Monday, March 1, 2021

TET, DSC, TRANSFERS భర్తీవరుసగా నిర్వహణకు విద్యాశాఖ కసరత్తు

ప్రభుత్వానికి త్వరలో ప్రతిపాదనలు.. ఆమోదం లభించగానే కార్యాచరణ 

TET-DSC

అమరావతి: ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటికే నాడు–నేడు ద్వారా 45 వేలకుపైగా ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలను సమకూరుస్తున్న విషయం తెలిసిందే. రన్నింగ్‌ వాటర్‌తో మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం, కుర్చీలు, బెంచీలు, ర్యాకులు, గ్రీన్‌ చాక్‌ బోర్డులు, భవనాలకు మరమ్మతులు, రంగులు ఇలా పలు రకాల సదుపాయాలు కల్పిస్తుండగా మొదటి దశ కింద 15 వేలకు పైగా స్కూళ్లలో పనులు మార్చి ఆఖరుకు పూర్తిచేయనున్నారు. ఇతర దశల పనులకు సంబంధించి కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. మరోవైపు ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకు కూడా విద్యాశాఖ కార్యాచరణ ప్రారంభించింది. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించగానే తదుపరి చర్యలు చేపట్టేలా ఏర్పాట్లు చేస్తోంది.

తొలుత ‘టెట్‌’

ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం డీఎస్సీ ప్రకటించటానికి ముందు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. 

2018లో టెట్‌ రెండుసార్లు నిర్వహించిన అనంతరం మళ్లీ ఆ పరీక్షలు జరగలేదు. డీఎడ్‌ పూర్తిచేసిన కొత్త బ్యాచ్‌ల అభ్యర్థులు టెట్‌ కోసం నిరీక్షిస్తున్నారు. వారు డీఎస్సీకి దరఖాస్తు చేయాలంటే టెట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరి కావడంతో తొలుత టెట్‌ నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. గతంలో రాసినవారితోపాటు ఏడేళ్ల కాలపరిమితి దాటిన వారు (గతంలో ఉత్తీర్ణులు) ఈసారి టెట్‌ పరీక్షకు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది. గతంలో టెట్‌కు 3,97,957 మంది దరఖాస్తు చేయగా 3,70,576 మంది హాజరయ్యారు. ఈసారి ఈ సంఖ్య 5 లక్షలకు పైగా ఉండే అవకాశముంది.

ఆంగ్ల నైపుణ్యాలకు పరీక్ష

టెట్, డీఎస్సీ సిలబస్‌లో ఈసారి కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం నేపథ్యంలో ఇంగ్లీషులో అభ్యర్థుల బోధనా నైపుణ్యాలను పరీక్షించేలా చర్యలు చేపట్టనున్నారు. దీనికి సంబంధించి టెట్‌లో ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ కింద అదనంగా పరీక్ష నిర్వహించనున్నారు. ఈమేరకు పాఠశాల విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) సిలబస్‌ రూపొందిస్తోంది. పాఠ్యపుస్తకాల్లో అంశాలను కూడా గత ఏడాది మార్పు చేసినందున డీఎస్సీ సిలబస్‌లోనూ మార్పులు జరగనున్నాయి. 

మరోసారి బదిలీలకు అవకాశం!

టెట్‌ –2021 నిర్వహించిన అనంతరం డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చేలా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ స్కూళ్లలో అందుబాటులో ఉన్న ఖాళీలన్నిటినీ భర్తీ చేసేలా పోస్టుల సంఖ్యతో నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. ఈ డీఎస్సీలో ఎంపికైన వారికి నియామక ఉత్తర్వులు ఇచ్చే ముందు మరోసారి టీచర్ల బదిలీలకు అవకాశం కల్పించనున్నారు. ఇటీవల బదిలీల సందర్భంగా మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీల్లోని పాఠశాలల్లో టీచర్‌ స్థానాలు ఖాళీ అయిపోకుండా విద్యాశాఖ దాదాపు 15 వేల వరకు పోస్టులను బ్లాక్‌ చేసి ఉంచింది. ఈ పోస్టులను ఇప్పటికే మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న, సర్వీసులో ఉన్న టీచర్లతో సీనియార్టీని అనుసరించి భర్తీ చేయనున్నారు. ఇందుకు అనుగుణంగా బదిలీలకు అవకాశం కల్పిస్తారు. ఈ బదిలీల ప్రక్రియ అనంతరం డీఎస్సీలో ఎంపికైన కొత్త టీచర్లకు గ్రామీణ ప్రాంతాల్లో పోస్టింగ్‌ ఇవ్వనున్నారు.

 ప్రత్యేక కేటగిరీ పోస్టుల భర్తీ

ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకోసం 2018లో నిర్వహించిన ప్రత్యేక డీఎస్సీలో 403 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వగా కొన్ని మాత్రమే భర్తీ అయ్యాయి. వాటికి మళ్లీ కొత్తగా నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. 2018 జనరల్‌ డీఎస్సీకి సంబంధించి పలు న్యాయవివాదాలు తలెత్తడంతో ఆ పోస్టుల భర్తీ విద్యాశాఖకు కత్తిమీద సాములా మారింది. వివాదాలను ఒక్కొక్కటే పరిష్కరిస్తూ దాదాపు అన్ని పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇచ్చారు. 


0 comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

SEARCH THIS SITE

RECENT NEWS

TRANSFERS 2022

✺ TEACHERINFO వాట్సాప్ గ్రూప్ లింక్స్ ✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

CETS/NOTIFICATIONS/RESULTS

HEALTH

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top