Thursday, July 16, 2020

AP లో రూ.1000 ఖర్చు దాటితే ఆరోగ్య శ్రీ.. ఈ 6 జిల్లాలకూ విస్తరించిన సీఎం జగన్.


WHATSAPP GROUP TELEGRAM GROUPవైద్యం ఖర్చు రూ.10000 దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడంతో పాటు, కొత్తగా ఆరు జిల్లాలకు పథకాన్ని విస్తరించారు. ఆరోగ్యశ్రీలో మొత్తం 2200 రకాల వైద్య ప్రక్రియలను అందజేస్తూ విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, వైఎస్ఆర్‌ కడప, కర్నూలు జిల్లాలకు పథకాన్ని విస్తరించారు. క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ గురువారం దీన్ని ప్రారంభించారు. అనంతరం సీఎం వైఎస్‌ జగన్, ఆయా జిల్లాలలోని అధికారులు, పథకం లబ్ధిదారులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. 

వైద్యం అందక ఏ ఒక్కరూ చనిపోకూడదని, ఆ దిశలోనే పలు చర్యలు తీసుకుంటున్నామని సీఎం వైఎస్‌ జగన్‌ వెల్లడించారు. కుటుంబంలో ప్రతి ఒక్కరూ చల్లగా ఉండాలని అడుగులు వేశామన్న ఆయన, ఆరోగ్యశ్రీ పథకంలో ఇవాళ మరో అడుగు ముందుకు వేశామని తెలిపారు. ఇంకా ఆరోగ్యశ్రీ పరిధిని విస్తృతంగా పెంచుతూ పోతున్నామని చెప్పారు.పేదలు గర్వంగా తలెత్తుకుని చికిత్స చేయించుకుని, డిశ్చార్జ్‌ అయ్యేలా చర్యలు తీసుకున్నామన్న ఆయన, ఆ పేదవాడిని డాక్టర్లు కాని, ఆ ఆసుపత్రులు కాని చిన్నచూపు చూడకూడదన్న ఉద్ధేశ్యంతో ఆరోగ్యశ్రీకి సంబంధించిన పేమెంట్స్‌ అన్నీ గ్రీన్‌ ఛానల్‌లో పెట్టి చెల్లిస్తున్నామని చెప్పారు.

ఆరోగ్యశ్రీ పథకంలో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 1259 వైద్య ప్రక్రియలు అందుతుండగా, పశ్చిమ గోదావరి జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టు కింద మొత్తం 2200 వైద్య ప్రక్రియల సేవలందుతున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఇవాళ దాన్ని మరో ఆరు జిల్లాలకు విస్తరిస్తున్నామన్న సీఎం, ఆరోగ్యశ్రీ పథకంలో ఇది మరో మైలురాయి అని అభివర్ణించారు. అంతే కాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా ఏప్రిల్‌ 6న కరోనాను కూడా ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చామని, వారం క్రితం నాన్‌ ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లోనూ కరోనాకు చికిత్స చేయాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఇంకా దేశంలో తొలిసారిగా అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఒకేసారి 1088 అంబులెన్సులు ప్రవేశపెట్టామని, తద్వారా రాష్ట్రంలోని ప్రతి మండలంలో అత్యంత మెరుగైన సేవలందించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.

ఆరోగ్యశ్రీ కార్డులు:
అందుకే వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు ఉన్న వారికి కూడా పథకం అమలు చేస్తున్నామని, ఇంకా తొలిసారిగా 1.42 కోట్ల ఆరోగ్యశ్రీ కార్డులు క్యూఆర్‌ కోడ్‌తో ఇస్తున్నామని, ఆ కార్డులో రోగికి సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయని చెప్పారు. ఆ కార్డులలో ఇప్పటికే 1.38 కోట్ల కార్డుల పంపిణీ పూర్తి కాగా, మిగిలిన 4 లక్షల కార్డుల ముద్రణ కూడా పూర్తైందని,వీలైనంత త్వరగా వలంటీర్ల ద్వారా వాటిని అందజేస్తామని వెల్లడించారు. ఆరోగ్యశ్రీలో మంచి వైద్యం అందిస్తూ, నాడు–నేడు కార్యక్రమంలో ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.

ఇప్పటికే రాష్ట్రంలో 11 టీచింగ్‌ ఆస్పత్రులు ఉండగా, కొత్తగా 16 ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీంతో 27 టీచింగ్ ఆస్పత్రులు ఏర్పాటవుతాయని, దాదాపు రూ.16 వేల కోట్ల వ్యయంతో ఆస్పత్రుల రూపురేఖలు మార్చడంతో పాటు, కొత్త ఆస్పత్రులు, వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆస్పత్రులకు గ్రేడింగ్‌ ఇచ్చి, మెరుగైన వైద్య సేవలందిస్తున్నామని పేర్కొన్నారు.

మందులు–ప్రమాణాలు:
ఇంకా అన్ని ఆస్పత్రులలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), జీఎంపీ ప్రమాణాలతో కూడిన మందులు ఇస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌ వెల్లడించారు. గతంలో కేవలం 230 రకాల మందులు మాత్రమే ఇస్తుండగా, జనవరి నుంచి 500 రకాల మందులు ఇస్తున్నామని తెలిపారు.

విలేజ్‌ క్లినిక్స్‌:
గ్రామ సచివాలయాల పక్కనే అన్ని గ్రామాలలో 13 వేల వైయస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి, వాటిలో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు రోజంతా అందుబాటులో ఉంటారని, ఎవరికి బాగా లేకపోయినా వైద్యం అందిస్తారని, ఆ క్లినిక్‌లు అవి రెఫరల్‌ ఆస్పత్రులుగా పని చేస్తాయని తెలిపారు. ఆ క్లినిక్స్‌లో 54 రకాల మందులు కూడా ఉంటాయని చెప్పారు.

వైఎస్సార్‌ కంటి వెలుగు:
రాష్ట్రంలో దాదాపు 65 లక్షల పిల్లలకు వైఎస్సార్‌ కంటి వెలుగు పథకంలో వైద్య పరీక్షలు చేశామని, వారిలో 1.58 లక్షల మందికి కళ్లజోళ్లు కావాలని తేలితే వాటిలో 1.29 లక్షల మంది పిల్లలకు కళ్లజోళ్లు ఇచ్చామని, మిగిలిన 29 వేల కళ్లజోళ్లు కూడా ఈ నెలాఖరు నాటికి ఇవ్వబోతున్నామని సీఎం వెల్లడించారు. 2621 మంది పిల్లలకు ఆపరేషన్లు కావాలని తేలిందన్న ఆయన, వారికి కూడా స్కూళ్లు తెరిచాక, సెలవులు వచ్చినప్పుడు ఆపరేషన్లు చేయిస్తామని చెప్పారు.

వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు:
దీర్ఘకాలం వ్యాధులతో బాధ పడుతున్న వారికి పెన్షన్లు ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. దీర్ఘకాల వ్యాధులతో బాధ పడుతున్న వారికి రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు పెన్షన్లు కూడా ఇస్తున్నామన్న ఆయన, లెప్రసీ, తలసేమియా వంటి వ్యాధిగ్రస్తులకు, పక్షవాతంతో మంచానికే పరిమితమైన వారికి, వీల్‌ ఛైర్లకు పరిమితమైన వారికి రూ.10 వేల వరకు పెన్షన్‌ ఇస్తున్నామని చెప్పారు. 
WHATSAPP GROUP TELEGRAM GROUP

SEARCH THIS SITE

LATEST UPDATES

Varadhi worksheets class 1-10
Your Salary slip with One Click

TRENDING

SCERT TEXT BOOKS CLASS 1 TO 10

Mid Day Meal

NAADU NEDU

EDUCATIONAL APPS

JOBS/RESULTS/NOTIFICATIONS

ORDERS & PROCEEDINGS

TRANSFERS 2020

Top