టీచర్ లు ప్రభుత్వ ఉద్యోగులతో సమానం కాదు..

 ప్రభుత్వ ఉద్యోగులతో సమానం కాదు..ఇరు వర్గాల మధ్య విభజన గీత (తెలంగాణ)

మళ్లీ స్థానిక సంస్థల పరిధిలోకి టీచర్లు?

 వేతనాలు, వయసు పెంపు ఉద్యోగులకే!

ఉపాధ్యాయులకు ఇవి లేనట్లే...?

పని దినాలు తక్కువ.. ఒత్తిడీ తక్కువే!

 జీతాలు, వయసు పెంపు అవసరమా?

‘స్థానిక’ పరిధిలోకి వెళ్తేనే వ్యవస్థ బాగు!

తీవ్రంగా ఆలోచిస్తున్న సర్కారు?

టీచర్ల సంఘాల ప్రవర్తనపైనా ఆగ్రహం

teacher-are-not-govt-employs

హైదరాబాద్‌, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులకు వేతనాల పెంపు, పదవీ విరమణ వయసు పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడిందా? ఈ రెండింటినీ ఉద్యోగులకు మాత్రమే అమలు చేయాలని యోచిస్తోందా? ఉపాధ్యాయులకు అవసరం లేదని భావిస్తోందా? ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల మధ్య స్పష్టమైన విభజన గీతను గీయబోతోందా? విద్యా వ్యవస్థను మళ్లీ స్థానిక సంస్థల పరిధిలోకే తీసుకెళ్లనుందా? అంటే.. ఉన్నతస్థాయి వర్గాలు అవుననే అంటున్నాయి. ఈసారికి ఉపాధ్యాయులను పక్కన పెట్టేసి, ఉద్యోగులకు మాత్రమే వేతనాలు, రిటైర్మెంట్‌ వయసును పెంచాలని సర్కారు యోచిస్తున్నట్లు చెబుతున్నాయి. వేతనాల పెంపు, డీఏ, ఇతరత్రా ఆర్థిక ప్రయోజనాల విషయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు కలిసే పోరాటాలు చేస్తున్నారు. ఇదివరకు పంచాయతీరాజ్‌ సంస్థల కింద ఉన్న ఉపాధ్యాయులు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే సెలవులు, వేతనాలు పొందుతున్నారు. అయితే ఉద్యోగులు, ఉపాధ్యాయుల మధ్య విభజన గీత గీయాలని.. ఉపాధ్యాయులను మళ్లీ స్థానిక సంస్థల కిందకే మార్చాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఉన్నత వర్గాల సమాచారం. టీచర్ల ప్రయోజనాలన్నింటినీ పరిషత్‌లు, పురపాలక సంస్థలే చూసుకునేలా విధానపరమైన మార్పులు తీసుకురానుందని తెలుస్తోంది.

 గతంలో వేర్వేరుగానే..

వాస్తవానికి రాష్ట్రంలో ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ అని ఉపాధ్యాయులు రెండు విభాగాలుగా ఉండేవారు. 1981 తర్వాత పాఠశాలలన్నింటినీ ప్రభుత్వం డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కిందకు మార్చిం ది. ఆ తర్వాత ఉపాధ్యాయులకు 1998 నుంచి 2005 వరకు ఉమ్మడి సర్వీసు రూల్స్‌ను అమలు చేశారు. ఆ సర్వీసు రూల్స్‌ జీవోను కోర్టు కొట్టి వేయడంతో ప్రస్తుతం రాష్ట్రంలో అమలు కావడం లేదు. అయినా టీచర్లందరూ పాఠశాల విద్యా సంచాలకుల పరిధిలోని డీఈవోల కిందనే పని చేస్తున్నారు. తాజాగా విద్యా వ్యవస్థను మొత్తం స్థానిక సంస్థల పరిధిలోకే తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. అప్పుడు ఉపాధ్యాయులంతా జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, ఆంధ్రప్రదేశ్‌లో అమల్లో ఉన్న మునిసిపల్‌ పాఠశాలల టీచర్లుగా పని చేయాల్సి ఉంటుందన్నది ఉన్నత వర్గాల విశ్లేషణ.

ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచే విషయంలో అన్ని వర్గాల్లో సానుకూలత ఉందని ఉన్నత వర్గాలు చెబుతున్నాయి. కానీ, టీచర్ల రిటైర్మెంట్‌ వయసును పెంచే విషయంలో ఏకాభిప్రాయం రావడం లేదని వివరించాయి. ‘‘ఉపాధ్యాయులు ఏడాదికి 200-210 రోజులకు మించి పనే చేయరు. ఒత్తిడి తక్కువ. ఈ నేపథ్యంలో జీతాలు, వయసు పెంచాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోంది’’ అని తెలిపాయి. ‘‘73వ రాజ్యాంగ సవరణ కూడా విద్యా సంస్థలు, టీచర్ల వ్యవహారాలను స్థానిక సంస్థలకే అప్పగించాలని పేర్కొంది. అందుకే టీచర్లను స్థానిక సంస్థల పరిధిలోకి తేవాలనే డిమాండ్‌ వస్తోంది. ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియ్‌సగా పరిశీలిస్తోంది’’ అని ఉన్నత స్థాయి వర్గాలు వివరించాయి. 

 అనుచిత ప్రవర్తన..!

ఇటీవల త్రిసభ్య కమిటీ ముందు కొన్ని ఉపాధ్యాయ సంఘాల అనుచిత ప్రవర్తన కూడా ప్రభుత్వానికి చికాకు తెప్పించినట్లు సమాచారం. ఓ సంఘం నేత ఆగ్రహంగా వ్యవహరించారని, పత్రికా ప్రకటనలు కూడా ప్రభుత్వానికి కోపం తెప్పించాయని ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. ‘‘ఉద్యోగులు, టీచర్లు వేర్వేరు కేటగిరీలకు చెందిన వారు. వీరి విషయంలో వేర్వేరుగానే నిర్ణయాలు తీసుకోవాలనే అభిప్రాయాలు వస్తున్నాయి. టీచర్లను స్థానిక సంస్థల పరిధిలోకి తేవడం వల్ల పర్యవేక్షణ సమర్థంగా ఉంటుందని, విద్యా వ్యవస్థ కూడా బాగుపడుతుందని ప్రజలూ అభిప్రాయపడుతున్నారు. వీటిపై ప్రభుత్వం లోతుగా ఆలోచిస్తోంది’’ అని తెలిపాయి. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ  సొంత పత్రిక నమస్తే తెలంగాణలో జనవరి 31న ‘సొమ్ము అందరిది.. సోకు కొందరిదా’ శీర్షికన ఓ కథనం ప్రచురితమైంది. అందులో ‘1998లో అప్పటి ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడికి తలొగ్గి ఇచ్చిన జీవో ఫలితంగానే టీచర్లు ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు పొందుతున్నారు. అంతకుముందు వారంతా స్థానిక సంస్థల పరిధిలోనే ఉన్నారు’ అని పేర్కొన్నారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమన్నాయి. పత్రిక ప్రతులను దహనం చేశాయి. తాజాగా ప్రభుత్వ ఉన్నత వర్గాల వాదన కూడా ఆ కథనానికి దగ్గరగా ఉండడం విశేషం. 

 తొలగనున్న అవరోధం..

ఉద్యోగుల నియామకాలు, బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు ప్రధాన అవరోధంగా ఉన్న కోర్టు కేసు త్వరలోనే తొలగిపోయే అవకాశాలున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కొత్త జోనల్‌ వ్యవస్థపై అభ్యంతరాలు తెలుపుతూ కొన్ని సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై ప్రభుత్వం కోర్టుకు సంతృప్తికరమైన సమాధానమిచ్చింది. ఫలితంగా రాష్ట్రపతి ఉత్తర్వులపై నెలకొన్న ప్రతిష్టంభనను కోర్టు తొలగించే అవకాశముంది.

 పెంచకపోతే ఊరుకుంటారా?

ప్రభుత్వ వర్గాలు వివరిస్తున్నట్లుగా వేతనాలు పెంచకపోతే. ఉపాధ్యాయ లోకం సహించబోదని సంబంధిత నేతలు అంటున్నారు. 30 నెలలుగా వేతనాలు పెరగక తీవ్ర ఆందోళనలో ఉన్న ఉపాధ్యాయులు.. వేతనాలను పెంచడం లేదని తెలిస్తే ఊరుకుంటారా? అని ఓ ఉపాధ్యాయ సంఘం నేత ప్రశ్నించారు. ఉద్యోగులతో సమానంగానే విధులు నిర్వహిస్తున్నామని, 20 ఏళ్లుగా పదోన్నతుల కోసం నిరీక్షిస్తున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో తమకు వేతనాలు పెంచకపోతే ఊరుకుంటామా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త వేతనాల విషయంలో రాజీ పడబోమని మరో సంఘం నేత వివరించారు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad