరీక్షలు నిర్వహిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం భీష్మించడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కేసులు, మరణాలు శరవేగంగా పెరుగుతుండటంతో పరీక్షలు రాయడమా... ప్రాణాలు కాపాడుకోవడమా అని మల్లగుల్లాలు పడుతున్నారు. కరోనా కట్టడిలో విఫలమైన సర్కారు పరీక్షల విషయంలో మాత్రం ఎందుకు మొండి పట్టుదలతో వ్యవహరిస్తోందో అర్థం కావడం లేదని ఆక్షేపిస్తున్నారు. ప్రస్తుత అసాధారణ పరిస్థితుల్లో ఇంటర్‌ పరీక్షలు కొంతకాలం పాటు వాయిదా వేస్తేనష్టమేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే సీబీఎ్‌సఈ, దేశంలోని సగం రాష్ట్రాల బోర్డులను మనం కూడా అనుసరిస్తే తప్పేమిటని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. కొవిడ్‌ తీవ్రతను రాష్ట్ర ప్రభుత్వం ఆషామాషీగా తీసుకుంటూ లక్షలాది మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని ధ్వజమెత్తుతున్నారు. 

ఈ ప్రశ్నలకు బదులేదీ?

విద్యార్థుల భవిష్యత్తు కోసమే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు స్వయంగా సీఎం, విద్యాశాఖ మంత్రి చెప్పడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలు వాయిదా వేసినంత మాత్రాన పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందా అని ప్రశ్నిస్తున్నారు. మా పిల్లలకు కరోనా సోకదని గ్యారంటీ ఇస్తారా? పరీక్ష కేంద్రాల్లో ఐసొలేషన్‌ గదులు ఏర్పాటు చేసి కరోనా సోకిన విద్యార్థులకు వాటిలో పరీక్షలు నిర్వహిస్తామని విద్యామంత్రి చెబుతున్నారని.. కానీ పరీక్ష ముగిసిన తర్వాత ఆ పిల్లల గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? వారు మిగతా విద్యార్థుల గుంపులో కలిసినప్పుడు అందరికీ కరోనా సోకదా అని ప్రశ్నిస్తున్నారు పరీక్ష హాల్లో ఐసొలేషన్‌ గదులు ఏర్పాటు చేస్తే ఎంతమంది డాక్టర్లను అందుబాటులో ఉంచుతారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారని నిలదీస్తున్నారు. ఒక పరీక్ష కేంద్రంలో ఒక విద్యార్థికి జరగకూడనిది ఏదైనా జరిగితే ఆ సెంటర్‌ మొత్తం అలజడి రేగుతుంది. అటువంటి సమయంలో వారు సరిగ్గా పరీక్ష రాయగలరా? విద్యార్థులు ఇంటి నుంచి బయలుదేరినప్పుడు దారిలో కలిసేవారిలో ఎవరికైనా కరోనా ఉంటే ఇబ్బంది కాదా? విద్యార్థుల ప్రాణాలకు ముప్పు ఏర్పడితే పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాగలరా? అని ధ్వజమెత్తుతున్నారు. కరోనా అంటే భయం లేనప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఎందుకు నిలిపివేశారు? మీ పరిపాలన భవనంలో ఉద్యోగులు కరోనాతో చనిపోయిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 150మంది ఉపాధ్యాయులు వైరస్‌ బారినపడి మరణించడం వాస్తవం కాదా అని తల్లిదండ్రులు నిలదీస్తున్నారు. 

రద్దు చేస్తే ఏమవుతుంది? 

పరీక్షలను రద్దుచేస్తే కేవలం పాస్‌ మార్కులతో బయటపడిన విద్యార్థుల 50ఏళ్ల భవిష్యత్తు ఏమిటని సీఎం ప్రశ్నించడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. అనివార్య పరిస్థితుల్లో పరీక్షలు రద్దుచేసినా ఆ ప్రభావం పెద్దగా ఉండబోదంటున్నారు. ఇప్పటివరకు ఎంసెట్‌, జేఈఈలో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ ఇస్తున్నారు. కానీ ప్రత్యేక పరిస్థితుల్లో పరీక్షలు రద్దు చేసినప్పుడు ప్రత్యామ్నాయం ఉంటుందని చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల్లోని కొన్ని విద్యాసంస్థల్లో అడ్మిషన్లకు ఇంటర్‌ మార్కులు అవసరమని చెబుతూ భవిష్యత్తుకు నష్టం జరుగుతుందనడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. కేవలం టెన్త్‌, ఇంటర్‌ మార్కుల ప్రాతిపదికగా ఉద్యోగాలు, అడ్మిషన్లు ఇచ్చే పరిస్థితి ఇప్పుడు లేదని, ప్రత్యేక ఎంట్రన్స్‌లు, రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ల నిర్వహణ అనివార్యంగా మారిందని అభిప్రాయపడుతున్నారు. పరీక్షల రద్దు సాధ్యం కాదనుకుంటే కనీసం ప్రస్తుతానికి వాయిదా వేసి కొవిడ్‌ తీవ్రత తగ్గిన తర్వాత సమీక్షించి నిర్ణయం తీసుకోవాలన్న డిమాండ్లు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ విషయమై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉంది. 

వెసులుబాటు ఉంది

కొవిడ్‌ వ్యాప్తి కారణంగా ఎంసెట్‌ ర్యాంకింగ్‌లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీని తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే జేఈఈ పరీక్షలకు ప్రవేశార్హతలో ఇంటర్‌ మార్కులు పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయం తీసుకోవచ్చు. గతేడాది రాష్ట్రంలో టెన్త్‌ పరీక్షలు రద్దుచేసి అందరినీ పాస్‌ చేశారు. దీంతో ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు ఎంట్రన్స్‌ నిర్వహించి మెరిట్‌ ప్రకారం అడ్మిషన్లు చేపట్టారు. ఈ మేరకు ఆర్‌జీయూకేటీ నిబంధనలు సైతం సవరించారు. ఇంటర్‌ మార్కుల ఆధారంగా జరిగే డిగ్రీ అడ్మిషన్లలోనూ అవసరమైతే ప్రవేశ పరీక్ష నిర్వహించి విద్యార్థులను చేర్చుకోవచ్చు. అవసరాన్ని బట్టి నిబంధనల్లో మార్పులు చేసుకునే వెసులుబాటు ఎప్పుడూ ఉంటుంది

SEARCH THIS SITE

LATEST UPDATES

Varadhi worksheets class 1-10
Your Salary slip with One Click

TRENDING

SCERT TEXT BOOKS CLASS 1 TO 10

Mid Day Meal

NAADU NEDU

EDUCATIONAL APPS

JOBS/RESULTS/NOTIFICATIONS

ORDERS & PROCEEDINGS

TRANSFERS 2020

Top