Saturday, September 12, 2020

రూపు మారిన విద్యావ్యవస్థ..కరోనా తెస్తున్న పెను మార్పులుకొవిడ్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి పదిమంది విద్యార్థుల్లో తొమ్మిదిమంది విద్యాభ్యాసం తీవ్రంగా దెబ్బతిన్నదని యునెస్కో ప్రకటించింది. విద్యాసంస్థలు మూతపడటంవల్ల అంతర్జాతీయంగా 154 కోట్లమంది చదువు అటకెక్కింది. భారత్‌లో బాధిత విద్యార్థుల సంఖ్య 32 కోట్లకుపైనే. వైరస్‌వల్ల అర్ధాంతరంగా చదువు నిలిపేయవలసి వచ్చిన విద్యార్థుల్లో ఆడ పిల్లల సంఖ్యే ఎక్కువ. విద్యావిఘాతం వల్ల మున్ముందు ఆర్థిక, సామాజిక విపరిణామాలెన్నో సంభవించనున్నాయి. ఈ గడ్డు కాలంలో ఆన్‌లైన్‌ లేదా రిమోట్‌ విద్య అండగా నిలుస్తోంది. దీన్ని ఈ-లెర్నింగ్‌గానూ వ్యవహరిస్తున్నారు. పాఠశాల మొదలుకొని విశ్వవిద్యాలయం వరకు అన్ని సంస్థలూ కొత్త విద్యా సంవత్సరాన్ని ఆన్‌లైన్‌ పద్ధతిలో ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఏఐసీటీఈ, సీబీఎస్‌ఇ, యూజీసీలు అందుకు సూచనలు, సలహాలు ఇస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలూ మార్గదర్శకత్వం వహిస్తున్నాయి. అయితే కొత్త ఆన్‌లైన్‌ విద్యావిధానంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పౌరులు సరిగ్గా ఇమడగలరా అనే సందేహం బలంగానే వ్యక్తమవుతోంది.

సాంకేతికతను అందిపుచ్చుకొంటేనే..

తక్కువ ఖర్చులో సుదూరంలోని విద్యార్థులకూ వేగంగా సులువుగా చదువు చెప్పే సౌలభ్యం ఆన్‌లైన్‌ విద్యకు ఉన్నమాట నిజం. ఏక కాలంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులకు పాఠాలు చెప్పవచ్ఛు కరోనా వైరస్‌ వల్ల లాక్‌డౌన్‌ విధించిన తొలినాళ్లలో ఆన్‌లైన్‌ విద్యను ఆశ్రయించక తప్పలేదు. ఇది తాత్కాలికమేనని, వైరస్‌ బెడద తొలగిపోయిన తరవాత మళ్లీ విద్యాసంస్థలు తెరచుకుంటాయని అందరూ భావించారు. కానీ, వాస్తవంలో ఆన్‌లైన్‌ విద్య లేదా ఈ-లెర్నింగ్‌ ఇప్పటికే ఉన్నత విద్యాసంస్థల్లో ‘స్వయం’ పేరిట ప్రవేశించి ఉంది. స్వయం మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సు (మూక్స్‌)ల కిందకు వస్తుంది. అన్ని స్థాయుల్లో విద్యాభ్యాసానికి వీలు కల్పించే మూక్స్‌ ప్రపంచంలో అతిపెద్ద ఆన్‌లైన్‌ ఉచిత ఈ-లెర్నింగ్‌ వేదిక. ఈ తరహా విద్యాభ్యాసాన్ని పాఠశాల నుంచి కళాశాల వరకు చేపట్టడం తక్షణమే సాధ్యపడదు. విద్యాసంస్థలు, అధ్యాపకులు కొన్ని సన్నాహాలు చేసుకోవలసి ఉంటుంది. అందుకు కొంత సమయం పడుతుంది. కొత్త సాంకేతికతల వినియోగంలో పాత తరం టీచర్లకన్నా కొత్తవారే ముందుంటారని, కాబట్టి ఈ-లెర్నింగ్‌ యువ ఉపాధ్యాయులకే అనువైనదనే వాదన ఉంది. కానీ, సాంకేతికత వినియోగాన్ని శాసించే అంశం వయసు ఒక్కటే కాదని, మార్పును స్వాగతించి, దాన్ని అందిపుచ్చుకొనే ధోరణి ఉంటే వయసుమీరిన వారూ యువతరానికి దీటుగా నిలవగలరని పలు పరిశోధనలు నిర్ధారిస్తున్నాయి.

భారతీయ విద్యావ్యవస్థ విస్తారమైనది. 15 లక్షల పాఠశాలలు, 50,000 ఉన్నత విద్యాసంస్థలతో కూడిన ఈ సువిశాల వ్యవస్థలో ఈ-లెర్నింగ్‌ ప్రక్రియను ఉన్నపళాన ప్రవేశపెట్టడం సాధ్యంకాదు. మన విద్యార్థులు భిన్న సామాజిక, ఆర్థిక నేపథ్యాలకు చెందినవారు కావడం వల్ల డిజిటల్‌ అగాధమేర్పడి, అందరూ ఒకే స్థాయిలో ఈ-లెర్నింగ్‌ కు మారలేని పరిస్థితి ఉంది. విద్యార్థుల మధ్య డిజిటల్‌ అగాధాతాన్ని అధిగమించి, అందరికీ ఈ-లెర్నింగ్‌ అవకాశాన్ని కల్పించడం అత్యావశ్యకం. కేంద్రం ప్రకటించిన కొత్త విద్యా విధానం ఇటువంటి సమ్మిళిత విద్యను అందించాలని లక్షిస్తోంది. ప్రస్తుతం ఈ-లెర్నింగ్‌ అత్యధిక విద్యార్థులకు అందుబాటులో లేదు. ఆర్థిక అంతరాలు, గ్రామీణ-పట్టణ భేదాలు, మారుమూల ప్రాంతాల్లో నివాసాలు, ఆంగ్ల భాషా నైపుణ్యంలో తేడాలు, లింగ భేదాలు, దివ్యాంగ బాలల అవసరాలను దృష్టిలో ఉంచుకుని డిజిటల్‌ మాధ్యమ సాయంతో అందరికీ విద్యను అందించాల్సిన ఆవశ్యకతను కొవిడ్‌ సంక్షోభం ముందుకుతెచ్చింది. పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం పనికిరాదు. విద్యార్థుల స్థాయీభేదాలను పరిగణనలోకి తీసుకుని సముచిత పద్ధతులను అనుసరించాలి. ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకొని బోధనాభ్యాసాలు వేగంగా జరిగేలా చూడటానికి తగు సంస్థాగత ఏర్పాట్లను ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు సిద్ధం చేయాలి. తమకు అనువైన వేదికలు, సాధనాలతో విద్యాభ్యాసం చేసే వెసులుబాటు విద్యార్థులకు ఉండాలి.

ఉపాధ్యాయుల్లో రావాల్సిన మార్పు

తరగతి గదిలో అవలీలగా పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల్లో చాలామంది స్మార్ట్‌ ఫోన్‌ లోనో, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారానో పాఠాలు చెప్పాల్సి వస్తే కాస్త తడబడతారు. కంప్యూటర్‌ తెర మీద చిన్న చిన్న బాక్స్‌లలో పలువురు విద్యార్థులను చూస్తూ పాఠాలు చెప్పడం అనుకున్నంత సులువు కాదు. ఈ చిక్కును అధిగమించడానికి ఉపాధ్యాయుడు ముందస్తు ఈ-పాఠాన్ని అందించాలి. దాన్ని చదువుకున్న విద్యార్థులు తమ టీచర్‌ పాఠం చెప్పడానికి ఉపక్రమించగానే తేలిగ్గా అందుకోగలుగుతారు. పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌, చాట్‌ బాక్స్‌, ప్రశ్న-జవాబుల కార్యక్రమం ద్వారా బోధన సాగించి, విద్యార్థుల అనుమానాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయవచ్ఛు ఏదిఏమైనా పాఠశాలల్లో ఉండే వాతావరణం ఈ-లెర్నింగ్‌లో ఉండదు. అక్కడి సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, ఇతర సామూహిక కార్యకలాపాలు, స్నేహాలను విద్యార్థులు కోల్పోతారు. సంప్రదాయ పాఠశాలల్లో అవన్నీ ఉండి పరస్పర అవగాహన, శ్రద్ధ, నమ్మకం, స్నేహ బంధాలు వృద్ధిచెందుతాయి. కరోనా మహమ్మారి దెబ్బకు ఉన్నట్టుండి మార్చి నెల నుంచి ఆ వాతావరణమంతా అదృశ్యమైపోయింది. ఈ-లెర్నింగ్‌ ఆ మధుర స్మృతులు, అనుభవాలను తిరిగి తీసుకురాలేదు. సమాచార-కమ్యూనికేషన్‌ సాంకేతికతలను అతిగా ఉపయోగించడం సాధారణ జీవన విధానంలో అపశ్రుతులు తీసుకొస్తుంది. వీటిని నివారించడానికి భద్రమైన, ఆరోగ్యవంతమైన ఆన్‌లైన్‌ అలవాట్లను 9-12 తరగతి విద్యార్థుల్లో పెంపొందించడానికి, మే నెలలో సీబీఎస్‌ఈ కొత్త సైబర్‌ భద్రత నియమావళిని తీసుకొచ్చింది. సైబర్‌ పీస్‌ ఫౌండేషన్‌తో కలిసి ఈ నిబంధనావళిని రూపొందించింది. స్మార్ట్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లను వినియోగించినంత మాత్రాన ఉన్నత ఫలితాలు సాధించగలమని ఎవ్వరూ భ్రమపడకూడదు. విద్యార్థుల్లో శ్రద్ధాసక్తులను ఇనుమడింపజేసి, చదువులో రాణించాలనే పట్టుదలను, కొత్త విషయాలు నేర్చుకోవాలనే కుతూహలాన్ని పెంచడం, వర్చువల్‌ వాతావరణంలో సమర్థంగా బోధనాభ్యాసాలు చేయడం... తరగతి గదిలో వీలుపడినంత స్థాయిలో- సైబర్‌ తరగతిలో సాధ్యపడకపోవచ్ఛు అందుకు అవసరమైన నైపుణ్యాలను ఉపాధ్యాయులు అలవరచుకోవాలి. ఆధునిక కాలానికి కావలసిన నైపుణ్యాలను నేర్పించగలగాలి. ఆన్‌లైన్‌ కోర్సుల రూపకల్పనలో నేషనల్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ వంటి సంస్థల సాయాన్ని తీసుకోవాలి. ఆన్‌లైన్‌ బోధనాభ్యాసాల గుణగణాలపై తర్జనభర్జనలను మాని, ఇకముందు తరగతి గదిలో బోధనకు అనుబంధంగా ఆన్‌లైన్‌ బోధనా కొనసాగనున్నదని అందరూ గ్రహించాలి.

అపోహలతో ఆందోళన

పోనుపోను సాంకేతికత వల్ల తమ ఉద్యోగాలు పోతాయనే భయం అధ్యాపక సిబ్బందిని పీడిస్తున్న మాట నిజం. కానీ, పాత కాలపు నల్ల బల్ల, సుద్దముక్కల బోధన పద్ధతి స్థానే కంప్యూటర్‌ తెరలు, స్మార్ట్‌ ఫోన్లు, వీడియో కాన్ఫరెన్సులు రంగ ప్రవేశం చేస్తాయి తప్ప- అధ్యాపకుడి ప్రాధాన్యం ఏమాత్రం తగ్గదని వారు గ్రహించాలి. విద్యాబోధన చేసే స్థలం, తీరు మారతాయే తప్ప బోధనాభ్యాసాలు మారవు. అయితే ఈ-లెర్నింగ్‌ విధానంలో తరగతి గదిలో మాదిరి పాఠం చెప్పి ఊరుకుంటే చాలదు. పాఠ్యాంశాలను తామే రూపొందించుకొని, సాంకేతికతను సమర్థంగా వినియోగించుకుంటూ విద్యార్థులకు ఆసక్తికరంగా పాఠాలు చెప్పాలి, ప్రాక్టికల్స్‌ చేయించగలగాలి.

 -:డాక్టర్‌ ఎన్‌.వి.ఆర్‌. జ్యోతికుమార్‌


SEARCH THIS SITE

LATEST UPDATES

TRENDING

✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

Mid Day Meal

NAADU NEDU

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top