Monday, February 22, 2021

Carona సెకండ్‌ వేవ్‌ భయం!వారం రోజుల్లో 87 వేల కేసులు

వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయాలని రాష్ట్రాలకు కేంద్రం లేఖ

లాక్‌డౌన్‌ దిశగా మహారాష్ట్ర

ప్రజల నిర్లక్ష్యమే కారణమంటున్న ఆరోగ్య నిపుణులు


carona-second-wave

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభి స్తోందనే భయాందోళనలు మొదలయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14,264 కేసులు నమోదు కావడం ఆందోళన రేకెత్తిస్తోంది.  వారం రోజుల్లో 86,711 కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య లక్షా 50 వేలకి చేరువలో ఉంది. మొత్తం కేసుల్లో ఇవి 1.32 శాతం. మహారాష్ట, కేరళ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్‌ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది.

ప్రమాదకరంగా కొత్త స్ట్రెయిన్‌: ఎయిమ్స్‌ చీఫ్‌

మహారాష్ట్రలో కొత్త స్ట్రెయిన్‌ అత్యంత ప్రమాదకరంగా మారిందని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా చెప్పారు. శరీరంలో యాంటీబాడీలు ఉన్నప్పటికీ ఈ కొత్త స్ట్రెయిన్‌ వల్ల ఇన్‌ఫెక్షన్‌ సోకడం ఆందోళన పుట్టిస్తోందని అన్నారు. ఇటీవల కాలంలో కరోనా కొత్త కేసులు అంతగా నమోదు కాకపోవడంతో హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించామేమోనన్న అంచనాలకు చాలా మంది వచ్చారు. కానీ భారత్‌లాంటి అత్యధిక జనాభా కలిగిన దేశంలో హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధ్యమయ్యే పని కాదని  అభిప్రాయపడ్డారు.  జనాభాలో 80 శాతం మందికి యాంటీబాడీలు ఉంటేనే అందరూ క్షేమంగా ఉంటారని అన్నారు.

ప్రజల నిర్లక్ష్యమే కారణం

మహారాష్ట్రలో కేసులు విచ్చలవిడిగా పెరిగిపోవడానికి ప్రజల నిర్లక్ష్యమే కారణమని ఆరోగ్య నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాస్కులు ధరించకుండా, భౌతికదూరం పాటించకపోవడం వల్లే కేసులు పెరిగిపోతున్నాయని కరోనా టాస్క్‌ఫోర్స్‌కు నేతృత్వం వహిస్తున్న డాక్టర్‌ సంజయ్‌ ఓక్‌ అన్నారు. ప్రజలు కోవిడ్‌ నిబంధనలు పాటించకపోతే కేసుల్ని కట్టడి చేయలేమన్నారు.   

వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయాలి

కరోనాని పూర్తిగా నిర్మూలించాలంటే వ్యాక్సినేషన్‌ ఒక్కటే మార్గమని విశ్వసిస్తున్న  కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు లేఖ రాసింది. కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వ్యాక్సినేషన్‌ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. వారంలో కనీసం నాలుగు రోజులు టీకా డోసులు ఇచ్చే కార్యక్రమం నిర్వహించాలని అన్నారు.   వచ్చే నెలకల్లా సీనియర్‌ సిటిజన్లకి వ్యాక్సినేషన్‌ ప్రారంభించాలని పేర్కొన్నారు.

మహారాష్ట్రలో మళ్లీ పంజా

సాక్షి ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఆంక్షలను ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. అత్యధికంగా కరోనా ప్రభావం ఉన్న యావత్మాల్‌ జిల్లాలో సోమవారం రాత్రి 8 గంటల నుంచి వారంపాటు లాక్‌డౌన్‌ అమలు చేయనున్నట్లు  మంత్రి యశోమతి ఠాకూర్‌ ప్రకటించారు. అకోలా జిల్లాలోని అకోలా, మూర్తిజాపూర్, అకోట్‌ తదితర పట్టణాల్లో 23 నుంచి లాక్‌డౌన్‌ అమలవుతుందని అధికారులు చెప్పారు. నాగపూర్, అమరావతి, బుల్దానా, వాశీం, పుణే, నాసిక్‌ జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ విధించారు. రాష్ట్రంలో వారం రోజుల్లో కరోనా కేసులు రెట్టింపయ్యాయి. 15న 3,365 కేసులు, 21న 6,071 కేసులు బయటపడ్డాయి. 

కాగా, మహారాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించాలా వద్దా అనే నిర్ణయం ప్రజల చేతిలో ఉందని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే పేర్కొన్నారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ముఖానికి మాస్క్‌ వినియోగించాలని కోరారు. అదే మన ఆయుధమని వ్యాఖ్యానించారు. నిబంధనలు పాటించకుంటే ఆఖరి అస్త్రంగా లాక్‌డౌన్‌  అమలు చేస్తామన్నారు. నిర్ణయం ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. లాక్‌డౌన్‌ కావాలనుకునేవారు కరోనా నియమాలు పాటించరని అన్నారు. రాష్ట్రంలో రాజకీయ, సామాజిక, ధార్మిక కార్యక్రమాలన్నింటినీ సోమవారం నుంచి కొన్ని రోజులపాటు రద్దు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. కరోనా నేపథ్యంలో ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్నట్టు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 


0 comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

SEARCH THIS SITE

RECENT NEWS

TRANSFERS 2022

✺ TEACHERINFO వాట్సాప్ గ్రూప్ లింక్స్ ✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

CETS/NOTIFICATIONS/RESULTS

HEALTH

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top