సచివాలయాల్లో రోజూ ‘స్పందన’

ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత

మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో సిబ్బంది 

గ్రామ, వార్డు సచివాలయాల జేసీలకు ప్రభుత్వం ఆదేశం    

ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి బయోమెట్రిక్‌ 

వలంటీర్లందరికీ గుర్తింపు కార్డులు.. నవరత్నాల లోగోతో బ్యాడ్జ్‌లు

నిర్ణీత వ్యవధిలోగా బియ్యం, పెన్షన్, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇళ్ల స్థలం ఇవ్వాల్సిందే

వలంటీర్ల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి.. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై వేటు

అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని ప్రజల సమస్యలను నిత్యం తెలుసుకుని, త్వరితగతిన పరిష్కరించేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి రోజు గ్రామ, వార్డు సచివాలయాల్లో స్పందన కార్యక్రమం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయాల బాధ్యతలు నిర్వహిస్తున్న జాయింట్‌ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. పని దినాల్లో గ్రామ, వార్డు సచివాలయాలన్నింటిలో ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు సిబ్బంది అంతా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండేలా చూడాలని  గ్రామ, వార్డు సచివాలయాల ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సిబ్బంది కార్యాలయం నుంచి వెళ్లే ముందు తప్పనిసరిగా బయోమెట్రిక్‌ పంచ్‌ వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది అందరికీ బయో మెట్రిక్‌ హాజరు తప్పనిసరి చేయాలని, ఈ హాజరు ఆధారంగానే వారికి వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఉత్తర్వులోని  ముఖ్యాంశాలు ఇంకా ఇలా ఉన్నాయి. 

2.6 లక్షల మంది వలంటీర్లకు గుర్తింపు కార్డులు

► గ్రామ, వార్డు వలంటీర్లందరికీ గుర్తింపు కార్డులతో పాటు నవరత్నాల లోగోతో కూడిన బ్యాడ్జిలను వీలైనంత త్వరగా ఇవ్వాలి. సంబంధిత శాఖ వలంటీర్ల బ్యాడ్జ్‌ను రూపొందించి సీఎం కార్యాలయం ఆమోదం పొందిన వెంటనే 2.6 లక్షల మంది వలంటీర్లకు వాటిని అందజేయాలి.  

► గ్రామ, వార్డు వలంటీర్ల క్లస్టర్ల వారీగా లబ్ధిదారుల జాబితాలను సచివాలయాల్లో తప్పనిసరిగా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలి. దీని వల్ల ఆయా వలంటీర్ల పరిధిలో లబ్ధిదారులు తమకు ఏయే పథకాలు అందింది.. లేనిది తెలుసుకోగలుగుతారు.

► రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నిర్ణీత కాల వ్యవధిలోగా బియ్యం, పెన్షన్, ఆరోగ్య శ్రీ కార్డులతో పాటు ఇంటి స్థలం పట్టా ఇవ్వాలనేది తప్పనిసరిగా నూటికి నూరు శాతం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి. 

నిర్ణీత సమయంలో పథకాలందాలి

► అర్హులైన వారు దరఖాస్తు చేసుకున్న 20 రోజుల్లోనే ఆరోగ్య శ్రీ కార్డు మంజూరు చేయాలి. దరఖాస్తు చేసుకున్న అర్హులకు పది రోజుల్లోనే బియ్యం కార్డు మంజూరు చేయాలి. అర్హులైన వారికి 21 రోజుల్లోనే (గతంలో పది రోజులు) పెన్షన్‌ కార్డులను మంజూరు చేయాలి. 90 రోజుల్లో ఇంటి స్థలం పట్టాను మంజూరు చేయాలి.

► ఈ నాలుగు.. నిర్ణీత కాల వ్యవధిలోగా అర్హులైన వారికి మంజూరయ్యేలా చూసేందుకు సంబంధిత శాఖల అధికారులు, జిల్లా స్థాయి అధికారులు తరుచూ సమావేశమై అవసరమైన చర్యలు తీసుకోవాలి. 

► ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ ఉన్నందున కొత్త మంజూరులు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. కోడ్‌ ముగిసిన తర్వాత యధావిధిగా అర్హులైన వారికి నిర్ణీత కాల వ్యవధిలో ఆయా పథకాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలి.

► వలంటీర్ల ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి. తమ పరిధిలోని ప్రజల సమస్యలు, అవసరాల పట్ల సరిగా స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వలంటీర్లను తొలగించాలి. 


Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad