Tuesday, December 15, 2020

అమ్మ ఒడి.కష్టాల సుడి


పథకం అమలుకు మోకాలడ్డుతున్న  ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థల యాజమాన్యాలు

 ఇంటర్‌ ఫ్రెషర్స్‌, సెకండియర్‌ విద్యార్థుల వివరాలు ఆన్‌లైన్‌ నమోదు చేయడంలో మీనమీషాలు

  దరఖాస్తు గడువు ముగుస్తోందంటూ వలంటీర్ల హడావుడి

 తల్లిదండ్రులు ఫోను చేస్తే నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్న కళాశాలల సిబ్బంది

(కాకినాడ, ఆంధ్రజ్యోతి) జగనన్న అమ్మ ఒడి పథకానికి ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థల యాజమాన్యాలు మోకాలడ్డుతున్నాయి. అర్హులైన పిల్లల వివరాలను స్కూళ్లలో యుద్ధప్రాతిపదికన ఇచ్చి ఆన్‌లైన్‌ చేయించుకోవాలని వలంటీర్లు వారం, పది రోజులుగా  తల్లిదండ్రులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో వారు తమ పిల్లలు చదువుతున్న విద్యా సంస్థలకు వెళ్లి పథకంలో ఆన్‌లైన్‌ గురించి ఆరా తీస్తుంటే సరైన సమాధానం చెప్పడం లేదని వాపోతున్నారు. యాజమాన్యాల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరుతోందని, అమ్మఒడి పథకం కష్టాల బాటలో పయనిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. అమ్మ ఒడి పథకంలో గత ఏడాది లబ్ధి పొందిన విద్యార్థుల వివరాల ఆన్‌లైన్‌ ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. దీంతో రెన్యువల్‌, కొత్త విద్యార్థుల వివరాలను సదరు వెబ్‌సైట్‌లో ప్రభుత్వ విద్యా సంస్థల్లో యథావిధిగా కంప్యూటరీకరణ చేస్తున్నారు. ఎటొచ్చీ కొన్ని ప్రైవేట్‌/కార్పొరేట్‌ విద్యా సంస్థల యాజమాన్యాలు మాత్రం పథకంపై అమలుపై స్పష్టత ఇవ్వట్లేదు. విద్యార్థులకు తగిన సమాచారం చేరవేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఒకవైపు గడువు ముగుస్తోందని వలంటీర్ల హడావుడితో తమ పిల్లలకు ఈ ఏడాది లబ్ధి చేకూరుతుందో, లేదోనని తల్లిదండ్రులు మదనపడుతున్నారు. 

ఇవీ తిప్పలు 

ఉదాహరణకు ఈ నెల 14న కాకినాడలో ఓ ఇంటికి శ్రీకాంత్‌ అనే వలంటీరు వెళ్లాడు. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలున్నారని అడిగాడు. తమకు ఇద్దరు పిల్లలున్నారని, టెన్త్‌లో తమ పాపకు అమ్మఒడి వచ్చిందని సదరు వలంటీరుతో బాలిక తల్లి చెప్పింది. కుమారుడు ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్నాడని తెలిపారు. టెన్త్‌లో లబ్ధి పొందిన బాలిక ఇప్పుడు ఏ కళాశాలలో చేరిందో అక్కడకు వెళ్లి పూర్తి వివరాలను ఈ నెల 15లోగా ఆన్‌లైన్‌ చేయించుకోవాలని, లేదంటే అర్హత కోల్పోతారని వలంటీరు చెప్పారు. దీంతో తల్లి ఆదరాబాదరాగా కుమార్తెను చేర్పించిన కార్పొరేట్‌ కళాశాలకు వెళ్లి ఈ కళాశాలలో చేర్పించాలని గతంలో ఫోన్‌ చేసిన లెక్చరర్‌కు ఫోన్‌ చేశారు. లెక్చరర్‌ ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో రిసెప్షన్‌లో ఉన్న సిబ్బందికి తన వెంట పట్టుకెళ్లిన వివరాలిచ్చారు. తన ఆధార్‌, బ్యాంకు ఖాతా, కూతురు ఆధార్‌ చూపారు. దీంతో అమ్మఒడి ఆన్‌లైన్‌ ఇక్కడ చేయడం లేదని, బయట ప్రైవేట్‌ నెట్‌ సెంటర్లలో ఆన్‌లైన్‌ చేయించుకుని ఒక కాపీ మాకివ్వాలని ఆమెకు సూచించారు. దీంతో తల్లి అక్కడి నుంచి నెట్‌ సెంటరుకు వెళ్లింది. ప్రైవేట్‌గా వివరాలు నమోదు చేసే అవకాశం తమకు లేదని... బాలిక చదువుతున్న కళాశాల ఐడీ, పాస్‌వర్డ్‌ తెస్తే చేస్తామని చెప్పారు. మళ్లీ ఆ తల్లి కళాశాలకు చేరుకుని సిబ్బందికి చెప్పడంతో, అదేమీ తమకు తెలియదని, పక్కన బోర్డు సెక్షన్‌లో అడగాలని సలహా ఇచ్చారు. బోర్డు సెక్షన్‌ సిబ్బందిని సంప్రదిస్తే ‘మీ పాప మా వద్ద చేరడం వాస్తమేనని, అయితే ఇంకా మా కళాశాల లాగిన్‌కు అమ్మఒడి వెబ్‌సైట్‌ అనుసంధానం కాలేదని... ఇంటర్‌ సెకండియర్‌ వాళ్లకు రెన్యువల్‌కే దిక్కు లేదని, ఫ్రెషర్స్‌కు తొందర లేదని, వలంటీర్లు అలాగే చెప్తారు’ అని సమాధానమిచ్చారట. దీంతో ఆ తల్లికి ఏం చేయాలో పాలుపోక, ఎవరికి చెప్పాలో తెలీయక ఇంటి ముఖం పట్టిందిజ ఇదిలా ఉంటే ఆదివారం రాత్రి 7.30 సమయంలో ఇదే కళాశాలలో సెకండియర్‌ చదువుతున్న ఓ విద్యార్థి తండ్రికి ఇదే కళాశాలలో పనిచేస్తున్న ఓ లెక్చరర్‌ ఫోన్‌ చేశారు. ‘ఫలానా విద్యార్థి తండ్రి మీరేనా. మీ పాప నాకు మీ నంబరు ఇచ్చింది. అమ్మఒడి పథకంలో మీ పాప వివరాలు రెన్యువల్‌ చేయించారా లేదా, చేయించకపోతే వెంటనే కళాశాలకు వచ్చి వివరాలిచ్చి ఆన్‌లైన్‌ చేయించుకోండ’ని సూచించారు. దీనికి తండ్రి సమాధానమిస్తూ తన చిన్న కుమార్తె టెన్త్‌లో ఉండగా రూ.15వేలు వచ్చాయని, ఇప్పుడు ఆమెను మీ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్పరంలో చేర్పించానని చెప్పారు. ‘అయితే నా మాటలు వినకుండా ఎక్కువ మాట్లాడకు. చెప్పింది చేయ్‌. నేనెవరో తెలుసా. ఫలానా లెక్చరర్‌న ’ని పరుష పదజాలం ప్రయోగించారని తండ్రి వాపోయారు. దీంతో కళాశాల ప్రిన్సిపాల్‌కు తండ్రి ఫోను చేసి విషయాన్ని వివరించారు. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలో కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఉందని, తాను సరిచేస్తానని ప్రిన్సిపాల్‌ చెప్పారట. అమ్మఒడి పథకంపై ఆయా కళాశాలల్లో పనిచేస్తున్న లెక్చరర్లకు, సిబ్బందికి కనీసం అవగాహన లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

0 comments:

Post a Comment

SEARCH THIS SITE

LATEST UPDATES

TRANSFERS 2020

DONWLOAD TRANSFR ORDERS

Mid Day Meal

NAADU NEDU

EDUCATIONAL APPS

JOBS/RESULTS/NOTIFICATIONS

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top