Tuesday, December 22, 2020

CARONA NEW Strain: WHO


 కొత్తరకం వైరస్‌పై WHO ఏమందంటే..! 

లండన్‌: యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో బయటపడ్డ కొత్తరకం కరోనా వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టి సారించింది. విస్తృత వేగంతో వైరస్‌ వ్యాపిస్తోందని వస్తోన్న వార్తలపై స్పందించిన డబ్ల్యూహెచ్‌ఓ.. వైరస్‌పై సమగ్ర సమాచారం తెలిసేవరకు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ‘యూకే అధికారులతో అనుక్షణం సంప్రదింపులు జరుపుతున్నాం. వారు చేస్తోన్న పరిశోధనలు, విశ్లేషణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు మాకు అందిస్తున్నారు. వైరస్‌కు సంబంధించిన పూర్తి సమాచారం మాకు అందిన వెంటనే దాన్ని ప్రజలకు వెనువెంటనే చేరవేస్తాం’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ సమయంలో వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు ఆయా ప్రభుత్వాల సూచనల మేరకు ప్రజలందరూ అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తిచేసింది.

విమాన ఆంక్షలు విధిస్తోన్న దేశాలు..

యూకేలో బయటపడ్డ కొత్తరకం కరోనా వైరస్‌తో దేశాలన్నీ మరోసారి అప్రమత్తమవుతున్నాయి. ముందుజాగ్రత్త చర్యగా యూకే వచ్చిపోయే అంతర్జాతీయ విమాన సర్వీలపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నాయి. ఇప్పటికే ఐరోపాలోని పలు దేశాలు వివిధ దేశాలకు అంతర్జాతీయ విమానాలను రద్దుచేయగా, తాజాగా కెనడా కూడా యూకేకు నడిచే విమాన సర్వీసులను నిలిపివేసింది. ప్రస్తుతం 72 గంటలపాటు సర్వీసులను నిలిపివేస్తున్నామని.. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో  ప్రకటించారు.

అదే దారిలో మరిన్ని దేశాలు..

యూకేలో కొత్తరకం వైరస్‌పై ఆందోళన పెరుగుతోన్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా మరిన్ని దేశాలు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా, చిలీ, కొలంబియా దేశాలు యూకేకు విమానాలను రద్దు చేశాయి. ఈక్వెడార్‌ కూడా ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. యూకేకు మరో 48గంటలపాటు విమానాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఫ్రాన్స్‌ ప్రకటించింది. ఇదే దారిలో ఐర్లాండ్‌ కూడా నిర్ణయం తీసుకుంది. వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఇటలీ కూడా యూకే నుంచి విమానాలను నిలిపివేసింది. మరో అడుగు ముందుకు వేసిన ఇటలీ.. గడిచిన రెండు వారాల్లో ఎవరైనా బ్రిటన్‌ సందర్శిస్తే..వారిని కూడా ఇటలీలోకి అనుమతించడం లేదు. ఇక పోర్చుగల్‌ మాత్రం తమ  పౌరులను మాత్రమే యూకే నుంచి అనుమతిస్తోంది. అది కూడా కొవిడ్‌ నెగటివ్‌ రిపోర్టు ఉన్నవారిని మాత్రమే విమానాల్లో అనుమతిస్తున్నారు. బ్రిటన్‌లో కొత్తరకం వైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చే విమానాలపై 24గంటలపాటు ఆంక్షలు ఉంటాయని బెల్జియం ఇప్పటికే ప్రకటించింది. సౌదీ అరేబియా, టర్కీ, ఇజ్రాయిల్‌, నెదర్లాండ్స్‌, లాత్వియా, ఎస్టోనియా, చెక్‌ రిపబ్లిక్‌లు యూకే, దక్షిణాఫ్రికా దేశాలకు నడిచే విమానాలపై తాత్కాలికంగా ఆంక్షలు విధించాయి. యూకే పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ పేర్కొన్నారు.‌ 

కఠిన లాక్‌డౌన్‌ ఆంక్షలు..

కొత్తరకం కరోనా వైరస్‌తో అప్రమత్తమైన బ్రిటన్‌ ప్రభుత్వం కఠిన లాక్‌డౌన్‌ అమలు చేస్తోంది. క్రిస్మస్‌ వేళ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం అక్కడి టైర్‌-4 నిబంధనలను అమలు చేస్తోంది. ఇక యూకేకు ప్రపంచ దేశాలు విమాన సర్వీసులు ఆంక్షలు విధిస్తోన్న నేపథ్యంలో ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ నేతృత్వంలో అత్యవసర సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

0 comments:

Post a Comment

SEARCH THIS SITE

LATEST UPDATES

TRENDING/COVID NEWS

Mid Day Meal

NAADU NEDU

EDUCATIONAL APPS

JOBS/RESULTS/NOTIFICATIONS

ORDERS & PROCEEDINGS

TRANSFERS 2020

Top