Thursday, August 27, 2020

అన్నీ తెరుస్తున్నారు…స్కూళ్లు ఎప్పుడు? దేశ విదేశాల్లో వర్సిటీలు, విద్యాసంస్థలు ఇప్పటికే తెరుచుకున్నాయి

 • లాక్ డౌన్‌ 4.0 వచ్చేస్తోంది
 • మాల్స్‌ నుంచి మెట్రో దాకా సడలింపులు ఇచ్చేస్తున్నారు
 • విద్యా సంస్థలపై మాత్రం కేంద్రం జాప్యం చేస్తోంది
 • ఇలాగైతే 15 నెలలు చదువుకు దూరం
 • చదువుపై శ్రద్ధ తగ్గే ప్రమాదం
 • పిల్లలు పక్కదారి పట్టొచ్చు
 • విద్యావకాశాల్ని నిర్వీర్యం చేయొద్దు
 • కరోనా జాగ్రత్తలపై దిగులొద్దు
 • ప్రజలు అవగాహనతో మెలుగుతున్నారు
 • రెడ్‌ జోన్లు, కంటైన్మెంట్లు మినహాయించొచ్చు
 • స్థానిక యంత్రాంగానికి వదిలేయాలి
 • విద్యార్థుల ఆరోగ్యానికి నష్టం లేని రీతిలో విద్యా సంస్థల నిర్వహణకు ఎలాంటి అభ్యంతరాలు ఉండవని నిపుణుల సూచన

అన్‌లాక్‌ 4.0 సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకొస్తోంది. లాక్‌డౌన్‌ నిబంధనల్లో ఇప్పటికే భారీగా సడలింపులొచ్చాయి. తాజాగా మాల్స్‌, సినిమా థియేటర్లు, సిటీ బస్సులు, మెట్రోరైళ్ళకు కూడా సడలింపులిచ్చేందుకు కేంద్రం సమాయత్తమైంది. అయినప్పటికీ విద్యాసంస్థల విషయంలో సడలింపుల పట్ల కేంద్రం జాప్యం చేస్తోంది. దీంతో విద్యార్థులు విలువైన ఓ విద్యాసంవత్సరాన్ని కోల్పోయే ప్రమాదం నెలకొంది. పైగా ఈ ఏడాది మార్చి నుంచి వచ్చే ఏడాది జూన్‌ వరకు 15మాసాల పాటు చదువుకు, విద్యాసంస్థలకు దూరం కావడంతో వీరి ఆలోచనలు పక్కదారి పట్టే ప్రమాద ముంది. అలాగే వీరు క్రమశిక్షణ తప్పే అవకాశముంది. ఇక భవిష్యత్‌లో వీరు మనస్సును విద్యా భ్యాసంపై లగ్నం చేసే అవకాశాలుండబోవని నిపుణులు అంచనాలేస్తున్నారు.


కరోనాతో పోరాటంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజల్లో ఓ అవగాహనొచ్చింది. కరోనా తమకు సోకకుండా రక్షించుకునే విధానాలు ప్రతి వ్యక్తికి అలవడ్డాయి. వాటినిప్పుడు సక్రమంగా పాటిస్తు న్నారు. తమతోపాటు తమ కుటుంబ సభ్యులు కూడా ఈ వ్యాధి బారిన పడకుండా రక్షించుకుంటున్నారు. అయినప్పటికీ కేంద్రం ఇంకా ప్రజలు, ముఖ్యంగా విద్యార్ధులు కరోనా నుంచి రక్షించుకునే విధానాల్ని అలవర్చుకోలేదని భావిస్తోంది. విద్యాసంస్థలు తెరిస్తే కరోనా మరింత విస్తృతమయ్యే ప్రమాదముందని పరిగణిస్తోంది. అయితే కేంద్ర ఆలోచనలు సరికాదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇతర వ్యవస్థల్తో పాటు విద్యాసంస్థలపై కూడా సెప్టెంబర్‌ 1నుంచి నిషేధాజ్ఞల్ని సడలించాలని సూచిస్తున్నారు.


విద్యావిధానంపై కేంద్రంతో పాటు రాష్ట్రాలకు కూడా స్పష్టమైన అవగాహన కొరవడింది. కరోనా ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. అదే స్థాయిలో అది భారత్‌పై కూడా ప్రసరించింది. దేశంలో దీర్ఘకాలం లాక్‌డౌన్‌లు అమలయ్యాయి. ఆసుపత్రులు మినహా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూతబడ్డాయి. అంచెలంచెలుగా లాక్‌డౌన్‌ సడలింపులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఒక్కొక్క వ్యవస్థను తిరిగి ప్రారంభించేందుకు అనుమతులు జారీ చేస్తోంది. ఇలా ఇప్పటికే మూడు విడతలు పూర్తయ్యాయి. నాలుగో విడత సడలింపులకు కూడా ఇప్పుడు సిద్దపడుతోంది. అయితే ఈ సారి కూడా విద్యాసంస్థల్ని తిరిగి తెరవడంపై కేంద్రం ఓ నిర్ణయానికి రాలేదు. అసల ు ఆ దిశగా యోచించడంలేదు. సుప్రింకోర్టు ఆమోదించిన జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణకు విద్యార్ధులనుంచొస్తున్న వ్యతిరేకతను కూడా పక్కనపెట్టి సమాయత్తమౌతున్న కేంద్రం క్షేత్రస్థాయి విద్యాసంస్థలపై మాత్రం ఆంక్షల్ని కొనసాగించే యత్నం చేస్తోంది. 

వాస్తవానికి ఇప్పుడు ప్రాధమిక, మాధ్యమిక, ఉన్నత స్థాయి విద్యాసంస్థల్లో పరీక్షల్లేవు. ఇవన్నీ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో విద్యార్ధుల భవిష్యత్‌ అవసరాలకనుగుణంగా తమకు తాము సొంతంగా సిలబస్‌లను రూపొందించుకుంటున్నాయి. ఐఐటిలు, ఐఐఎమ్‌లు, సివిల్‌ సర్వీసులు, మెడిసిన్‌ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో సీట్ల సాధనే లక్ష్యంగా విద్యార్ధులకు ఒకటో తరగతి నుంచి ఈ సిలబస్‌ను నూరి పోస్తున్నాయి. అందుకనుగుణంగానే పరీక్షల్ని నిర్వహిస్తున్నాయి. విద్యార్ధుల తల్లిదండ్రుల ఆకాంక్ష కూడా ఈ ఉన్నత స్థాయి పరీక్షల్లో తమ పిల్లలు ర్యాంకులు సాధించి సీట్లు పొందడమే. వారంతా తిరిగి విద్యాసంస్థలు మొదలవ్వాలని కోరుకుంటున్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కోవిడ్‌ విస్తరణ అధికంగా ఉండొచ్చు. అయితే కొన్ని రెడ్‌జోన్‌లు, కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో మినహా మిగి లిన ప్రాంతాల్లో విద్యాసంస్థల్ని తెరిచి నిర్వహించేందుకు ఎలాంటి ఇబ్బందుల్లేవు. కేంద్రం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. విద్యాసంస్థల నిర్వహణ అవకాశం రాష్ట్రాలు, జిల్లా యంత్రాంగాలకు వదిలిపెట్టాలి. స్థానిక పరిస్థితులకనుగుణంగా వారే నిర్ణయాలు తీసుకునే వెసులుబాటివ్వాలి. 

ఇప్పటికే విదేశాల్లోని పలు వర్శిటీలు, విద్యాసంస్థలు తిరిగి కోర్సులు ప్రారంభించాయి. కొన్ని భారత్‌లోని తమ విద్యార్థులకు ఆన్‌లైన్‌ విధానంలో క్లాస్‌లు కూడా నిర్వహించేస్తున్నాయి. విద్యార్ధుల ఆరోగ్యాలకు నష్టంలేని రీతిలో విద్యాసంస్థల నిర్వహణకు ఎవర్నుంచి అభ్యంతరాలు వెల్లడికావు. వార్ని పాఠశాలలకు తరలించే బస్సుల్నుంచి క్లాస్‌రూమ్‌లలో సీట్ల వరకు నిర్దిష్ట సంఖ్యలో అనుమతించాలి. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్‌ లక్షల సంఖ్యలో ఉన్నాయి. గ్రామాల్లో విద్యార్థులకు అందుబాటులోనే ఈ పాఠశాలలు నెలకొన్నాయి. ఒకవేళ దూరాబారాల్నుంచి కొందరు విద్యార్ధులు రాలేకపోవచ్చు. కానీ వారి కోసం మిగిలిన విద్యార్ధుల విద్యావకాశాల్ని నిర్వీర్యం చేయడం సరికాదు. కొంతమంది కోసం మొత్తం అందరి భవిష్యత్‌ను బలిపెట్టడం సమంజసంకాదు. విద్యావ్యవస్థలో సమన్యాయం ఎప్పుడు ఆమోదయోగ్యం కాదు. కొందరు విద్యార్ధులు జన్మత: మేథావులుంటారు. మరికొందరు కష్టపడి చదువుతారు. ఇంకొందరు విన్నవెంటనే పాఠ్యాంశాల్ని పసిగడతారు. వీరంతా తమ తమ మేథస్సుకనుగుణంగా పరీక్షల్లో మార్కులు, ర్యాంకులు సాధించగలుగుతారు. కొంతమందికి ప్రయాణం చేయడం, లేదా ఇతర సాధక బాదకాల్ని దృష్టిలో పెట్టుకుని మొత్తం అందరి అవకాశాలపై నీళ్ళు జల్లడం మొత్తం వ్యవస్థనే దిగజార్చే ప్రమాదముంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ఇప్పటికే దాదాపు ఆరు మాసాలుగా విద్యార్థులు పాఠశాలలకు దూర మయ్యారు. వీరంతా ఇళ్ళకే పరిమితమయ్యారు. వీరిలో పలువురు ఇతర మార్గాలపై ఆసక్తి పెంచుకుంటున్నారు. మరికొందరు టివిలు, ట్యాబ్‌లు, మొబైల్‌ ఫోన్ల వ్యసనపరులుగా మారుతున్నారు. ఇప్పటికే దీర్ఘకాలం విరామం వచ్చింది. ఇప్పటికిప్పుడు పాఠశాలలు పునరుద్దరించినప్పటికీ తిరిగి గాటన పడ్డానికి కొంతకాలం పడుతుంది. అదే మరికొంతకాలం పాఠశాలల మూసివేత కొనసాగితే విద్యార్ధుల్లో చాలా మందికి విద్యాభ్యాసంపై ఆసక్తి సన్నగిల్లే ప్రమాదం లేకపోలేదని సామాజిక నిపుణులు పేర్కొంటున్నారు. అన్‌లాక్‌ 4.0లో ఇతర రంగాల్తో పాటు విద్యారంగంపై కూడా నిషేదాన్ని తొలగిం చి ఈ దేశ విద్యార్ధుల భవితవ్యాన్ని పరిరక్షించాలని వీరు కేంద్రానికి సూచిస్తున్నారు.


SEARCH THIS SITE

EDUCATIONAL UPDATES

job news HEALTH TIPS

TRENDING

✺ TEACHERINFO వాట్సాప్ గ్రూప్ లింక్స్ ✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

Mid Day Meal

HEALTH

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top