Saturday, May 22, 2021

కృష్ణపట్నంలో అల్లకల్లోలం..


WHATSAPP GROUP TELEGRAM GROUP


👉 కరోనా మందుకు పోటెత్తిన జనం
👉 కొవిడ్ బాధితులకు దొరకని అభయం
👉 మూడు కి.మీ.ల మేర నిలిచిన ట్రాఫిక్
👉 తోపులాట, పోలీసుల లాఠీఛార్జి
👉 పంపిణీ నిలిపివేత

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: ముత్తుకూరు, న్యూస్‌టుడే: కొవిడ్‌కు ఉచితంగా మందు ఇస్తున్న సమాచారంతో నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నానికి శుక్రవారం జనం పోటెత్తారు. ఆనందయ్య పంపిణీ చేస్తున్న ఆయుర్వేద మందు కరోనాను అంతమొందిస్తోందన్న ప్రచారంతో ఏపీతోపాటు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఒడిశాల  నుంచి ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని సైతం అంబులెన్సుల్లో తీసుకురాగా... మందు పంపిణీ ప్రారంభించిన కొద్దిసేపటికే అయిపోయిందని తెలపడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. ఎలాగైనా మందు దక్కించుకోవాలని వచ్చినవారు ఎగబడటంతో తోపులాట జరిగింది. వారిని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. ఇటీవల లోకాయుక్త ఆదేశాలతో అధికారులు మందు పంపిణీని నిలిపివేశారు. దాని తయారీలో వాడే సామగ్రిని పరీక్షల నిమిత్తం ఆయుష్‌ పరిశోధనశాలకు పంపడంతోపాటు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా యంత్రాంగం లోకాయుక్తకు పంపింది. ల్యాబ్‌ నివేదిక ఇంకా రాకపోవడంతో.. అధికారులు మందు పంపిణీకి మొదట అనుమతివ్వలేదు. కానీ... దాన్ని వాడిన వారి నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేకపోవడం, వాడిన వారంతా కొవిడ్‌ నుంచి బయట పడినట్లు అధికారులు నివేదికలో పేర్కొనడంతో... సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి శుక్రవారం నుంచి ఆయుర్వేద మందు పంపిణీ ప్రారంభిస్తారని ప్రకటించారు. దాంతో బాధితులు, వారి బంధువులు కృష్ణపట్నం వైపు పరుగులు తీశారు. శుక్రవారం ఉదయం 6గంటలకే వేలాది మందితో గ్రామం కిక్కిరిసింది. తొమ్మిది గంటల సమయంలో ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభించగా... ప్రజలు ఎగబడ్డారు.శుక్రవారం ఉదయం ప్రజల రాకను గుర్తించిన పోలీసులు... నెల్లూరు నుంచి కృష్ణపట్నం వెళ్లే దారిలో ఆరు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఆధార్‌ కార్డు ఆధారంగా స్థానికతను గుర్తించి అనుమతించారు. కానీ, ఒక్కసారిగా వేలాది వాహనాలు రావడంతో చేతులెత్తేశారు. క్యూలైన్లు ఏర్పాటు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. కొందరు కొవిడ్‌ బాధితులు ఎండ తీవ్రతకు సొమ్ముసిల్లి పడిపోయారు. కరోనా సోకిన వారు గ్రామంలోకి పెద్దఎత్తున రావడంపై గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. అంబులెన్సులను తమ ఇళ్ల ముందు పెడుతున్నారని వాపోయారు. బాధితులు కనీసం మాస్కులు కూడా పెట్టుకోవడం లేదని అభ్యంతరం తెలిపారు.  ఆయుర్వేద మందు పంపిణీ ప్రారంభించిన గంటలోపే నిర్వాహకులు నిలిపివేశారు. మళ్లీ ఎప్పుడు ఇచ్చే తేదీని తర్వాత ప్రకటిస్తారని చెప్పడంతో ప్రజలు ఆందోళన చేశారు.

నెల్లూరు(వైద్యం), న్యూస్‌టుడే: ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందును రాష్ట్ర ఆయుష్‌ శాఖ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం శుక్రవారం పరిశీలించింది. ఈ మేరకు ఆ మందులో వినియోగిస్తున్న పదార్థాలు, అక్కడ బాధితులకు పంపిణీ చేస్తున్న తీరుపై ఆయుష్‌శాఖ కమిషనర్‌ కర్నల్‌ వి.రాములు, డ్రగ్‌ లైసెన్సింగ్‌ అథారిటీ ఆఫీసర్‌ డాక్టర్‌ పీవీఎన్‌ఆర్‌ ప్రసాద్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ డాక్టర్‌ సాయికుమార్‌, విజయవాడ ప్రభుత్వ ఆయుర్వేదిక్‌ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సాయి సుధాకర్‌, జిల్లా ఆయుష్‌ అధికారి డాక్టర్‌ శ్రీనివాస్‌, ఆయుష్‌ వైద్యుడు డాక్టర్‌ గంటా గంగాధర్‌లతో కూడిన బృందం ఆరా తీసింది. అనంతరం రాత్రి కలెక్టర్‌ చక్రధర్‌బాబుతో బృంద సభ్యులు మాట్లాడారు. ఆయుర్వేద మందుకు సంబంధించిన పరీక్షలు కొన్ని పూర్తి కావాల్సి ఉందన్నారు. అప్పటివరకు పంపిణీ నిలిపేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

WHATSAPP GROUP TELEGRAM GROUP

SEARCH THIS SITE

LATEST UPDATES

Varadhi worksheets class 1-10
Your Salary slip with One Click

TRENDING

SCERT TEXT BOOKS CLASS 1 TO 10

Mid Day Meal

NAADU NEDU

EDUCATIONAL APPS

JOBS/RESULTS/NOTIFICATIONS

ORDERS & PROCEEDINGS

TRANSFERS 2020

Top