Sunday, October 4, 2020

బదిలీలు కానరాక.. సర్దుబాటు జరగక.


𒊹︎︎︎నేటికీ విడుదల కాని ఉత్తర్వులు 2,355 మంది ఉపాధ్యాయుల ఎదురుచూపు.

𒊹︎︎︎8 నుంచి రిలే నిరాహార దీక్షలకు సిద్ధం.

𒊹︎︎︎ ఉపాధ్యాయ బదిలీలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

𒊹︎︎︎ అసలు బదిలీలు జరుగుతాయా? లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

𒊹︎︎︎ విద్యార్థుల సంఖ్య తక్కువ ఉన్న బడుల్లో టీచర్ల సర్దుబాటు ఇంకనూ ఓ కొలిక్కి రాలేదు.

𒊹︎︎︎ దీనిపై స్పష్టత లేకుండా బదిలీలు చేపడితే ఇబ్బందులు వస్తాయని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి.

𒊹︎︎︎ గత నెల 21 నుంచి 9, 10 తరగతులు పాక్షికంగా ప్రారంభమైన విషయం విదితమే.

𒊹︎︎︎ నేటివరకు విద్యాశాఖ బదిలీల ప్రస్తావనే చేయలేదు.

𒊹︎︎︎ ఈ నేపథ్యంలో ఈనెల 8 నుంచి 17వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టేందుకు ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సన్నద్ధమవుతున్నారు. 

  న్యూస్‌టుడే, కర్నూలు విద్య

✰ జిల్లాలో 2,968 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 4.21 లక్షల మంది ఉండగా.. 14,791 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.వీరిలో  పలువురిని 2017లో బదిలీ చేశారు. ప్రస్తుతం స్థానచలనానికి అర్హులైన 2,355 మంది ఉపాధ్యాయులు ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు.  ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్‌ యాజమాన్యంలో కలిపి 1,458 స్థానాల వరకు ఖాళీలు ఉండగా, ఒకే దగ్గర 5, 8 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్నవారు 2,355 మందిగా విద్యాశాఖ గుర్తించింది. అర్హులైన టీచర్లు బదిలీ ప్రక్రియలో భాగంగా ఆసక్తి ఉన్న ఖాళీ ప్రాంతాలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.  ఇప్పటికే ఈ వివరాలను జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి విద్యాశాఖ కమిషనర్‌కు రెండున్నర నెలల కిందట పంపారు.

💥కొలిక్కిరాని హేతుబద్ధీకరణ:

రేషనలైజేషన్‌ (హేతుబద్ధీకరణ) ప్రక్రియ పూర్తైన తర్వాతే ఉపాధ్యాయుల బదిలీలు ఉంటాయని ఉపాధ్యాయ సంఘం నాయకులు చెబుతున్నారు. ఉపాధ్యాయ బదిలీలు జరగాలంటే ముందస్తుగా పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిని పరిగణనలోకి తీసుకోవాలి. రేషనలైజేషన్, బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసి మార్గదర్శకాలు ఇవ్వాల్సి ఉందని విద్యా నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఆదేశాలమేరకు 5, 8 ఏళ్లుగా వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న వారి వివరాలు పంపామని, ఈ ప్రక్రియకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేస్తే బదిలీలు చేపడతామని విద్యాధికారులు చెబుతున్నారు.

కరోనా కారణంగా ఉపాధ్యాయులు రోజుకు 50 శాతం (పాక్షికం) మంది హాజరవుతున్నారు. ఇలాంటి సమయంలో ఉపాధ్యాయుల బదిలీలు ఎంతమేర జరుగుతాయోనని అర్హులు ఉత్కంఠగాఎదురుచూస్తున్నారు.

  💥భిన్నాభిప్రాయాలు:

✰ బదిలీల విషయంలో రెండు వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. కరోనా కారణంగా పాఠశాలలు పూర్తిస్థాయిలో తెరుచుకోలేదు.ఈ నేపథ్యంలో బదిలీలకు ఇదే సరైన సమయమంటూ కొందరు పేర్కొంటుండగా.. మరికొందరు మాత్రం రేషనలైజేషన్‌ ప్రక్రియను పూర్తి చేసి వివిధ కారణాలు చూపి బదిలీలు నిలిపేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. 

మరోవైపు బదిలీలపై ఉపాధ్యాయ సంఘాలు ఐకమత్యంగా ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయి. 8వ తేదీ నుంచి మండల, జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ప్రకటించాయి.  విద్యాధికారులు మాత్రం ప్రాథమిక పాఠశాలల్లో ఇద్దరు ఎస్జీటీలు ఉండేలా చూస్తామని, తొలుత ప్రాథమిక, ఆపైన ఉన్నత పాఠశాలల్లో హేతుబద్ధీకరణ జరుగుతుందన్న వాదనలో ఉన్నారు. ప్రాథమిక విద్యాలయంలో 150 మందికన్నా ఎక్కువమంది విద్యార్థులు ఉంటే ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం ఉంటారన్న వాదన ఉంది. మరోవైపు ఎయిడెడ్‌ పాఠశాలలను ప్రభుత్వంలో విలీనం చేస్తారన్న దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయన్న ప్రచారం సాగుతోంది. 

రేషనలైజేషన్‌తోపాటు బదిలీలు జరపాలి.

➪ - జి.హృదయరాజు, ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు

💥మాధ్యమం ప్రకారం బోధన, బోధనేతర సిబ్బంది భర్తీ చేపట్టాలి. ఉన్నతీకరించిన ఉన్నత పాఠశాలలకు హెచ్‌ఎం, పాఠశాల సహాయకుల పోస్టులు మంజూరు చేయాలి. శాస్త్రీయమైన రేషనలైజేషన్‌ ప్రాతిపదికన మాత్రమే బదిలీలు జరపాలి. ప్రాథమిక పాఠశాలల్లో సంఖ్యతో సంబంధం లేకుండా రెండు పోస్టులు మంజూరు చేయడం శుభపరిణామం. బదిలీల షెడ్యూలు విడుదలలో నిర్లక్ష్యం జరుగుతుండటంతో ఫ్యాప్టో ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నాం

0 comments:

Post a Comment

SEARCH THIS SITE

LATEST UPDATES

TRANSFERS 2020

DONWLOAD TRANSFR ORDERS

Mid Day Meal

NAADU NEDU

EDUCATIONAL APPS

JOBS/RESULTS/NOTIFICATIONS

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top